విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి

- బిల్డింగ్ గోడపై తెగిపడిన కరెంట్ వైరు
- గోడను తాకిన వ్యక్తికి షార్ట్‌సర్క్యూట్
- అతడిని రక్షించబోయి తల్లి, బిడ్డ మృతి
- తమిళనాడు కన్యాకుమారిలో ఘటన
విధాత: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా అత్తూరులో దారుణం జరిగింది. విద్యుదాఘాతంతో గర్భిణీసహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులను అశ్విన్, చిత్ర, అథిరగా గుర్తించారు. అధికారుల వివరాల ప్రకారం.. అత్తూరులో మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వీధి స్తంభం వైరు తెగి బిల్డింగ్ గోడపై పడిపోయింది. దానిని గమనించకుండా గోడకు అశ్విన్ చేతి తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు.
దీనిని గమనించిన ఆయన తల్లి చిత్ర, సోదరి అథిర అతడిని రక్షించేందుకు ప్రయత్నించి షార్ట్‌సర్క్యూట్‌కు గురయ్యారు. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు. కాగా, అథిర గర్భిణి కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.