Aamir Khan PK | 2014 నాటి హిట్ మూవీ పీకేపై ఇప్పుడు గోల.. లవ్ జిహాద్‌పై ఆమిర్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు

Aamir Khan PK | పీకే సినిమా బాక్సాఫీసుల వద్ద సృష్టించిన రికార్డుల పరంపర అందరికీ తెలిసిందే. 2014లో విడుదలైన ఈ సినిమా అన్ని సెక్షన్ల ప్రజానీకం ఆదరణ పొందింది. అయితే.. తాజాగా మరోసారి ఆ సినిమాపై విమర్శలు మొదలయ్యాయి. అదొక మత వ్యతిరేక సినిమా అనీ, అది లవ్ జిహాద్‌ను ప్రోత్సహిస్తుందని వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ‘వాళ్లు తప్పు. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. అన్ని మతాలను, అన్ని మతాల ప్రజలను మేం గౌరవిస్తాం. సాధారణ ప్రజల నుంచి డబ్బు గుంజే క్రమంలో చేసే మోసాల పట్ల ఎలా అప్రమత్తంగా ఉండాలో మా సినిమా చెబుతుంది. అలాంటి వారు ప్రతి మతంలోనూ కనిపిస్తారు. ఆ సినిమా ఉద్దేశం అదొక్కటే’ అని ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్‌ఖాన్ స్పష్టం చేశారు.
రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. మతం ముసుగులో కొందరు చేసే అక్రమాలను చూపించిన సినిమా అప్పట్లోనే చర్చనీయాంశమైంది. దీనితోపాటు ఒక హిందూ యువతి (అనుష్క), పాకిస్తానీ యువకుడు (శుశాంత్‌సింగ్) మధ్య ప్రేమ అనేది అంతర్లీనంగా చూపిస్తారు. కొంతమంది ఈ సినిమా లవ్ జిహాద్‌ను ప్రమోట్ చేస్తుందని ఆరోపించారు. ముస్లిం యువకులు హిందూ యువతులను ప్రేమ పేరిట ఆకర్షించి, వారిని మత మార్పిడి చేయిస్తున్నారని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విమర్శలు ఉన్నాయి. వీటిపై ఆమిర్‌ఖాన్ స్పందిస్తూ.. ‘నా కుమార్తె ఒక హిందూ యువకుడిని పెళ్లి చేసుకుంది. వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు ప్రత్యేకించి, హిందు, ముస్లింలు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారంటే అది ప్రతిసారీ లవ్ జిహాద్ కాబోదు. అది మానవత. అది మతం కంటే గొప్పది’ అని చెప్పారు. ‘నా చెల్లెలు నిఖత్.. సంతోష్ హెగ్గేను పెళ్లి చేసుకుంది. నా ఇద్దరు భార్యలు హిందువులే. నా కుతూరు ఇరా ఖాన్.. ఒక హిందువును పెళ్లి చేసుకుంది. దీనర్థం .. ఇది కూడా లవ్ జిహాదేనా?’ అని ప్రశ్నించారు. ఆమిర్‌ఖాన్ చెల్లెలు ఫర్హత్ రాజీవ్ దత్తా అనే హిందువును పెళ్లి చేసుకుంది. సోదరి నిఖత్ సంతోష్ హెగ్డే అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. ఆమిర్ కుమార్తె ఇరా ఖాన్.. ఇటీవలే నుపుర్ శిఖారే అనే హిందువును పెళ్లి చేసుకుంది. ఆమిర్ మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్‌రావు హిందువులు.
హిందూ భార్యలు ఉండి.. పిల్లలకు ముస్లిం పేర్లు.. ఇరా ఖాన్, జునైద్‌ఖాన్, ఆజాద్ రావు అని పెట్టడాన్ని ప్రశ్నించగా.. పిల్లలకు పేర్లు పెట్టడంలో తన ప్రమేయం ఏమీ లేదని తన భార్యలే పిల్లలకు ఆ పేర్లు పెట్టారని తెలిపారు. ‘కొన్ని విషయాల్లో భర్తల మాట చెల్లదు’ అని వ్యాఖ్యానించారు. ఇరా ఖాన్ పేరును బీజేపీ మంత్రి మనేకా గాంధీ పుస్తకం ‘ది పెంగ్విన్ బుక్ ఆఫ్ హిందూ నేమ్స్’ నుంచి తీసుకున్నట్టు తెలిపారు. కొడుకు ఆజాద్ పేరును తన పూర్వీకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా ఆజాద్ స్ఫూర్తితో పెట్టినట్టు వివరించారు.