Cyber Fraud | డబ్బులెవరికీ ఊరికే రావు.. మొత్తుకుంటున్నా వినలేదు.. 2 కోట్లకు మునిగారు!

నిజమే.. డబ్బులు ఎవరికీ ఊరికే రావు. వంద రూపాయలు పెట్టి సాయంత్రానికి వెయ్యిరూపాయలు రిటర్న్స్‌ వస్తాయని, అదే వెయ్యి రూపాయలు పెడితే పదివేలు వస్తాయని చాలా మంది సామాన్య ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లోని వాట్సాప్‌ గ్రూపుల్లో ఇటువంటి ఆఫర్స్‌ తెగ కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు.

  • By: TAAZ    crime    May 27, 2025 5:53 PM IST
Cyber Fraud | డబ్బులెవరికీ ఊరికే రావు.. మొత్తుకుంటున్నా వినలేదు.. 2 కోట్లకు మునిగారు!

Cyber Fraud | ఈజీ మనీ! ఇంట్లో కూర్చొని ఎక్కడో పెట్టుబడి పెడితే.. అది రోజులు, వారాల వ్యవధిలోనే రెట్టింపు అయిపోతుందని నమ్మించే ప్రకటనలు తరచూ వాట్సాప్‌, ఇతర సామాజి మాధ్యమాల్లో చూస్తేనే ఉంటాం. ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీల పేరిట విచ్చలవిడిగా ఆశలు చూపుతూ సాధారణ ప్రజలను టార్గెట్‌ చేస్తాయి. వీటి లోతుపాతులు తెలియని అమాయకులు వారి ఉచ్చులో పడి.. లక్షల్లో, కొన్నిసార్లు కోట్లల్లో నష్టపోతున్నారు. ఇటువంటి ఉదంతమే కర్ణాటకలో వెలుగు చూసింది. భారత దేశ ఐటీ రంగానికి కీలకమైన బెంగళూరులో అంతే స్థాయిలో ఐటీ మోసాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఏఐ సహకారంతో ఒక ఫేక్‌ యాప్‌ తయారు చేసిన సైబర్‌ నేరస్తులు.. 800 మంది ఇన్వెస్టర్లకు 2 కోట్ల మేరకు టోపీ పెట్టిన ఘటన వెలుగు చూసింది. ఈ ఫేక్‌ యాప్‌ను ట్రంప్‌ హోటల్‌ రెంటల్‌ పేరిట తయారు చేశారు. ఈ యాప్‌లో ఉంచిన ఏఐ జనరేటెడ్‌ వీడియోలు, ఫొటోలు అందులో ఉన్నది ట్రంప్‌ అని బలంగా నమ్మించేలా ఉన్నాయి. ఈ ఉదంతం వెలుగు చూసిన నేపథ్యంలో ఆ యాప్‌ను సైబర్‌ పోలీసులు నిలిపివేశారు. ఐదారు నెలలుగా ఈ మోసం కొనసాగుతూ వస్తున్నదని అధికారులు తెలిపారు. సైబర్‌ మోసాలపై ఎంత అప్రమత్తం చేస్తున్నా కొందరు అమాయకంగా వారి వలలో చిక్కుకుపోతున్నారని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. డబ్బులు సులభంగా రావన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

రిమోట్‌ జాబ్‌ ఆప్షన్‌.. పెట్టుబడికి సూపర్‌ రిటర్న్స్‌

దీనికి సంబంధించిన వివరాలను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం తొలగించిన ఈ యాప్‌ ఆధారంగా యూజర్లకు ఎక్కడి నుంచైనా ఉద్యోగం చేసుకోవచ్చనే ప్రలోభాలకు గురి చేశారు. అంతేకాదు.. పెట్టుబడులకు తక్కువ కాలంలోనే భారీ రిటర్న్స్‌ వస్తాయని కూడా నమ్మించారు. ప్రతి టాస్క్‌ ముగిసిన తర్వాత యూజర్ల డ్యాష్‌ బోర్డులపై వాళ్లు పెట్టిన పెట్టుబడి ఎంతగా పెరిగిందో చూపించేవారు. ఈ ట్యాస్క్‌లు యాడ్స్‌పై క్లిక్‌ చేయడం, వ్యక్తిగత వివరాలు సబ్మిట్‌ చేయడం వంటివి ఉండేవని సైబర్‌ క్రైమ్‌ అధికారులు తెలిపారు. అయితే.. వారు డ్యాష్‌బోర్డులపై ప్రదర్శించిన లాభాలన్నీ కల్పితాలేనని చెప్పారు. ‘కంప్లీట్‌ చేసిన ప్రతి ట్యాస్క్‌కు వారి సంపద పెరిగినట్టు చూపుతూ భ్రమ కలిగించేవారు. కానీ.. అదంతా బూటకం’ అని సైబర్‌ క్రైమ్‌, ఎకనామిక్‌ అఫెన్సెస్‌, నార్కొటిక్‌ (సీఈఎన్‌) ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌ఆర్‌ గణాచారి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు తెలిపారు. యూజర్లకు నమ్మకం కలిగించేందుకు మొదట్లో కొంత మొత్తాలను విత్‌డ్రా చేసుకునేందుకు కూడా సైబర్‌ నేరస్తులు అవకాశం కల్పించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అది కూడా 300 వంటి చిన్న చిన్న మొత్తాలను తీసుకునేందుకు అవకాశం ఇచ్చేవారని, దానికి కూడా కొంత పెట్టుబడి పెట్టాలని సూచించేవారని తెలిపారు.

ఆరు లక్షలు వదిలించుకున్న లాయర్‌

వీరి మాయలో పడిన ఒక లాయర్‌.. జనవరి, ఏప్రిల్‌ నెలల మధ్య కాలంలో సుమారు 6 లక్షల రూపాయలు సైబర్‌ నేరస్తులకు సమర్పించుకున్నారు. వాస్తవానికి ఆయనను రోజుకు 30 రూపాయల చొప్పున పెట్టుబడులు పెట్టాలంటూ ప్రోత్సహించారు. ‘నేను వాళ్ల వ్యవస్థను నమ్మిన తర్వాత వాళ్లు మరింత ఇన్‌వెస్ట్‌మెంట్‌ చేయాలని అడిగారు. కొంత పన్ను రూపంలో తిరిగి చెల్లించినా.. పూర్తి మొత్తం మాత్రం వెనక్కు రాలేదు’ అని బాధితుడు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు చెప్పారు. ఈ ఫేక్‌ యాప్‌కు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క హవేరీ జిల్లాలోనే 15 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్టు తెలుస్తున్నది. బెంగళూరు, తూమకూరు, మంగళూరు, హుబ్బళ్లి, ధార్వాడ్‌, కలబురగి, శివమొగ్గ, బళ్లారి, బీదర్‌ వంటి చోట్ల కూడా కేసులు వెలుగుచూస్తున్నాయి. బాధితులు ఇంకా ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. స్కామ్‌కు పాల్పడిన నిందితుల డిజిటల్‌ ఆనవాళ్లను సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.

డబ్బులు ఎవరికీ ఊరికే రావు!

నిజమే.. డబ్బులు ఎవరికీ ఊరికే రావు. వంద రూపాయలు పెట్టి సాయంత్రానికి వెయ్యిరూపాయలు రిటర్న్స్‌ వస్తాయని, అదే వెయ్యి రూపాయలు పెడితే పదివేలు వస్తాయని చాలా మంది సామాన్య ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లోని వాట్సాప్‌ గ్రూపుల్లో ఇటువంటి ఆఫర్స్‌ తెగ కనిపిస్తూ ఉంటాయి. ఒకే గ్రూపులో పదుల సార్లు ఆ సందేశాలను పంపించే సరికి.. ట్రై చేద్దామని అనుకునే కొందరు.. బోల్తా కొడుతున్నారు. కష్టపడితేనే సొమ్ము పెరుగుతుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయం. దానికి నిర్దిష్ట బ్యాంకర్లు, బ్యాంకుల నుంచి లేదా ఆర్థిక సంస్థల నుంచి లైసెన్స్‌ పొందిన ఏజెంట్లు మాత్రమే చేయాలి. మ్యూచ్యువల్‌ ఫండ్స్‌, షేర్స్‌ అనేవి షేర్‌ మార్కెట్‌ ఒడిదుడులకు లోబడి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇటువంటి ఆఫర్లను పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మోసకారుల నుంచి మీ స్నేహితులు, ఆప్తులను రక్షించుకునేందుకు ఇటువంటి సమాచారాలను విస్తృతంగా పంచుకోండి.

ఇవి కూడా చదవండి..

Cyber Frauds | తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలో సైబర్‌ స్కామ్‌ నేరాల తర్వాత అత్యధిక కేసులు అవే!
Cyber Crime | ఆన్ లైన్ మోసాలు.. బాధితులకు రూ.3.27కోట్లు రీఫండ్
Cyber Fraud | ఆ లింకులను క్లిక్‌ చేస్తున్నారా..? అలా చేస్తే మీ వాట్సాప్‌ అకౌంట్‌ హ్యాకే..!
Cyber Agency Warning | పెరుగుతున్న సైబర్‌ మోసాలు.. కీలక సూచనలు చేసిన సైబర్‌దోస్త్‌..!