Kunickaa Sadanand | నా జీవితంలో 4 ప్రేమలు, 2 సహజీవనాలు, 2 విడాకులు : కునికా సదానంద్ బోల్డ్ స్టేట్మెంట్
హిందీ బిగ్‌బాస్ 19లో కునికా సదానంద్ తన ప్రేమజీవితం, మద్యాసక్తి, విడాకుల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ‘రెండు లివ్ ఇన్, నాలుగు ప్రేమలు, రెండు విడాకులంటూ చేసిన కామెంట్లు వైరల్.

Bigg Boss 19: Kunickaa Sadanand reveals her past — 2 live-ins, 4 romances, 2 marriages
(విధాత వినోదం డెస్క్)
ముంబయి: బాలీవుడ్ సీనియర్ నటి, గాయని, లాయర్, వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన కునికా సదానంద్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ 19 షోలో పాల్గొంటున్న ఆమె, తన వ్యక్తిగత జీవితంలోని అనేక రహస్యాలను బహిరంగంగా పంచుకోవడం షోలో హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె తన ప్రేమజీవితం, మద్య వ్యసనం, విడాకుల గురించి చెప్పిన వివరాలు ప్రేక్షకులను షాక్‌కు గురి చేశాయి.
తన సహపోటీదారులైన గౌరవ్ ఖన్నా, మ్రిదుల్ తివారి, ప్రణీత్ మోర్ లతో జరిగిన చర్చలో కునికా “నేను డ్రగ్స్ ఎప్పుడూ వాడలేదు కానీ, ఒక దశలో మద్యానికి బానిస అయ్యాను. బ్రేకప్ తర్వాత మానసికంగా బాగా కృంగిపోయాను. రాత్రింబవళ్ళు మద్యం సేవించడం నా అలవాటుగా మారింది. ఒకసారి డబ్బింగ్ చెప్పేటప్పుడు అద్దంలో నా రూపం చూసి నాకే అసహ్యమేసింది,” అని చెప్పింది.
తన తండ్రి ఎప్పుడూ “ఇతరుల డబ్బుతో మద్యం తాగొద్దు” అని హెచ్చరించేవారని గుర్తుచేసుకున్న కునికా, ఓ డిన్నర్ డేట్‌లో తనతో ఉన్న వ్యక్తి రూ.20 వేల విలువైన శాంపైన్ తెప్పించి, ఆ తరువాత దాని ఖర్చు గురించి చెప్పడంతో తానెంత అవమానంగా ఫీల్ అయ్యానో వివరించింది. అప్పటి నుంచి ఇలాంటి ఆహ్వానాలను తిరస్కరించానని చెప్పింది.
తన ప్రేమజీవితం గురించి ప్రశ్నించగా కునికా కుండబద్దలు కొట్టింది. “నా జీవితంలో రెండు సహజీవనాలు, నాలుగు ప్రేమలు ఉన్నాయి. అంతేకాకుండా రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నాను. విడాకులు కూడా తీసుకున్నాను. 60 ఏళ్ల వయసులో ఇది తప్పేమీ కాదు” అని నవ్వుతూ చెప్పింది. గౌరవ్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, “నేను ఎప్పుడూ ఏ నటుడిని ప్రేమించలేదు. వాళ్లు తమపై తాము మక్కువ చూపుతారు కాబట్టి, ఇతరులను ప్రేమించలేరు. అద్దంలో తమ ముఖమే చూసుకుంటారు — ‘నేను ఎలా ఉన్నాను?’ అని,” అంటూ సినీ నటుల స్వభావంపై వ్యాఖ్యానించింది.
కునికా మొదట అభయ్ కొఠారిని వివాహం చేసుకుంది. ఆ వివాహం ద్వారా ఒక కుమారుడు పుట్టాడు. ఆ తరువాత విడాకులు తీసుకుంది. ఎనిమిదేళ్లపాటు కుమారుడి కస్టడీ కోసం పోరాడి చివరికి వదులుకుంది. తర్వాత వినయ్ లాల్‌ను వివాహం చేసుకుంది. వారికీ ఆయాన్ లాల్ అనే కుమారుడు ఉన్నాడు. ఆ వివాహం కూడా విడాకులతో ముగిసింది.
1990లలో సింగర్ కుమార్ సానుతో దీర్ఘకాల లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు ఆమె అంగీకరించింది. అయితే ఆ సంబంధం విషపూరితమైందని, తల్లి జీవితంపై దాని ప్రభావం తీవ్రంగా పడిందని ఆమె కుమారుడు ఆయాన్ ఒకసారి వెల్లడించాడు.
ప్రస్తుతం బిగ్‌బాస్ 19లో తన గతజీవితాన్ని ధైర్యంగా పంచుకుంటున్న కునికా సదానంద్ — తన గతంలోని చీకటి కోణాలను వెల్లడి చేస్తూ మానసికంగా తానెంత బలవంతురాలో చూపిస్తున్నారు. ఆమె కథ అనేకమంది మహిళలకు ఒక పాఠంలా నిలుస్తుందని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.