Manchu Vishnu: నేను చేసిన తప్పే.. కన్నప్ప ఆలస్యానికి కారణం

Manchu Vishnu: కన్నప్ప సినిమా నిర్మాణంలో నేను చేసిన పెద్ద తప్పునే సినిమా విడుదల ఆలస్యానికి కారణమైందని హీరో మంచు విష్ణు వెల్లడించారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో ప్రితీ ముకుందన్ హీరోయిన్ గా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన కన్నప్ప సినిమా ప్రమోషన్ లో భాగంగా మంచు విష్ణును నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇంటర్య్వూ చేశారు. సినిమా ఆలస్యంపై స్పందిస్తూ ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ వర్క్స్ లో తగిన ప్రావీణ్యం లేని వ్యక్తిని తీసుకున్నానని అందుకే సినిమా ఆలస్యమైందన్నారు. అదే తాను చేసిన పెద్ద తప్పు అని వెల్లడించారు. సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు యూనిట్ అంతా కష్టపడుతుందన్నారు.
కన్నప్ప సినిమా నిర్మాణంతో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని మంచు విష్ణు తెలిపారు. తొలుత 2014లో రచయిత, సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కన్నప్ప సినిమా సలహా ఇచ్చారని..అది నచ్చి విదేశాల నుంచి నిపుణులను రప్పించి సినిమా కథనాన్ని డెవలప్ చేయించానన్నారు. ఆ తర్వాతా నా ఆసక్తిని గమనించి..సినిమాను భారీ స్థాయిలో చేయమనడంతో కథను అందుకు తగ్గట్లుగా..నా వెర్షన్ లో రూపొందించానన్నారు. మహాభారతం దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ కన్నప్ప దర్శకుడిగా న్యాయం చేస్తారని నాన్న చెప్పారని…నాన్న మద్దతు..శివుడి ఆజ్జతో సినిమా తీశానన్నారు. చిత్ర నిర్మాణ బృందంలో ప్రతి ఒక్కరు తనకు సహకరించారని. వారిందరికి ఎంతో రుణపడి ఉంటానన్నారు. ముందుగా రూ.100కోట్లలోపు బడ్జెట్ తోనే కన్నప్ప పూర్తవుతుందనుకున్నానని..అనుకున్నదానికంటే రెట్టింపు ఖర్చు అయ్యిందన్నారు.
ఇకపోతే కన్నప్ప సినిమా విషయంలో నన్ను ప్రోత్సహించిన ప్రభాస్ కు ఎప్పటికి రుణపడి ఉంటానని..రుద్ర పాత్ర ప్రభాస్ కు మైలురాయిలా నిలుస్తుందని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. నాన్న పాత్రకు..ప్రభాస్ కు మధ్య సన్నివేశం హైలట్ గా నిలుస్తుందన్నారు. కాగా ఈ ఇంటర్య్వూలో మంచు మోహన్ బాబు కుటుంబ వివాదంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విచారం వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ మీ చొరవతో కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తానని విష్ణు పేర్కొనడం విశేషం. కాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, రెబల్ స్టార్ ప్రభాస్ లు కూడా నటించిన కన్నప్ప సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధమవుతుంది.