Sai Pallavi | చెత్త పాత్రలు మెచ్చదు – పెద్ద హీరోలకు నచ్చదు

సాయి పల్లవి.. జస్ట్​, పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. ఆమె అందం ఆహ్లాదంగా ఉంటుంది. ఆమె అభినయం సహజంగా ఉంటుంది.

Sai Pallavi | చెత్త పాత్రలు మెచ్చదు  – పెద్ద హీరోలకు నచ్చదు

సాయి పల్లవి.. జస్ట్​, పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. ఆమె అందం ఆహ్లాదంగా ఉంటుంది. ఆమె అభినయం సహజంగా ఉంటుంది. నృత్యం అద్భుతంగా ఉంటుంది. చాలా ఓపెన్​గా మాట్లాడుతుంది. అలా వచ్చి, ఇలా ఓ పాటకు ఆడేసి వెళ్లిపోయే హీరోయిన్​ పాత్రలు అసలు చేయదు. నటనకు ఆస్కారమున్న, నాయికాప్రాధాన్యత ఉన్న పాత్రలే ఎంచుకుంటుంది. అద్భుతమైన డాన్సర్​ అయినా, మన తెలుగు పెద్ద హీరోలకు నచ్చదు. కారణం, ఆమె సగటు హీరోయిన్​ పాత్రలకు ఒప్పుకోకపోవడమే. అందుకే ఫిదా వచ్చి ఏడేళ్లయినా తను నటించిన తెలుగు సినిమాలు ఏడే.

సాయి పల్లవి(Sai Pallavi) చదువురీత్యా వైద్యురాలు. 2016లో జార్జియా(Georgia)లోని టబలీసీ స్టేట్ మెడికల్​ యూనివర్సిటీ(Tbilisi State Medical University) నుండి ఎంబిబిఎస్(MBBS)​ పట్టా అందుకుంది. భారత్​లో ప్రాక్టీస్​ చేయాలంటే పాస్​ కావాల్సిన ఎఫ్ఎంజీఈ(FMGE) పరీక్ష కూడా 2020లో రాసింది. అయితే పాసయిందో లేదో తెలియదు. తమిళనాడు(Tamilnadu)లోని కోయంబత్తూరులో ఓ బడగ(Badaga) కుటుంబంలో జన్మించిన పల్లవి, చదువంతా కోయంబత్తూరు(Coimbatore)లోనే సాగింది. ఆ తరువాత ఎంబిబిఎస్​ కోసం జార్జియా వెళ్లిన పల్లవి దాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

చిన్నతనంలోనే ఓ రెండు సినిమాలలో బాలనటిగా రాణించిన పల్లవి ప్రత్యేకంగా డాన్స్​ నేర్చుకోకపోయినా, తన శరీరంలో ఉన్న లయ, ఏదో కొత్తగా చేయాలన్నతపన తనను మంచి డాన్సర్​(Best Dancer)గా పేరు తెచ్చుకోవాడానికి కారణమయ్యాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అందుకే తను డాన్స్​ రియాలిటీ షోలలో పాల్గొని ప్రథమ స్థానంలో వచ్చానని తెలిపింది. తను జార్జియాలో ఉన్నప్పుడే నిర్మాత ఆల్ఫోన్స్​ పుతిరన్​ సంప్రదించినప్పుడు చాలా కోపం తెచ్చుకున్న పల్లవి అతనేదో ఫ్రాంక్​ కాల్​ చేస్తున్నాడని పోలీస్​ కంప్లైంట్​ ఇవ్వడానికి కూడా సిద్ధమైందట. ఆ తర్వాత నిజం తెలుసుకుని ఆ నిర్మాత తెచ్చిన కథ నచ్చి, ఆ సినిమా చేయడానికి ఒప్పుకుంది. అదే ప్రేమమ్(Premam)​. ఆ సినిమాలో మలర్​గా నటించిన సాయి పల్లవికి వచ్చిన పాపులారిటీ అంతాఇంతా కాదు.

సెలవుల్లో ఆ షూటింగ్​ పూర్తి చేసి తిరిగి జార్జియా వెళ్లిపోయిన పల్లవి, మళ్లీ చదువుకు ఓ ఆర్నెళ్లు ఫుల్​స్టాప్​ పెట్టి, కలి(Kali) అనే మళయాళం సినిమా చేసింది. 2017లో శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’(Fidaa) సినిమాతో తెలుగు(Telugu) పరిశ్రమలోకి ప్రవేశించింది. తెలంగాణ అమ్మాయి, హైబ్రిడ్​ పిల్ల భానుమతి(Bhanumathi)గా ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. తన నటన, చిలిపిదనం, డాన్స్​… తెలుగు రాకపోయినా, పట్టుబట్టి నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్​ చెప్పుకుని, తిరుగులేని ఇమేజ్​ సంపాదించింది.

ఆ తర్వాత ఆమె నటించిన తెలుగు సినిమాలు ఎంసీఏ, కణం, పడిపడిలేచె మనసు, లవ్​ స్టోరీ, శామ్​సింగరాయ్​, విరాటపర్వంలలో ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. ఈ మధ్యలో వచ్చిన చాలా రొటీన్​ పాత్రలను నిర్మొహమాటంగా తిరస్కరించిన పల్లవి, ఒక ఫెయిర్​నెస్​ క్రీమ్​ యాడ్​లో నటిస్తే 2 కోట్లిస్తామనే బంపర్​ ఆఫర్​ వచ్చినా, తను చేయనని(Rejected Fairness Cream Ad) చెప్పింది. తాను సహజ సౌందర్యాన్నే నమ్ముతానని, అలాగే పాటిస్తానని చెప్పిన పల్లవి అలాగే నటిస్తూవచ్చింది.

మనం సరిగ్గా గమనిస్తే, సాయి పల్లవి నృత్యంలో భావోద్వేగం ఉంటుంది. దానికి ఉదాహరణ, లవ్​ స్టొరీ సినిమాలో ఏవో ఏవో కలలే…, శామ్​సింగరాయ్​లో శరణంటినే భవానీ.. పాటలు. వాటిల్లో పల్లవి చూపిన హావభావాలు, ఎమోషన్స్​ అనితరసాధ్యం.

సాయిపల్లవి తనకు నిజానికి సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదని, తను చదువుకున్న డాక్టర్​ చదువు తనకు కావాల్సిన ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వగలదని ఎన్నోసార్లు చెప్పింది. మంచి పాత్రలు, ప్రేక్షకుల మనసుకు దగ్గరయ్యే అవకాశమున్నవాటినే స్వీకరిస్తానని వినమ్రంగా చెప్పే పల్లవి, ఆ కారణంగా మొత్తం చేసిన సినిమాలు పదిహేనే. మెగాస్టార్​ చిరంజీవి నటించిన ‘భోళాశంకర్​’ సినిమాలో ఆయన చెల్లెలిగా నటించే అవకాశం ఇచ్చినా, పాత్రలో కొత్తదనం ఏమీ లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించింది( ఆ పాత్రనే కీర్తి సురేశ్​ పోషించింది). ఆ విషయాన్ని చిరంజీవే స్వయంగా చెప్పాడు.

నిజానికి పల్లవి చిరంజీవికి పెద్ద అభిమాని(Sai Pallavi big fan of chiranjeevi). తన గ్రేస్​, నటన, డాన్స్​ చాలా ఇష్టమని చెప్పింది. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు సాయిపల్లవి సినిమాల విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో. ఇంత రిస్ట్రిక్టెడ్​గా ఉన్నా, తనను అభిమానించే వారు కోట్లలో ఉన్నారు. అదే పల్లవి గ్రేస్​. ఇప్పుడు శివ కార్తికేయన్​ సినిమా అమరన్​(Amaran), నాగచైతన్యతో తెలుగు సినిమా తండేల్(Thandel)​, రణబీర్​కపూర్​ రాముడిగా, సాయిపల్లవి సీత(Maa Seetha)గా హిందీలో రామాయణ(Ramayana) సెట్స్​పై ఉన్నాయి.

ఎంతోమంది నటీమణులు మొదట కట్టుదిట్టంగా, ఏ మాత్రం అసభ్యతకు తావులేని పాత్రలు చేసినా, క్రమక్రమంగా ఛాన్స్​ల కోసం కొంత బోల్డ్​గా నటించడం మొదలుపెట్టారు. కానీ, సాయిపల్లవి ఎంతమాత్రం అటువంటి అవకాశం ఇవ్వలేదు. ఇవ్వదు కూడా. సీత పాత్ర ధరించడం తన జీవితంలో మరచిపోలేని అనుభవమని సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేసింది. ఆ పాత్రకు ఆమె సరిపోదని పలువురు భావించినా, దర్శకనిర్మాతలు ఆమెనే ఎంపిక చేసారు. సీత పాత్ర రామాయణంలో చెప్పబడినంత అద్భుత సౌందర్యం సాయి పల్లవిలో లేకపోయినా, ఆమె అందంలో దైవత్వం(Divine Beauty) ఉందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అది నిజం కూడా.
తన బహుముఖ ప్రజ్ఞ, సహజ సౌందర్యం, చాలా సహజంగా ఉండే నటన, తనను ఆరోసారి ఫిల్మ్​ఫేర్​ అవార్డు (Sixth Filmfare Award Winner)అందుకునేలా చేసింది. రెండు దశాబ్దాలుగా ఎన్నో సినిమాలు చేసి, కథానాయికలుగా తిరుగులేని పేరున్నవారు కూడా అందుకోలేని ఈ అద్భుతాన్ని కేవలం పద్దెనిమిది సినిమాల అమ్మాయి చేసి చూపించింది.

ఫిల్మ్​ఫేర్​ అందుకున్న సినిమాలు:

2016 – ఉత్తమ తొలిచిత్ర నటి – ప్రేమమ్​ (మళయాళం)
2018 ‌– ఉత్తమ నటి – ఫిదా (తెలుగు)
2022 ‌– ఉత్తమ నటి – లవ్​స్టోరీ (తెలుగు)
2022 ‌– ఉత్తమ నటి(క్రిటిక్స్​) – లవ్​స్టోరీ (తెలుగు)
2024 ‌– ఉత్తమ నటి – గార్గి (తమిళం)
2024 ‌– ఉత్తమ నటి(క్రిటిక్స్​) – విరాటపర్వం (తెలుగు)

తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు మాత్రం సాయిపల్లవి తమ అభిమాన హీరోల పక్కన నటిస్తే, డాన్స్​ చేస్తే చూడాలని ఉన్నా, హీరోలకు కుదరడం లేదు. కారణం తెలిసిందే. పాత్రకు ప్రాధాన్యం లేకపోతే తను నటించదు. ప్రాధాన్యమున్న కథానాయిక పాత్రలు పెద్ద హీరోల సినిమాలలో ఉండవు. హీరో డామినేషనే ఇక్కడ ముఖ్యం. అందుకే, ఎన్టీఆర్​, రామ్​చరణ్​, అల్లు అర్జున్​ లాంటి హీరోల సినిమాల్లో పల్లవి కనిపించే అవకాశాలు చాలా తక్కువ.

తెలుగు సినిమాలలో కథానాయిక ప్రాధాన్యతను హీరోలు ఒప్పుకోరు. వారికి తమ పక్క డాన్స్​ చేయడానికి ఓ అమ్మాయి కావాలి. అందునా ముంబయి అమ్మాయి అయితే ఇంకా బెటర్​. నటించే కథానాయిక ఉంటే తాము ఎక్కడ తేలిపోతామో అనే భయం ఒకటి ఉంటుంది. వారు కూడా గొప్ప నటులే అయినా, స్క్రీన్​ ప్రజెన్స్​లో తేడా వస్తే ఎలా? అనే ఒక కాంప్లెక్స్​. పైగా అభిమానులనే మూర్ఖుల గొడవొకటి. కాకపోతే, ఉన్న మంచి హీరోల్లో ఈ మధ్య రామ్​చరణ్​ కొంత వైవిధ్యమున్న సినిమాల్లో నటిస్తున్నాడు, కథ పట్ల గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి, కథానాయికకు స్కోప్​ ఉండే పాత్ర ఉంటే ఫిల్మ్​ఫేర్​ స్టార్​ సాయిపల్లవికి ఆఫర్​ చేసే ఛాన్స్​ వస్తుందేమో.