Courage Shown by Nurse । నర్స్‌పై సామూహిక లైంగికదాడికి యత్నం.. డాక్టర్‌కు ఆ పార్ట్‌ కోసేసి తప్పించుకున్న నర్స్‌

సమయస్ఫూర్తి, చాకచక్యం ఉంటే కొన్ని సార్లు ప్రమాదాల నుంచి బయటపడవచ్చని నిరూపించింది బీహార్‌లో ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేసే నర్స్‌.

  • By: TAAZ    crime    Sep 13, 2024 6:20 PM IST
Courage Shown by Nurse । నర్స్‌పై సామూహిక లైంగికదాడికి యత్నం.. డాక్టర్‌కు ఆ పార్ట్‌ కోసేసి తప్పించుకున్న నర్స్‌

Courage Shown by Nurse । కొన్నిసార్లు ఎంతటి ప్రమాదాల నుంచైనా చాకచక్యంతో బయటపడవచ్చని నిరూపించింది బీహార్‌లోని ఒక నర్స్‌. ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేస్తున్న నర్స్‌పై సామూహిక లైంగిక దాడికి  (gang-rape attempt) కొందరు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అయితే.. చాకచక్యంగా వ్యవహరించిన ఆమె ఒక డాక్టర్‌ మర్మాంగాన్ని (private parts) బ్లేడ్‌తో కోసేసి.. అక్కడి నుంచి తప్పుకొన్నదని పేర్కొన్నారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ మెడికల్‌ కాలేజీలో (RG Kar Medical College) ఒక ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం నేపథ్యంలో తాజా నేరం వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన డాక్టర్లలో ఒకడు సమస్తిపూర్‌ జిల్లా ముర్సిఘరారరి ప్రాంతంలోని గంగాపూర్‌లో ఆర్‌బీఎస్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

హాస్పిటల్‌లో పని పూర్తి చేసుకున్న నర్స్‌ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, ఆయన మరో ఇద్దరు అనుచరులు ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో వారంతా మద్యం తాగి ఉన్నారని తెలుస్తున్నది. అయితే.. వారి నుంచి తప్పించుకున్న నర్స్‌.. ఒక బ్లేడ్‌తో డాక్టర్‌ మర్మాంగాన్ని కోసేసింది. వెంటనే హాస్పిటల్‌ నుంచి పారిపోయి.. బయట నుంచి పోలీసులకు ఫోన్‌ చేసి విషయం తెలిపింది. విషయం తెలియగానే తమ సిబ్బంది హాస్పిటల్‌కు చేరుకుని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ సంజయ్‌ కుమార్‌ పాండే తెలిపారు. నర్స్‌ను కూడా సేఫ్‌ కస్టడీలోకి తీసుకున్నట్టు చెప్పారు. మిగిలిన ఇద్దరు నిందితులను అవధేశ్‌ కుమార్‌, సునీల్‌ కుమార్‌ గుప్తాగా గుర్తించారు.

నర్స్‌ సాహసం అమోఘం

నర్స్‌పై లైంగిక దాడి  చేయడానికి ముందు నిందితులు సీసీ టీవీ కెమెరాలను డిస్‌కనెక్ట్‌ చేశారని, హాస్పిటల్‌ తలుపులు మూసివేశారని డీఎస్పీ కుమార్‌ తెలిపారు. ఈ సమయంలో నర్స్‌ చూపిన సాహసం అమోఘమని ప్రశంసించారు. ఘటనాస్థలంలో నిర్వహించిన ప్రాథమిక దర్యాప్తులో నర్స్‌ వాడిన బ్లేడ్‌, రక్తపు మరకలతో కూడిన దుస్తులు, ఒక మద్యం బాటిల్‌, మూడు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడికి ముందు ముగ్గురూ మద్యం తాగారని (influence of alcohol) పోలీసులు చెబుతున్నారు. బీహార్‌లో మద్య  నిషేధం అమల్లో  ఉన్న నేపథ్యంలో వారిపై ప్రొహిబిషన్‌ చట్టాల (prohibition laws) కింద కూడా కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.