Siddharth | భరింపలేని తన యాటిట్యూడ్.. సిద్ధార్థ నోటిదూలే అతని పతనానికి కారణమా..!
తమిళ నటుడు సిద్ధార్థ్.. తెలుగులో కూడా ఫేమస్..కాదు..కాదు.. తెలుగు సినిమాల వల్లే ఫేమస్. బొమ్మరిల్లు తనను ఓవర్‌నైట్ స్టార్‌ను చేస్తే, కొంచెం ఇష్టం కొంచెం కష్టం రొమాంటిక్ హీరోగా ఇమేజ్ను కట్టబెట్టింది. కానీ, తన పొగరుబోతుతనం వల్ల నోటి దురుసు వల్ల కెరీర్‌ను సర్వనాశనం చేసుకున్నాడు.

సిద్ధార్థ్ సూర్యనారాయణ్(Actor Siddharth).. ఇలా అంటే ఎవరికీ తెలియదు. కానీ, సిద్ధార్థ అంటే మాత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు. అచ్చ తమిళ పిల్లగాడు. కానీ తెలుగులోనే ఎదిగాడు. 2002లో తొలి, మలి చిత్రాలు తమిళమే అయినప్పటికీ, 2005లో తెలుగులో నటించిన తొలిసినిమా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’(Nuvvostanante Nenoddantana) దద్దరిల్లేపోయే హిట్‌గా నిలిచింది. సిద్ధార్థ, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం అప్పట్లో యువ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పాటలన్నీ కూడా సూపర్‌హిట్. దాని వెంటనే 2006లో వచ్చిన బొమ్మరిల్లు(Bommarillu)తో స్టార్ హీరో ఇమేజ్ సంపాందించుకున్నాడు. తమన్నాతో చేసిన’ కొంచెం ఇష్టం కొంచెం కష్టం’(KIKK) సినిమా బంపర్ హిట్ అయ్యి ఆయనకు ఇక్కడ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చింది. అక్కన్నుండీ వరుసగా తెలుగు సినిమాలు మాత్రమే చేసుకుంటూ బతికిన సిద్ధార్థ, 8 ఏళ్ల తరువాత తన మాతృభాష తమిళంలోకి(After 8 years into Tamil) పున:ప్రవేశించాడు. ఆ తరువాత మళ్లీ తెలుగు మొహం చూడలేదు. చూడలేదు కాదు.. మనవాళ్లు తీసుకోలేదు. కారణం నోటి దురద(loose Tongue).
కాంట్రావర్సీ(Contraversy)లు సిద్ధార్థకేం కొత్త కాదు. భరింపలేని తన యాటిట్యూడ్(Attitude) చాలా సినిమాలను దూరం చేసింది. నోటికొచ్చినట్లు మాట్లాడటం, తర్వాత సారీ చెప్పడం తనకు అలవాటుగా మారింది. నిన్నటినిన్న హైదరాబాద్‌లో జరిగిన భారతీయుడు 2 ప్రి రిలీజ్ వేడుకలో ఇలాగే అడ్డదిడ్డంగా మాట్లాడి చులకనయ్యాడు. తెలుగు మీడియాను చిన్నచూపు చూసే ఈ తమిళ అబ్బాయి తెలుగు సినిమాలే తనకు అన్నం పెట్టాయన్న సంగతి మర్చిపోయినట్లున్నాడు. డ్రగ్ రహిత సమాజం కోసం ‘తెలంగాణ ముఖ్యమంత్రి కోరినట్లుగా ఓ చిన్న యాడ్ చేస్తారా? భారతీయుడు 2 తరపున’ అని అడిగినందుకు సిద్ధార్థ ముందుకొచ్చి ‘ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రీ మమ్మల్ని ఇలా అడగలేదు’ అనీ, నటీనటులెప్పడూ బాధ్యతాయుతంగా ఉంటారు. ఎవరూ చెప్పనవసరం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. అంతేకాక, ఈ ప్రశ్నకు మీరు జవాబివ్వాల్సిన అవసరం లేదంటూ కమల్ హాసన్‌ను, రకుల్‌ప్రీత్ సింగ్‌ను వారించాడు.అసలు ప్రశ్న వేసింది అయన్ను కాదు. కమల్‌హాసన్‌ను. తగుదునమ్మా అంటూ మధ్యలో దూరి దిక్కుమాలిన కామెంట్లెందుకు? బాధ్యతాయుతంగా ఉంటారంట. ఎవరూ? ఎప్పుడూ? సుచీలీక్స్(#Suchileaks)తో తమిళ సినీ నాయికానాయకుల రాసలీలల విడియోలు ప్రపంచమంతా చుట్టొచ్చాయి. అసలు డ్రగ్స్ దేశంలోకి ప్రవేశించిందే సినీ నటుల వల్ల. పోలీసులనడిగితే కావల్సినన్ని వివరాలు ఇస్తారు. వీరికి అసలు బాధ్యతెక్కడిది.?
ఇంతకుముందు చాలాసార్లు ప్రెస్మీట్లలో ఇలాగే నోటి దురుసు ప్రదర్శించి మీడియా ఆగ్రహానికి కారణమయ్యాడు. తనేదో భారతీయుడు సినిమాని హీరో, దర్శకుడు అయినట్లు అతిగా మాట్లాడి అక్కడున్నవారందరికీ చిరాకు తెప్పించాడు. అదే ఫంక్షన్లో మాట్లాడుతూ, 20ఏళ్ల క్రితం శంకర్ తీసిన ‘బాయ్స్’తో ఇప్పటిదాకా బతికాను. ‘భారతీయుడు 2’ తో ఇంకో 20యేళ్లు బతుకుతాను అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. బాయ్స్ తర్వాత ఒక్కటంటే ఒక్క తమిళ సినిమా చేయని సిద్ధార్థ, పూర్తిగా తెలుగు సినిమాలపైనే ఆధారపడ్డాడు. ఇప్పుడేమైనా తనకు లైఫ్ ఉందంటే అది తెలుగు చిత్ర పరిశ్రమ భిక్ష. అది అతను తెలుసుకోవాలి. తమిళుడు కాబట్టి తమిళాభిమానం మంచిదే, కానీ అన్నం పెట్టిన భాషకు సున్నం పెడితే ఉన్నది కూడా ఊడిపోతుంది. ఇప్పటికైనా ఈ నోటి దూల, పొగరు తగ్గించుకుంటే ఇంకొంతకాలం సినిమాల్లో ఉంటాడు. లేకపోతే…!