దేవనహళ్లిలో అక్రమనిర్బంధంలో సిద్దిపేటకు చెందిన ట్రాన్స్‌ఉమెన్…చెప్పుల దండ వేసిన వీడియో వైరల్
దేవనహళ్లిలో అక్రమనిర్బంధంలో సిద్దిపేటకు చెందిన ట్రాన్స్‌ఉమెన్...చెప్పుల దండ వేసిన వీడియో వైరల్

సిద్దిపేట: సుమారు 20 ఏళ్లపైబడిన వయసున్న ఒక ట్రాన్స్‌ఉమెన్ బెంగళూరులోని దేవనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గుర్తుతెలియని ప్రదేశంలో బందీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆమె పట్ల ఒక ట్రాన్స్‌జెండర్ లీడర్ అవమానకర పద్ధతిలో వ్యవహరించినట్టు సమాచారం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ట్రాన్స్‌ఉమెన్.. నెల క్రితం ఇష్టపూర్వకంగా సెక్స్‌మార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. బెంగళూరు వెళ్లి.. అక్కడ ఒక హిజ్రా కుటుంబంలో చేరింది. అయితే.. కొద్ది రోజులకు తిరిగి స్వస్థలానికి వెళ్లిపోవాలని భావించింది. అయితే.. ట్రాన్స్‌జెండర్ కుటుంబ సభ్యులు.. ఆమె కొంత నగదు తస్కరించిందని ఆరోపించారు. ఆమె మహారాష్ట్రలో ఉన్నట్టు తెలుసుకుని, పట్టుకుని తిరిగి బెంగళూరుకు తీసుకొని వచ్చారు. ఆమె మెడలో చెప్పుల దండ వేసి, నోట్లో చెప్పు పెట్టి ఊరేగించి వీడియో తీశారు. ఆమె పరువు తీసేలా దానిని వైరల్ చేశారు. ఆమెను విడుదల చేయించేందుకు వరంగల్‌కు చెందిన ఒక ట్రాన్స్‌జెండర్ లీడర్ వారికి కొంత డబ్బు ఇచ్చేందుకు కూడా సిద్ధపడి, ఆమెను తిరిగి బెంగళూరు నుంచి సిద్దిపేట పంపాలని కోరారు. ‘బాధితురాలి చెల్లెలు పెద్దగా చదువుకోని గృహిణి. ఆమె ఏదైనా దొంగతనం చేసిందని భావిస్తే ఆ డబ్బు నేను ఇస్తానని చెప్పాను. ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. కానీ.. వారి నుంచి స్పందన లేదు’ అని దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ కమ్యూనిటీ సమస్యలపై పనిచేస్తున్న సదరు ట్రాన్స్‌జెండర్ లీడర్ చెప్పారు. ‘ఒక వ్యక్తిని నిర్బంధించడం, అవమానించడం చట్టవిరుద్ధం. ఆమెను వెంటనే సురక్షితంగా విడుదల చేయాలి. దోషులను శిక్షించాలి’ అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మానవ హక్కుల ఫోరం కోఆర్డినేటింగ్ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ డిమాండ్ చేశారు.