Empuraan | మోహన్‌లాల్‌ సినిమా ఎంపురాన్‌పై రాజుకున్న అగ్గి.. బాయ్‌కాట్‌ చేయాలంటూ గగ్గోలు

‘భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు అబద్ధాలు, మతపరమైన విద్వేషాల నింపే కేరళ స్టోరీ, కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలను ప్రోత్సహించారు. ఇప్పుడు వారే ఎంపురాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు’ అని కేరళ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు, పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూట్టతిల్ అన్నారు.

Empuraan | మోహన్‌లాల్‌ సినిమా ఎంపురాన్‌పై రాజుకున్న అగ్గి.. బాయ్‌కాట్‌ చేయాలంటూ గగ్గోలు

Empuraan |

మోహ‌న్‌లాల్ న‌టించిన లూసిఫ‌ర్ చిత్రానికి కొన‌సాగింపుగా రూపొందిన ఎల్‌2: ఎంపురాన్‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గురువారం విడుద‌లై.. సంచ‌ల‌నం సృష్టిస్తున్నది. మిశ్రమ రివ్యూలు వస్తున్నా.. బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి కలెక్షన్లనే రాబడుతున్నది. అయితే.. ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ కొన్ని మితవాద గ్రూపులు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారాలపై గగ్గోలు పెడుతున్నాయి. ఈ సినిమాకు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించాడు. 2019లో విడులైన బ్లాక్ బస్టర్ లూసిఫర్‌కు ఇది సీక్వెల్‌.

లూసిఫర్ మొత్తం మూడు భాగాలుగా విడుదల కావాల్సి ఉండగా.. ఇది రెండవది. 2002 నాటి గుజరాత్ అల్లర్లు, కొనసాగిన హింస సన్నివేశాలతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. సినిమాలో ప్రధాన విలన్ పేరు బాబా బజరంగి. ఆయన ఒక హిందూ జాతీయ పార్టీకి నాయకుడు. ఇప్పుడు అదే ఈ సినిమాపై వివాదానికి ప్రధాన కారణంగా నిలిచింది. దీంతో కొందరు నెటిజన్లు ఇది హిందూ వ్యతిరేక సినిమా అంటూ ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నారు. తమ సిద్ధాంతాలను నెగెటివ్ ధోరణిలో చూపారంటూ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.

గుజ‌రాత్ అల్ల‌ర్ల ప్ర‌స్తావ‌న‌లు

సినిమాలో సుమారు ప‌దిహేను నిమిషాల‌పాటు.. గుజ‌రాత్‌లో కాషాయ‌ దుస్తులు ధరించినవారు ప్ర‌యాణిస్తున్న‌ స‌బ‌ర్మ‌తి ఎక్స్‌ప్రెస్ మంట‌ల్లో ఉండ‌టం, ముస్లింలు హ‌త్యకు గురికావడం, వీధుల్లో అల్ల‌ర్లు గుర్తుకు తెచ్చేలా స‌న్నివేశాలు ఉన్నాయి. కొన్ని స‌న్నివేశాలు .. 11 మంది జైలుకు వెళ్లేందుకు కారణమైన బిల్కిస్‌బానోపై లైంగిక‌దాడి, ఆమె కుటుంబంలో ప‌లువురిని హ‌త్య ఘటనలను గుర్తుకు తెస్తాయి.

బ‌జ‌రంగ్ ద‌ళ్ నాయ‌కుడు బాబు బ‌జ‌రంగిని ప్ర‌స్తావించేలా ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర అయిన బాబా బ‌జ‌రంగి పాత్ర ఉన్న‌ద‌ని ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. న‌రోడా పాటియా మార‌ణ‌కాండ‌ కేసులో బాబు బ‌జ‌రంగిపై జీవిత ఖైదు విధించిన విష‌యం తెలిసిందే. వీటిని చూసిన మిత‌వాద గ్రూపులు ఈ సినిమా హిందువుల‌ను విల‌న్లుగా చూపుతున్న‌ద‌ని మండిప‌డుతున్నారు. ఆన్‌లైన్‌లో ప్ర‌ధానంగా పృథ్వీరాజ్‌, మోహ‌న్‌లాల్‌పై దాడిని కేంద్రీక‌రించినా.. కొంద‌రు ఈ సినిమా స్క్రిప్ట్ రైట‌ర్ ముర‌ళి గోపీని సైతం టార్గెట్ చేశారు.

సినిమాకు బీజేపీ స‌మ‌ర్థ‌న‌

అయితే.. ఈ వివాదంపై స్పందించిన‌ కేర‌ళ బీజేపీ నేత‌లు మాత్రం ఆ సినిమా ఫిక్ష‌న్ మాత్ర‌మేన‌ని, అంత‌కు మించి ఏమీ లేద‌ని అంటున్నారు. ఎల్‌2 ఎంపురాన్‌ను రాజ‌కీయం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని బీజేపీ నేత ఎంటీ ర‌మేశ్ చెప్పారు. సినిమాను సినిమాలానే చూడాల‌ని అన్నారు. కేర‌ళ ప్ర‌జ‌ల‌కు ఆ విజ్ఞ‌త ఉన్న‌ద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సంఘ్‌ప‌రివార్‌కు వ్య‌తిరేకంగా ఎన్ని సినిమాలు వ‌చ్చాయి? సినిమాల‌పై ఆధార‌ప‌డి ఈ దేశంలో సంఘ్‌ప‌రివార్ ప‌నిచేస్తున్న‌దా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఈ సినిమాకు శుభాకాంక్ష‌లు తెలిపిన‌ బీజేపీ కేర‌ళ స్టేట్ ప్రెసిడెంట్ రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్‌కు సైతం మిత‌వాద గ్రూపుల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ఈ సినిమాకు వ్యతిరేకంగా తామెలాంటి ఆందోళనలు నిర్వహించబోవడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పీ సుధీర్ చెప్పారు.

సాహసమన్న సీపీఎం

ఈ సినిమాలో వామ‌ప‌క్ష పార్టీల‌పైనా కొన్ని విసుర్లు ఉన్నాయి. అయితే.. నేటి భార‌త‌దేశ ప‌రిస్థితుల్లో 2002 నాటి గుజ‌రాత్ అల్ల‌ర్ల‌ను చూపుతూ భారీ బ‌డ్జెట్ సినిమా తీయ‌డం అత్యంత సాహ‌సోపేత‌మైన చ‌ర్య అని సీపీఎం కేర‌ళ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కొడియారి బాల‌కృష్ణ కుమారుడు, ఆ పార్టీ నాయ‌కుడు బినీశ్ కొడియారి ప్ర‌శంస‌లు కురిపించారు. అంతేకాదు.. ఈ సినిమాకు పూర్తి మద్దతునిస్తూ.. అందరూ ఈ సినిమా చూడాలని పిలుపునివ్వడం కేరళలో మరింత రచ్చ రాజేసింది. కేరళ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకుడు, పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూట్టతిల్ మాట్లాడుతూ మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌పై విద్వేష ప్రచారాన్ని సహించేది లేదని చెప్పారు.

‘భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కొందరు అబద్ధాలు, మతపరమైన విద్వేషాల నింపే కేరళ స్టోరీ, కశ్మీర్ ఫైల్స్ వంటి సినిమాలను ప్రోత్సహించారు. ఇప్పుడు వారే ఎంపురాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు’ అని ఆయన తన ఫేస్‌బుక్‌లో రాశారు. ఈ సినిమాపై వివాదం విష‌యంలో తాను మౌనాన్ని పాటిస్తాన‌ని స్క్రిప్ట్ రైట‌ర్ ముర‌ళి గోపీ అన్నాడు. ప్ర‌తి ఒక్క‌రికీ ఈ సినిమాను వాళ్ల కోణంలో అన్వ‌యించుకునే హ‌క్కు ఉంటుంద‌ని చెప్పాడు. దేశంలో రాజకీయ, సామాజిక పరిస్థితుల ప్రస్తావన ఈ సినిమాలో ఉన్నదని, కొందరు దానికి వ్యతిరేకంగా స్పందిస్తే, మరికొందరు ఆమోదించారని అన్నారు.