100 Crore Political Deal | పంచాయతీ అంతా ఆ 100 కోట్ల చుట్టూనే?!
వంద కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందట.. కానీ.. ఒక నాయకుడికి అందులో వాటా వెళ్లలేదట! వాకబు చేస్తే మొత్తం వంద కోట్లూ ఒక్కళ్లే తీసుకుని వెళ్లిపోయారట! ఇదీ అసలు వివాదానికి కథట!

హైదరాబాద్, అక్టోబర్ 18 (విధాత ప్రతినిధి):
100 Crore Political Deal | సెటిల్మెంట్ వాటాల్లో తేడా వచ్చిందా ? వసూలు అయిన సొమ్ము ఒక్కరే నొక్కేశారా! స్థానిక నాయకుడికి తెలియకుండా చేసిన ఆపరేషన్ వికటించిందా? ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. రూ.100 కోట్ల సెటిల్మెంట్‌లో తనకు వాటా రాలేదంటే.. తనకు రాలేదనేలా రచ్చ రేగిందని అంటున్నారు. తన ఇలాఖాలో తనకు మాట మాత్రం చెప్పకుండా రూ.100 కోట్లు ముక్కు పిండి వసూలు చేశారంటూ స్థానిక నాయకుడు లబోదిబోమంటున్నాడు. రాష్ట్రాన్ని రెండు రోజులుగా కుదిపేస్తున్న ఈ ఘటనకు సంబంధించి ప్రచారంలో ఉన్న అంశాలు విస్తుగొలుపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పరువు బజారున పడే విధంగా బడా సెటిల్మెంట్‌పై విశ్వసనీయంగా అందిన సమాచారం ఇలా ఉంది.
దక్షిణ తెలంగాణలోని ఒక జిల్లాలో పారిశ్రామికవేత్త నాలుగు దశాబ్ధాలుగా కంపెనీ నడిపిస్తున్నారు. ఆ కంపెనీలో మూడు వారాల క్రితం కార్మికులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. పోలీసులు రంగంలో దిగినా కార్మికులు శాంతించకపోగా వాహనాలను నిప్పంటించడమే కాకుండా ఎస్సై, కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డారు. కృష్ణా నది ఒడ్డున కంపెనీ ఏర్పాటు చేసిన యజమాని కొన్ని సంవత్సరాల నుంచి కలుషిత జలాలను నదిలోకి వదలడమే కాకుండా పరిసర గ్రామాలను పూర్తిగా కలుషితం చేశారని పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా స్థానిక అధికారులు కానీ, రాష్ట్రస్థాయి అధికారులు కానీ కఠిన చర్యలు తీసుకోలేదు. వందల ఎకరాల అటవీ భూములను ధ్వంసం చేసినా స్థానిక నాయకుడు ప్రభుత్వంపై ఒత్తిడి తేకుండా మిన్నకుండి పోయారు. ఈ అటవీ భూముల వ్యవహారమే తాజా వివాదానికి కేంద్ర బిందువు అయిందని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతున్నది.
ఈ వివాదాన్ని పరిష్కరించాలని రాష్ట్రానికి చెందిన ముఖ్య నేత ఒకరు తన అనుంగు శిష్యుడిని పురమాయించారని సమాచారం. ఇప్పటికే ఆయన షాడో నేతగా నగరంలో ప్రచారం పొందాడు. రంగుల ప్రపంచంలో ఆయన తన హవాను నడిపిస్తున్నాడనే ‘ఖ్యాతి’నీ పొందాడు. ముఖ్య నేత చెప్పడంతో వెంటనే రంగంలోకి దిగిన షాడో నేత తన పని వెంటనే మొదలు పెట్టారు. ఈయనకు ముఖ్య నేత ఇంటి సమీపంలో సెటిల్మెంట్ల కోసం ప్రత్యేక కార్యాలయం ఉందని ప్రచారం సాగుతున్నది. అక్కడికి స్పెషల్ డ్యూటీ అధికారిని పిలిపించుకున్నారని, కంపెనీ కార్యకలాపాలు, అక్రమ తవ్వకాలు, అటవీ భూముల ఆక్రమణ వంటి అంశాలను పూసగుచ్చి వివరించాడని అంటున్నారు. వీళ్లు చర్చించుకుంటున్న సమయంలో కంపెనీ యజమానులు కూడా అక్కడకు చేరుకున్నారని, అందరూ కలిసి మాట్లాడుకున్న తరువాత కూడా ఏకాభిప్రాయం రాలేదని ప్రచారం జరుగుతున్నది. ఈలోపు స్పెషల్ డ్యూటీ అధికారి లేచి, తన జేబులో నుంచి పిస్తోల్ తీసి, ‘చెప్పినట్లు వింటావా లేదా?’ అంటూ బెదిరింపులకు దిగాడని సమాచారం. దీంతో మాటా మాటా పెరిగిందని, అయితే.. షాడో నేత జోక్యంతో సద్ధుమణిగిందని వినిపిస్తున్నది. ‘కొన్నేళ్ల నుంచి అక్రమాలకు పాల్పడుతున్నారు. స్థానిక ప్రభుత్వ అధికారులను మేపుతున్నారు. మేము డబ్బులు అడిగితే తప్పా?’ అని షాడో నేత ప్రశ్నించారని, ఇప్పటి దాకా జరిగిందేదో జరిగింది, ఇక నుంచి మేము చెప్పినట్లు నడుచుకోవాల్సిందేనని హుకుం జారీ చేశాడని తెలుస్తున్నది. దీంతో కంపెనీ యజమాని చేసేది లేక సరేనంటూ తలూపాడని, రూ.100 కోట్లు కప్పం చెల్లించేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో అప్పటికి కథ ముగిసి, ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారని సమాచారం.
అసలు కథ అక్కడే మొదలు?
ఆ తరువాత సదరు కంపెనీ యజమాని, స్పెషల్ డ్యూటీ అధికారిని కలిసి రూ.100 కోట్ల చెల్లింపులు కూడా పూర్తి చేసి దండం పెట్టాడట. అయితే.. కంపెనీ యజమాని డబ్బులు ఇచ్చిన విషయాన్ని షాడో నేతకు స్పెషల్ డ్యూటీ అధికారి కనీసం సమాచారం ఇవ్వలేదని, వాటా కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా పంపించలేదని తెలుస్తున్నది. వాటా రాకపోవడం, కనీసం సమాచారం కూడా లేకపోవడంతో స్థానిక నాయకుడు ఆరా తీయడంతో అసలు విషయం తేలడంతో స్థానిక నాయకుడు కంగుతిన్నారని చెబుతున్నారు. తన నియోజకవర్గంలో, తన మనిషిగా చెప్పుకొనే యజమానే ఇలా చేశాడేంటి? అనుకుంటూ తనదైన స్టైల్‌లో ఆపరేషన్ మొదలు పెట్టారని, నేరుగా రాష్ట్ర నేతను కలిసి తన నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన గురించి చెబుతూ ఇదేం పద్ధతని అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ఒకరి పరిధిలోకి మరొకరు వచ్చి, రౌడీయిజానికి పాల్పడటమేంటని ప్రశ్నించారని తెలిసింది. అయితే.. ఈ విషయం తనకు తెలియదని చెప్పిన సదరు ముఖ్య నేత.. వెంటనే విషయం కనుక్కోవాలని తన వేగులను పురమాయించారని, వేగులు ఇచ్చిన సమాచారంతో అంతా రట్టయిందని ప్రచారం జరుగుతున్నది. కంపెనీ యజమాని నుంచి వసూలు చేసిన రూ.100 కోట్లు స్పెషల్ డ్యూటీ అధికారి తీసుకుని వెళ్లి, తన అధినేత కుమార్తెకు అప్పగించినట్లు వేగులు రాష్ట్ర ముఖ్య నేతకు సమాచారం ఇచ్చారని తెలుస్తున్నది. ఇంకేముంది రాష్ట్ర ముఖ్య నేత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఫలితంగానే స్పెషల్ డ్యూటీ అధికారిని తొలగిస్తూ ఉత్తర్వుల వెలువడటం చకచక జరిగిపోయాయని చెబుతున్నారు.
మరో ఘన కార్యమూ ఉందట!
ఇదే కాకుండా స్పెషల్ డ్యూటీ అధికారి మరో ఘన కార్యానికి బరితెగించాడని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి… జాతర కోసం రూ.70 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశారు. ఈ పనులు రాష్ట్ర ముఖ్య నేత ఆదేశం మేరకు జరుగుతుండటంతో.. తన ఇలాఖాలో తనకు తెలియకుండా పనులు అప్పగిస్తారా? అంటూ ఆగ్రహంతో ఉన్న నాయకురాలు రంగంలోకి దిగింది. స్పెషల్ డ్యూటీ అధికారి సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేశాడు. రూ.70 కోట్ల పనుల్లో పదిహేను శాతం వాటా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. వాటా ఇవ్వకుండా పనులు మొదలు పెడితే అంతు చూస్తామని హెచ్చరించాడు. బెదిరిస్తున్నారని, పనులు చేయడం కష్టమని సదరు కాంట్రాక్టర్ చేతులెత్తేశాడు. ఈ విషయం కూడా రాష్ట్ర ముఖ్య నేత దృష్టికి వెళ్లడం, స్పెషల్ డ్యూటీ అధికారిని ఇంటికి పంపడం, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలయ్యాయని ప్రచారం జరుగుతున్నది.
ఇవి కూడా చదవండి..
Elephant calf Video | అడవిలో అమ్మతనపు గొప్పతనం – వైరల్ వీడియో
Telangana Ranks 1st In Phone Recovery | సెల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్
Top Maoist Leader Ashanna Surrenders | చత్తీస్ గఢ్ సీఎం ముందు లొంగిన ఆశన్న టీమ్ 208మంది
కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ చిచ్చు..సీఎం రేవంత్ కూ తప్పని వార్నింగ్