Bollywood ‘Ramayana’ | కన్నులపండువగా రామాయణం గ్లింప్స్​.. అద్భుతంగా ఉన్న VFX దృశ్యాలు

Bollywood ‘Ramayana’ | కన్నులపండువగా రామాయణం గ్లింప్స్​.. అద్భుతంగా ఉన్న VFX దృశ్యాలు

Bollywood ‘Ramayana’ | ఇప్పటి వరకు ఎన్నోసార్లు విన్నాం – రామాయణ సినిమాపై వార్తలు, ఊహాగానాలు, నటీనటుల ఎంపిక, దశలవారీగా మారుతున్న టైములు… కానీ ఇప్పుడు ఆ కల సాక్షాత్తుగా వెండితెరపై తొలి అడుగు వేసింది. దర్శకుడు నితేశ్​ తివారీ సారథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ పురాణగాథ ‘రామాయణం’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ అధికారికంగా నేడు విడుదలైంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యష్ రావణుడిగా కనిపించే ఈ టీజర్ సోషల్ మీడియాలో సునామీలా మారింది.

ఈ మూడు నిమిషాల వీడియో ఒక్కసారి చూస్తే చాలు – మనం త్రేతాయుగంలోకి అడుగుపెడుతున్నామనే అనుభూతి కలుగుతుంది. రణబీర్ ఆకర్షణీయంగా, శాంతంగా ఉండే రాముడిగా కనిపించగా, యష్ పాత్రలో అగ్ని వంటి ఉగ్రం, గంభీరత వ్యక్తమవుతోంది. వీరి మధ్య తొలుత మౌనంగా కనిపించే, కానీ అంతర్లీనంగా నడిచే ఘర్షణ కలగలిపినట్లే ఈ గ్లింప్స్ రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న నమిత్ మల్హోత్రా సోషల్ మీడియాలో పెట్టిన క్యాప్షన్ మరింత స్పష్టతనిచ్చింది: “ఇది పదేళ్ల కల. ప్రపంచానికి భారతీయ ఇతిహాసాల్లో అగ్రగామిగా ఉన్న రామాయణాన్ని అత్యంత గౌరవంగా, ఘనంగా పరిచయం చేయాలనే సంకల్పమే ఈ ప్రాజెక్ట్​కు ఆధారం.” ఇప్పుడు ఆయన కలను సాకారం చేయడంలో ఎంతో మంది ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు భాగమయ్యారు. ఈ గ్లింప్స్‌ను కేవలం ఆన్‌లైన్‌లోనే కాకుండా, హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగుళూరు తదితర తొమ్మిది నగరాల్లో ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారు. అంతేగాక న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లోనూ ప్రదర్శించడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు ఉన్న ప్రపంచస్థాయిని చాటారు. ఇది కేవలం భారతీయ ప్రేక్షకులకే కాదు, అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా అత్యంత ఆకర్షణీయ చిత్రంగా నిలువబోతోందనడానికి సాక్ష్యం.

తారాగణం విషయానికి వస్తే… రణబీర్ కపూర్ శ్రీరామునిగా, సాయి పల్లవి సీతమ్మ పాత్రలో, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, రవీ దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. అంతేకాదు, అరుణ్ గోవిల్, లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాంకేతికంగా ఈ చిత్రం మరింత గొప్పదనాన్ని సంతరించుకుంది. సంగీత దర్శకులుగా ఏఆర్ రెహ్మాన్ మరియు హాన్స్ జిమ్మర్ కలిసి పని చేస్తున్నారు – ఇది భారతీయ సినిమా చరిత్రలో అరుదైన సంఘటన. యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతను టెర్రీ నోటరీ (Avengers, Avatar ఫేమ్) మరియు గై నోరిస్ (Mad Max: Fury Road ఫేమ్) చేపట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎనిమిది ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న DNEG సంస్థ తోడైంది. వీటన్నింటి కలయికతో ఈ చిత్రం ఖచ్చితంగా ఓ అద్భుత దృశ్యకావ్యంగా నిలవనుంది. గతంలో ‘ఘాజీ’, ‘చిచోరే’ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నితేశ్​ తివారీ ‘రామాయణం’ రూపంలో భారతీయ గాథను నూతనంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్ర కథాంశం ప్రకారం, విశ్వంలో సమతుల్యత లోపించిన తరుణంలో శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా భూమిపై అవతరించడం, రావణుడితో ఘర్షణకు దారి తీయడం వంటి అంశాలు అత్యంత భావోద్వేగంతో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ గ్లింప్స్ విడుదలతోపాటు, త్వరలో ఒక 7 నిమిషాల స్పెషల్ విజన్ షోరీల్‌ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. అదే సమయంలో ‘రామాయణ Part 1’ చిత్రాన్ని 2026 దీపావళికి, రెండవ భాగాన్ని 2027 దీపావళికి విడుదల చేయనున్నట్టు నిర్మాణ బృందం ప్రకటించింది.
మరెందుకాలస్యం? గ్లింప్స్​ ఇక్కడ చూసేయండి.

టీజర్‌ను చూసినటువంటి ప్రేక్షకులు “ఇది కేవలం సినిమా కాదు, తరతరాలపాటు గుర్తుండిపోయే దృశ్యకావ్యం”, “గూస్​బంప్స్ వచ్చాయి”, “వెండితెరపై దేవతల ప్రభావం కనిపించింది” వంటి ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్రేడ్ అనలిస్టులు ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టుగా మారబోతున్న చిత్రంగా అభివర్ణిస్తున్నారు.
సంపూర్ణంగా చూస్తే, ‘రామాయణం’ మొదటి చూపే ఎంతో విశ్వాసాన్ని నింపింది. ఇందులోని నటీనటుల ప్రతిభ, టెక్నికల్ టీమ్ నైపుణ్యం, దర్శకుడి దృష్టికోణం – ఇవన్నీ కలిసొచ్చి ఈ చిత్రాన్ని భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే ఒక గ్రాండ్ విజువల్ ఎపిక్‌గా మార్చనున్నాయి. రాముడి శక్తి, రావణుని అహంకారం, సీతా త్యాగం – ఈ గాథను ప్రపంచం మరోసారి కొత్తగా చూడబోతుంది.