కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ చిచ్చు..సీఎం రేవంత్ కూ తప్పని వార్నింగ్
కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ చిచ్చు..సీఎం రేవంత్ కూ తప్పని వార్నింగ్..వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఇదే పరిస్థితి తప్పదని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీకి ఈ అనుభవం కావాల్సిందేనని, చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత అంటూ రేవంత్ రెడ్డి పై సెటైర్లు వేస్తున్నారు.

- కాంగ్రెస్‌లో కొండా ఫ్యామిలీ చిచ్చు
- సీఎం రేవంత్ కూ తప్పని వార్నింగ్
- అనుభవించు రాజా అంటున్న పార్టీ క్యాడర్ !
విధాత, ప్రత్యేక ప్రతినిధి: కొండా ఫ్యామిలీ పేరెత్తగానే వివరాలు చెప్పకుండానే గుర్తించగలిగిన కుటుంబం. ఇప్పుడా ఆ ఫ్యామిలీ హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫ్యామిలీలోని మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్ రావు పేర్లు చెబితేనే ఎవరైనా.. వాళ్లా ! అంటూ మాట్లాడుతారు. ఇందులో కొందరు పాజిటీవ్ గా స్పందిస్తే మరి కొందరు వామ్మో అనడం పరిపాటి. కానీ, ఆత్మగౌరవానికి తాము ప్రతీకగా వారికి వారు చెప్పుకుంటారు. బీసీ బిడ్డలుగా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఈ స్థాయికి చేరుకున్నామంటారు. ఇప్పుడు ఈ జాబితాలో వీరి కుమార్తె సుస్మిత వచ్చి చేరిందని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గతంలోనే ఆమె మాటలు సోషల్ మీడియాలో ‘అనుభవించి’నప్పటికీ తాజా ఎపిసోడ్ లో ఆమెదే కీరోల్. తల్లిదండ్రులను మించిన తనయ అంటూ ‘కితాబు’ ఇస్తున్నారు.
కొండా ఫ్యామిలీ రూటే వేరు
కొండా కుటుంబమంటే రాజకీయ వర్గాల్లో రెండు, మూడు రకాలుగా మాట్లాడుతారు. కొందరు వారిని ఫైర్ బ్రాండ్ గా పేర్కొంటే.. మరి కొందరు వాళ్ళతో పెట్టుకుంటామా? అంటారు. ఇంకొందరు వారు నడిసొచ్చిన తొవ్వంతా కాంట్రావర్సీయే అని చెబుతారు. అయితే పాతకాలం నాటి రాజకీయాలకు ఇప్పుడు పప్పులు ఉడకడంలేదు కాబట్టి గతంలో ఉన్న క్రేజీగానీ, భయం, భక్తిగానీ రాజకీయాల్లో కనిపించడంలేదు. అందులో ఆధిపత్యాన్ని సహించే పరిస్థితులు లేవంటున్నారు. పార్టీలలో కూడా వీళ్ళనుకున్నట్లు నడిచే పరిస్థితులు లేవని అంతా తారుమారైందని, ఇతరులు కూడా తామేమి తక్కువకాదంటూ పండిపోయారని చమత్కరిస్తున్నారు.
ఏ పార్టీలో ఉన్నా .. అదే పరిస్థితి
కొండా ఫ్యామిలీ తమది కాంగ్రెస్ కుటుంబమని ఘంటాపథంగా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇతర పార్టీల్లో పనిచేసిన అనుభవం వీరికుంది. వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఈ తరహా ఇబ్బందులు తప్పవని గిట్టని వారంటున్నారు. యువజన కార్యకర్తగా ప్రారంభమైన కొండా మురళి రాజకీయ జీవితం నిజానికి టీడీపీలో ప్రారంభమైంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి టీడీపీలో పనిచేశారు. ఆయనతో ఇప్పటికీ విభేదాలున్నాయని చెప్పుకుంటారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి ఉన్నత స్థాయికి ఎదిగారు. గ్రామ సర్పంచ్ గా మురళి తన రాజకీయ జీవితానికి పునాదులు వేసుకుంటే సురేఖ గీసుగొండ ఎంపీటీసీగా ప్రారంభించారు. మురళి ఆ తర్వాత జడ్పీటీసీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ కాంగ్రెస్, టీఆర్ఎస్ హయంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రత్యక్ష రాజకీయాలు ఆయనకు కలిసిరావనే నానుడి ఉంది. ఇక సురేఖ ఎంపీపీగా ప్రారంభమై తర్వాత శాయంపేట, పరకాల ఎమ్మెల్యేగా, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2023 ఎన్నికల్లో తిరిగి పరకాలకు గుడ్ బై చెప్పి వరంగల్ తూర్పుకు చేరి ఎమ్మెల్యేగా గెలుపొంది..బీసీ, మహిళా కోటాలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కడియం, రేవూరి, నాయిని, దొంతి, గండ్ర, ఎమ్మెల్సీ సారయ్యతో విభేదాలున్నాయి. క్రమంగా మంత్రి పొంగులేటితో కూడా పొసగని పరిస్థితి ఏర్పడింది. మేడారం టెండర్ల వ్యవహారంతో లొల్లి తీవ్రస్థాయికి చేరింది. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డితోపాటు సీఎం రేవంత్ రెడ్డి పై కూడా వాళ్ళ కుమార్తె సుస్మిత తీవ్ర విమర్శలు చేశారు. దీంతో వీళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఇదే పరిస్థితి తప్పదని ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీకి ఈ అనుభవం కావాల్సిందేనని, చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత అంటూ రేవంత్ రెడ్డి పై సెటైర్లు వేస్తున్నారు. కొండా ఫ్యామిలీకి తమ రాజకీయ ప్రయాణంలో మొదటి నుంచి కాంట్రావర్సీలే వారికి కలిసొచ్చాయంటున్నారు.
పాత పరిస్థితులు తారు మారు
గతంలో నడిచినట్లు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా నడుస్తుంది కొండా ఫ్యామిలీ అనుకున్నట్టున్నారు. కానీ పరిస్థితులు బాగా మారిపోయాయంటున్నారు. రాజకీయాలు తారు మారై తలకిందులయ్యాయి. ఎవరూ ఎవరికి భయపడే పరిస్థితి లేదంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సురేఖకు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఓ ప్రైవేటు వ్యక్తిని ఔట్ సోర్సింగులో నియమించుకుని ఓస్డీగా తమ చెప్పుచేతుల్లో పెట్టుకున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఐఎఎస్ లపై కూడా ఆయన పెత్తనం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదం కారణంగానే ప్రభుత్వం ముందుగా ఓఎస్డీని తొలగించింది. తరువాత ఇంటికి పోలీసులు వచ్చారు. వీలైతే ఆయనను అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. వారిని అడ్డుకున్న బిడ్డ సుస్మిత.. రేవంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, పొంగులేటి అందరూ కలిసి బీసీ బిడ్డ సురేఖ మీద కక్ష సాధిస్తున్నారని, తగిన పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించడం చర్చగా మారింది. ఇదిలా ఉండగా కాంట్రవర్సీ ఉద్యోగి సుమంత్ ను తమ ఫ్యామిలీ మెంబర్ గా చెబుతున్నారు. సుమంత్ ను సేఫ్‌గా మంత్రే తన కారులో ఎక్కించుకుని పోలీసుల నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది. బిడ్డ పోలీసులను అడ్డుకుంటే, తల్లి తప్పించారని ఇతరులు ఈ విధంగా వ్యవహరిస్తే పోలీసులు చూస్తూ ఉండేవారా? అంటూ విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా సహచర మంత్రి మంత్రి పొంగులేటితో మేడారం టెండర్ల గొడవ, జిల్లాలోని మొత్తం నాయకులతోనూ పంచాయితీ, నాగార్జున- సమంత ఇష్యూలో నోరుజారడంతో కోర్టు కేసు, సీఎం వరంగల్ వస్తే గైర్హాజరు, జిల్లా ఇన్ చార్జ్ మంత్రి పొంగులేటి మేడారం వెళ్తే గైర్హాజరు. తాజాగా మంత్రి వర్గ సమావేశానికి దూరం. కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ సహా అందరిపై తీవ్ర విమర్శలు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి జరిగిందంటున్నారు. కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు మాత్రం కొండా కుటుంబానికి మళ్లీ లైఫ్ ఇచ్చింది కాంగ్రెసేనని, కనీసం ఆ కృతజ్ఞత కూడా వీరికి లేదంటున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ ముందుగా తెలంగాణ కాంగ్రెస్‌కు పట్టిన బంధనాలు తెంచి, పార్టీని, నాయకులను సంస్కరించమంటున్నారు. బీసీ నినాదంతో కాంగ్రెస్ వెళ్తుంటే, బీసీ బిడ్డలం కాబట్టి రెడ్లు అణిచివేస్తున్నరంటూ వీరు బీసీ కార్డు సమయానికి వాడుకుంటున్నారని అంటున్నారు. మిగిలిన వాళ్ళు రెడ్లు అయితే బస్వరాజు సారయ్య, సుధారాణి బీసీ బిడ్డలు కారా? కడియం శ్రీహరి ఎస్సీ కాదా? జిల్లాలో ఒక్కరంటే ఒక్కరితోనైనా ఈ ఫ్యామిలీకి సయోధ్య ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ ఈ మాత్రం అనుభవించాల్సిందేనంటున్నారు.