Success Story | సాఫ్ట్‌వేర్ నుంచి గోపాల వ్యాపారం : 10 కోట్ల టర్నోవర్‌కు ఎదిగిన విజయ ప్రస్థానం
ఐటీ రంగంలో 14 ఏళ్లు పనిచేసిన అశీమ్ రావత్ ఉద్యోగం వదిలి దేశీ ఆవులతో డెయిరీ వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన కంపెనీ హేథా ఆర్గానిక్‌కి ₹10 కోట్లు టర్నోవర్ ఉంది.

From Software Engineer to ₹10 Crore Dairy Business: Aseem Rawat’s Journey from IT to Hetha Organics
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాకు చెందిన అశీమ్ రావత్ సాధారణ ఐటీ ఇంజనీర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. 14 ఏళ్లపాటు మంచి జీతం వచ్చే ఉద్యోగం చేసిన ఆయన ఒక్కసారిగా కొత్త దారిని ఎంచుకున్నారు. భారతీయ దేశీ ఆవులతో డెయిరీ వ్యాపారం చేయాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆలోచనతోనే 2015లో “హేథా ఆర్గానిక్” అనే సంస్థను స్థాపించారు.
ఇప్పటికే ఆయన కంపెనీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. హేథా ఆర్గానిక్‌లో ప్రస్తుతం 1,100కి పైగా ఆవులు, 130 రకాల ఉత్పత్తులు, ఐదు వేర్వేరు చోట్ల డెయిరీ ఫామ్‌లు, 110 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సంవత్సరానికి 10 కోట్ల రూపాయల టర్నోవర్‌తో హేథా ఆర్గానిక్ భారతీయ గోఆధారిత వ్యాపారాలకు ఆదర్శంగా నిలిచింది.
అశీమ్ రావత్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఇంజనీర్ కావడంతో ఉద్యోగమే జీవిత లక్ష్యం అన్న భావనతో పెరిగారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగం సంపాదించి, కోల్‌కతా, బెంగళూరు నగరాలతో పాటు విదేశాల్లో కూడా పని చేశారు. కానీ కాలక్రమేణా ఆ జీవితం శూన్యంగా అనిపించిందట. ఒక టీవీ చర్చాకార్యక్రమంలో దేశీ ఆవుల ప్రాధాన్యం, వాటి ఆర్థిక ప్రాధాన్యంపై జరిగిన చర్చ ఆయన ఆలోచన మార్చేసింది. “విదేశీ ఆవులు మాత్రమే లాభదాయకం” అన్న అభిప్రాయానికి వ్యతిరేకంగా, దేశీ ఆవులతోనే విజయవంతమైన వ్యాపారం సాధ్యమని నిరూపించాలని నిర్ణయించుకున్నారు.
అశీమ్ విజయ ప్రయాణం మొదలైందిలా..
కుటుంబం మొదట ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినా, అశీమ్ వారిని ఒప్పించారు. రెండు దేశీ ఆవులతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన చిన్న ప్రయత్నమే హేథా ఆర్గానిక్‌గా మారింది. 2015 డిసెంబరులో, “స్టార్ట్‌అప్ ఇండియా” ప్రారంభానికి వారం ముందు ఆయన స్వతంత్రంగా ఈ సంస్థను ప్రారంభించారు.
హేథా ఆర్గానిక్ లక్ష్యం మూడు ప్రధాన అంశాలపై ఆధారపడింది — దేశీ గోజాతులను ప్రోత్సహించడం, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులు తయారు చేయడం, భారతీయ వ్యవసాయ సంస్కృతిని వ్యాపారంగా మార్చడం. ఈ లక్ష్యంతో ఆయన దేశంలోని పలు రాష్ట్రాలను సందర్శించి విజయవంతమైన మోడల్‌లు పరిశీలించారు. ఎక్కడా దేశీ ఆవుల ఆధారిత వ్యాపారం కనిపించకపోవడంతో, స్వయంగా కొత్త ప్రయోగాలు ప్రారంభించారు.
ప్రస్తుతం హేథా ఆర్గానిక్ నాలుగు ప్రధాన దేశీ ఆవుల జాతులతో ఉత్పత్తి చేస్తోంది— గిర్ (గుజరాత్), థార్‌పార్కర్ (రాజస్థాన్), సాహీవాల్ (పంజాబ్), బద్రీ (ఉత్తరాఖండ్). కంపెనీకి ఉత్తరాఖండ్‌లో మూడు, ఉత్తరప్రదేశ్‌లో రెండు ఫామ్‌లు ఉన్నాయి.
ప్రారంభంలో ఆయనకు ఆర్థిక ఒత్తిడి, టీమ్ నిర్మాణం, వినియోగదారుల నమ్మకం వంటి సవాళ్లు ఎదురైనా, పట్టుదలతో అన్ని దాటారు. నేడు హేథా ఆర్గానిక్ వెబ్‌సైట్ hetha.in తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కూడా ఉత్పత్తులు విక్రయిస్తోంది. ఆయన సంస్థ 130 రకాల సహజ ఉత్పత్తులతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
జాతీయ, రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు, ముఖ్యంగా “గోపాల్ రత్న అవార్డు” వంటి గౌరవాలు దక్కించుకుంది. భవిష్యత్తులో మరిన్ని దేశీ జాతులను చేర్చి ఉత్పత్తిలో వైవిధ్యాన్ని పెంచే ఆలోచనలో అశీమ్ ఉన్నారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి రైతుగా మారిన ఈ ప్రయాణం, వినూత్న ఆలోచన, ఆత్మవిశ్వాసం, స్వదేశీ సంప్రదాయం కలగలిపిన విజయగాథగా నిలిచింది.
ఐటీ రంగంలో 14 ఏళ్లు పనిచేసిన అశీమ్ రావత్ ఉద్యోగం వదిలి దేశీ ఆవులతో డెయిరీ వ్యాపారం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన కంపెనీ హేథా ఆర్గానిక్‌కి ₹10 కోట్లు టర్నోవర్ ఉంది.