Shiva 4K Re-Release | శివ రీ రిలీజ్..కూలీ రోజునే ట్రైలర్ లాంచ్.. చైన్ ఈజ్ బ్యాక్!

36 ఏళ్ల తర్వాత నాగార్జున ‘శివ’ రీ-రిలీజ్‌కి సిద్ధం. ఆగస్టు 14న కూలీ థియేటర్లలో ట్రైలర్, 4కే డాల్బీ అట్మాస్‌తో మరింత గ్రాండ్‌గా.

Shiva 4K Re-Release | శివ రీ రిలీజ్..కూలీ రోజునే ట్రైలర్ లాంచ్.. చైన్ ఈజ్ బ్యాక్!

Shiva 4K Re-Release | విధాత: ఇటీవల తెలుగు సినీ రంగంలో హిట్ సినిమాల రీరిలీజ్ ల ఒరవడి కొనసాగుతుంది. ఈ పరంపరలో తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన శివ చిత్రం కూడా రీరిలిజ్ కు సిద్దమైంది. అక్కినేని నాగార్జున కెరీర్ లో కూడా ఓ ఐకానిక్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రీరిలీజ్ కాబోతుంది. సినిమా రీరిలిజ్ ట్రైలర్ ను ఈ ఆగస్టు 14న రజనీకాంత్-నాగార్జున నటించిన కూలీ సినిమా రోజునే థియేటర్ లలో విడుదల చేయనుండటం విశేషం. నాగ్ అభిమానులకు ఆ రోజు డబుల్ ధమాకా దక్కబోతుంది. 36 ఏళ్ల తర్వాత ‘శివ’ మళ్లీ థియేటర్లలోకి రానుండడంతో సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందించిన శివ సినిమా 1989లో విడుదలై తెలుగు సినీ రంగంలో కొత్త శకానికి బాటలు పరిచింది. అందుకే తెలుగు సినీ ప్రస్థానాన్ని శివ కు ముందు..తర్వాత అంటూ సినీ విశ్లేషకులు చెబుతుంటారు. అటువంటి వెరీ స్పెషల్ మూవీ శివ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రీరిలీజ్ కు సిద్దమవుతుంది. అలా ఇలా కాదు..అత్యంత అధునాతన ఏఐ ఇంజనీరింగ్ తో 4కే తో పాటు డాల్బీ అట్మాస్ సాంకేతికతో మోనో ట్రాక్‌ను మొత్తం సౌండ్ ట్రాక్‌ను మొదటిసారిగా తిరిగి తయారు చేశారు. దీంతో ప్రేక్షకులకు సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. యాక్షన్ సీక్వెన్స్‌ లోని సౌండ్స్ వెండితెరపై మరింత శక్తివంతంగా వినిపిస్తాయి.

అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవం సందర్భంగా శివ మూవీని రీ-రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా నాగార్జునా ఓ స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. హలో మై ఫ్రెండ్స్.. మోస్ట్ ఐకానిక్ మూవీ ‘శివ’ని తిరిగి తెరపైకి తీసుకువస్తున్నాం. శివ’ మీకు ఎంత స్పెషల్ లో.. నాకూ అంతే 4కే డాల్బీ అట్మాస్ సౌండ్‌తో త్వరలో మీ ముందుకు ఈ సినిమాను తీసుకొస్తున్నాం. ఆగస్టు 14 నుంచి కూలీ సినిమా ప్ర‌ద‌ర్శించే థియేట‌ర్స్‌లో శివ ట్రైల‌ర్‌ని కూడా ప్ర‌ద‌ర్శించ‌నున్నారు అని చెప్పుకొచ్చాడు.

సినామా విడుదలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ ”చైన్ ఈజ్ బ్యాక్! ఈసారి డాల్బీ అట్మాస్‌లో నాగార్జున పంచ్ మరింత బిగ్గరగా వినిపిస్తుంది.. మీ దవడను కాపాడుకోండి!” అంటూ ట్వీట్ చేశారు. ఆగస్టు 14 నుండి కూలీ థియేటర్లలో శివ ట్రైలర్ చూడండంటూ పేర్కొన్నారు. దీనికి నాగార్జున స్పందిస్తూ,”ఇది నీ శివ, మై డియర్ ఫ్రెండ్.”అని రిప్లై ఇవ్వగా, వర్మ “నువ్వు శివగా లేకపోతే ఎప్పటికీ నా శివ పుట్టేది కాదు అని స్పందించారు. శివ రీ-రిలీజ్ కోసం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆకాంక్షలు త్వరలో నెరవేరబోతున్నాయి.

శివ మూవీలో నాగార్జున సరసన అమల హీరోయిన్‌గా నటించగా, రఘువరన్ ప్రతినాయకుడిగా కొత్త విలనిజం ప్రదర్శించారు. జేడీ చక్రవర్తి, తనికెళ్ల భరణి, చిన్నా, శుభలేఖ సుధాకర్, నగేష్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించగా, ఎస్. గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించారు.

Read more : మొదటి త్రైమాసికంలో తాజ్ హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ లో అత్యుత్తమ పనితీరు.

కింగ్ కోబ్రా అభయారణ్యం..ఏపీలోనే !