షూటింగ్ లో అడవి శేషు.. మృణాల్ ఠాకూర్ కు గాయాలు

విధాత: ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కు ఓ సినిమా షూటింగ్ లో గాయాలైనట్లుగా వెల్లడైన సమాచారం అభిమానులను కలవరపెడుతుంది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో(Ramoji Film City) జరుగుతున్న డెకాయిట్’ షూటింగ్ స్పాట్ లో జరిగిన ప్రమాదంలో హీరో హీరోయిన్లు అడవిశేష్(Adivi Sesh), మృణాల్ ఠాకూర్ లకు గాయాలైనట్లుగా కథనం. షూటింగ్ లో ప్రమాదవశాత్తూ క్రింద పడటంతో వారికి కాస్త గట్టిగానే గాయాలు అయినట్టు టాక్. అయితే ఆ గాయాలతోనే వారిద్దరూ కూడా షూటింగ్ కంప్లీట్ చేశారని సమాచారం. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ లకు చిన్న గాయాలు తగిలాయని అందోళన పడాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. అయితే ఈ గాయాల కారణంగా గ్లామర్ తార హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు ఏమైందోనని అభిమానులు కలవరపడుతున్నారు.
అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్నయాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘డెకాయిట్’(Dacoit). షానీల్ డియో(Shaneil Deo) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios) సమర్పణలో సుప్రిత యార్లగడ్డ నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీలో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తెలుగులో సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ పక్కన సీతామహలక్ష్మిగా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ అందం..అభినయంతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచింది. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో తన నటన, గ్లామర్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తాజాగా బాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ హీరో అజయ్ దేవగణ్ తో కలిసి నటించిన సన్నాఫ్ సర్ధార్ 2 సినిమా జూలై 25న విడుదల కావాల్సి ఉండగా..ఆగస్టు 1కి వాయిదా పడింది. మొన్నటి వరకు ఈ సినిమా ప్రమోషన్స్ లో మృణాల్ సందడి చేసింది. ఇక అడవి శేష్ మేజర్ సినిమా తర్వాత గూఢచారి 2తో పాటు డెకాయిట్ సినిమా చేస్తున్నాడు.