పది రూపాయల నాణేన్ని తీసుకోకపోవడం నేరం : ఎస్బిఐ
పది రూపాయల నాణెం వాడకాన్ని విస్తృతం చేసేందుకు ఆర్బిఐతో కలిసి ఎస్బిఐ ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.

పది రూపాయల నాణే(Rs.10 Coin)న్ని నిరాకరించడం చట్టరీత్యా నేరమ(Offense)ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తెలిపింది. రిజర్వ్ బ్యాంకు(RBI)తో కలిసి ఎస్బిఐ, పది రూపాయల నాణెం వాడకంపై ఉన్న అపోహలను తొలగించడానికి నడుం బిగించింది. ఈ మేరకు వరంగల్(Warangal)లో ఓ అవగాహనాకార్యక్రమం నిర్వహించింది. ఈ మేరకు వ్యాపారస్థులు, ప్రజలకు పది రూపాయల నాణేలను పంచింది.
వరంగల్ ఎస్బిఐ జోనల్ కార్యాలయంలో హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్ ప్రకాశ్చంద్ర బరార్(Prakash Chandra Baror) ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, వ్యాపారస్థులు, చిన్న అమ్మకందార్లు, ప్రజల్లో పది రూపాయల నాణెం పట్ల నిరాసక్తత ఏర్పడిందని, ఇది విచ్ఛిన్నకరశక్తులు దేశంలో వ్యాపింపజేస్తున్న పుకార్లు(Fake News) మాత్రమేనని స్పష్టం చేసారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయమై ఎన్నోసార్లు స్పష్టతనిచ్చినప్పటికీ నాణెం అసలైంది కాదేమోననే సందేహం ఇంకా ప్రజల్లో ఉందని ఆయన అన్నారు. ఈ ప్రచారంలో భాగంగా అన్ని కిరాణాషాపులు, దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థల్లో కరపత్రాలు పంపిణీ చేస్తామని, అక్కడ చిన్న చిన్న పోస్టర్లు కూడా అంటిస్తామని ప్రకాశ్చంద్ర తెలిపారు. అంతే కాకుండా, అన్ని స్టేట్ బ్యాంక్(State Bank) బ్రాంచీల్లో నగదు ఉపసంహరణ సందర్భంగా పది రూపాయల నాణేలు కూడా ఇస్తామని, అలాగే వినియోగదారుల నుండి తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రూపాల్లో విడుదల చేసే అన్ని పది రూపాయల నాణేలు చట్టబద్ధమైనవే()Legal Tender)నని, జాతీయ కరెన్సీ స్థాయి వాటికి ఇవ్వబడిందని, కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో ఉంటాయి కాబట్టి వాటిని ఎవరూ నిరాకరించకూడదని కూడా ప్రకాశ్చంద్ర అన్నారు. వాటిని అన్ని రకాల లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు.
ఎవరైనా పది రూపాయల నాణెం తీసుకోవడానికి నిరాకరిస్తే(Denies Acceptance) భారతీయ న్యాయ సంహిత(BNS) సెక్షన్ 489ఏ, 489ఈ ప్రకారం నేరంగా పరిగణించి, చట్ట ప్రకారం శిక్షించవచ్చని ప్రకాశ్చంద్ర బరార్ హెచ్చరించారు.