Crime In Varanasi | యూపీలో దారుణం: ఆరు రోజులు.. వేర్వేరు ప్రాంతాల్లో యువతిపై 23 మంది లైంగికదాడి!

వారణాసి ఎంపీ కూడా అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.

  • By: TAAZ |    crime |    Published on : Apr 11, 2025 7:30 PM IST
Crime In Varanasi | యూపీలో దారుణం: ఆరు రోజులు.. వేర్వేరు ప్రాంతాల్లో యువతిపై 23 మంది లైంగికదాడి!

Crime In Varanasi | ఒక యువతిని మార్చి 29వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకూ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో వేర్వేరు ప్రాంతాల్లో, మత్తు మందు ఇచ్చి 23 మంది లైంగికదాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. ఈ కేసులో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేరుగా జోక్యం చేసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని శుక్రవారంనాడు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

తనపై జరిగిన ఘోరాన్ని 19 ఏళ్ల యువతి తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఏప్రిల్‌ 6వ తేదీన కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 70(1) (సామూహిక లైంగిక దాడి), 74 (ఆమె గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలప్రయోగం), 123 (నేరపూరితంగా విషం తదితరాలు ఇచ్చి గాయపర్చడం), 126(2) (అక్రమంగా నిర్బంధించడం), 127(2) (అక్రమంగా నిరోధించడం), 351(2) (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులకు గాను ఇప్పటి వరకూ 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయినవారిని రాజ్‌ విశ్వకర్మ, సమీర్‌, అయుష్‌, సోహైల్‌, డానిష్‌, అన్మోల్‌, సాజిద్‌, జహీర్‌, ఇమ్రాన్‌, జైబ్‌, అమన్‌, రాజ్‌ ఖాన్‌గా గుర్తించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఆమెకు వేర్వేరు హోటళ్లలో డ్రగ్స్‌ ఇచ్చి లైంగిక దాడి చేశారని కంటోన్మెంట్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ విదూష్‌ సక్సేనా తెలిపారు. మార్చి 29వ తేదీన 19 ఏళ్ల యువతి కొంత మంది యువకులతో కలిసి బయటకు వెళ్లిందని, కానీ తిరిగి రాకపోవడంతో ఏప్రిల్‌ 4వ తేదీన కుటుంబ సభ్యులు మిస్సింగ్‌ కంప్లయింట్‌ చేశారని ఆయన చెప్పారు. తొలుత ఆమె రేప్‌ గురించి పోలీసులకు ఏమీ చెప్పలేదని, ఏప్రిల్‌ 6వ తేదీన ఆమె కుటుంబ సభ్యులు గ్యాంగ్‌ రేప్‌ జరిగినట్టు ఫిర్యాదు చేశారని తెలిపారు.

‘మార్చి 29వ తేదీన ఫ్రెండ్‌ ఇంటికి వెళతానని ఆమె బయటకు వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో రాజ్‌ విశ్వకర్మ అనే యువకుడు ఆమెను కలిశాడు. లంకలో ఉన్న ఒక కేఫ్‌కు తీసుకు వెళ్లాడు. అక్కడ అతడు, అతడి స్నేహితులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు’ అని బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరుసటి రోజు మార్చి 30వ తేదీన బాధితురాలిని సమీర్‌ అనే యువకుడు కలిశాడు. ఆమెను బైక్‌పై ఎక్కించుకుని ఒక హైవేపై తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తెలిపారు. అనంతరం బాధితురాలిని నదేసర్‌ వద్ద వదిలేసి సమీర్‌ వెళ్లిపోయాడు. ‘మార్చి 31వ తేదీన ఆయుష్‌ తన స్నేహితులైన సొహైల్‌, డానిష్‌, అన్మోల్‌, సాజిద్‌, జహీర్‌తో కలిసి ఆమెను సిగ్రాస్‌ కాంటినెంటల్‌ కేఫ్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెకు మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్‌ ఇచ్చారు. అనంతరం ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగికదాడి చేశారు’ అని బాధితురాలి తల్లి ఫిర్యాదులో తెలిపారు.

మరుసటి రోజైన ఏప్రిల్‌ 1న సాజిద్‌ అనే వ్యక్తి , అతని స్నేహితుడు బాధితురాలిని ఒక హోటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి బాధితురాలిపై లైంగికదాడి చేసి, అక్కడి నుంచి బయటకు గెంటేశాడు. ఆ ప్రాంతం నుంచి వెళుతున్న సమయంలో ఇమ్రాన్ అనే వ్యక్తి కలిశాడు. అతడు కూడా ఆమెకు కూల్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, రేప్ చేశాడు. ఆమె పెద్దగా కేకలు వేయడంతో ఆమెను హోటల్ బయట వదిలి వెళ్లిపోయాడు. ఏప్రిల్ 2వ తేదీన రాజ్ ఖాన్ అనే వ్యక్తి బాధితురాలిని హకుల్‌గంజ్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి, మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో తన స్నేహితులతో కలిసి ఆమెను తీసుకుని సోయిలేని స్థితిలో అస్సీ ఘాట్ వద్ద వదిలేశాడు. ఏప్రిల్ 3వ తేదీన డానిష్ అనే వ్యక్తి ఆమెను తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ సొహైల్‌, షోయబ్‌, మరో వ్యక్తి ఆమెకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేశారు. అనంతరం ఆమెను చౌక్‌ఘాట్ వద్ద వదిలేసి పోయారు. అతికష్టం మీద ఆమె ఏప్రిల్ 4వ తేదీన ఇంటికి చేరుకొని, కుటుంసభ్యులకు జరిగినది వివరించింది.

నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రధాని ఆదేశం
వారణాసి ఎంపీ కూడా అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ దారుణ ఘటనపై తీవ్రంగా స్పందించారు. అధికారులు శుక్రవారంనాడు ఆయనకు ఘటన వివరాలు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్‌, డివిజనల్ కమిషనర్‌, జిల్లా మేజిస్ట్రేట్ దర్యాప్తు జరుపుతున్నట్టు యూపీ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. నిందితులపై చట్టాలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించినట్టు అందులో పేర్కొంది.