Son Kills Parents In Neredmet : తల్లిదండ్రులను హతమార్చిన కొడుకు!
హైదరాబాద్ నేరెడ్‌మెట్‌లో దారుణం.. పిచ్చాసుపత్రిలో చేర్చారన్న కోపంతో కొడుకు తన తల్లిదండ్రులను కర్రతో కొట్టి హతమార్చాడు.

విధాత, హైదరాబాద్ : పిచ్చాసుపత్రిలో చేర్చారన్న కోపంతో ఓ కొడుకు తన తల్లిదండ్రులను హతమార్చిన ఘటన హైదరాబాద్-నేరెడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో చోటుచేసుకుంది. లక్ష్మి(65), రాజయ్య(78)లకు ముగ్గురు కొడుకులు, ఓ కుమార్తె ఉన్నారు. రెండో కొడుకు శ్రీనివాస్(36) మద్యానికి బానిసై తన భార్యను తరుచు కొడుతుండటంతో ఆమె అతడిని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో తల్లిదండ్రుల వద్ధ ఉంటున్న శ్రీనివాస్ రోజు తాగుతూ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం చేర్పించారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఇటీవలే శ్రీనివాస్ ఇంటికి తిరిగి వచ్చాడు.
కొంత కాలంగా వెల్డింగ్ షాపులో పనిచేస్తూ..రోజు తాగి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో గొడప పడటం సాగిస్తున్నాడు. తనను మెంటల్ ఆసుపత్రిలో చేర్చారనే కోపంతో రగిలిపోయిన శ్రీనివాస్ తల్లిదండ్రులు లక్ష్మీ, రాజయ్యలను ఆదివారం రాత్రి కర్రతో కొట్టి దారుణంగా హతమార్చాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.