Kartika Purnima | రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఈ ఆల‌యాల‌ను ద‌ర్శించుకోండి..!

Kartika Purnima | రేపే కార్తీక పౌర్ణ‌మి( Kartika Purnima ). ఈ క్ర‌మంలో శివాల‌యాల‌న్నీ( Shiva Temples ) భ‌క్తుల‌తో సంద‌డిగా మార‌నున్నాయి. అయితే కార్తీక పౌర్ణ‌మి రోజున ఈ ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తే జీవితంలో శుభాలు క‌లుగుతాయ‌ని భ‌క్తుల( Devotees ) విశ్వాసం.

  • By: raj |    devotional |    Published on : Nov 04, 2025 6:41 AM IST
Kartika Purnima | రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఈ ఆల‌యాల‌ను ద‌ర్శించుకోండి..!

Kartika Purnima | కార్తీక మాసం( Karthika Masam ) కొన‌సాగుతోంది. అయితే కార్తీక పౌర్ణ‌మి( Kartika Purnima ).. బుధ‌వారం వ‌చ్చింది. ఈ క్ర‌మంలో రేపు రాష్ట్రంలోని శివాల‌యాల‌న్నీ( Shiva Temples ) భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడ‌నున్నాయి. శివ నామ‌స్మ‌ర‌ణ‌తో మార్మోగ‌నున్నాయి. ఇప్ప‌టికే శివాల‌యాల‌న్నీ భ‌క్తులతో( Devotees ) నిండిపోతున్నాయి. మ‌రి తెలంగాణ‌( Telangana )లోని ఈ ఆల‌యాల‌ను కార్తీక మాసంలో గానీ, కార్తీక పౌర్ణ‌మి రోజున సంద‌ర్శిస్తే శుభాలు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ ఆల‌యాల వివ‌రాలు తెలుసుకుందాం..

వేములవాడ రాజరాజేశ్వరస్వామి

రాజ‌న్న సిరిసిల్ల జిల్లా వేముల‌వాడ‌లో రాజ‌రాజేశ్వ‌ర స్వామి కొలువ‌య్యాడు. ఈ ఆల‌యంలో శంక‌రుడిని రాజ‌న్న‌గా భ‌క్తులు ఆరాధిస్తారు. ప్రాచీన‌మైన ఈ దేవాల‌యాన్ని ద‌క్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ కోడెను సమర్పిస్తే సంతానం లేని దంపతులకు పిల్ల‌లు క‌లుగుతార‌నే న‌మ్మ‌కం ఉంది. ఇక్కడ గండదీపాలు వెలిగిస్తే గండాలు తొలగిపోతాయని నమ్మకం. ఏటా శివరాత్రి, కార్తీకమాసంలో ఇక్కడ జరిగే అభిషేకాలు, పూజలు చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తుసు తరలివస్తారు.

కాళేశ్వరం

తెలంగాణలో ఉన్న మరో ప్రముఖ శైవక్షేత్రం కాళేశ్వరం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరానికి కార్తీకమాసంలో భక్తులు పోటెత్తుతారు. అత్యంత పురాతన శైవ దేవాలయాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటూ ఇరుగు పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా తరలివస్తారు. ప్రాణహిత నది, గోదావరి కలిసే చోటున కొలువుదీరిన ముక్తేస్వరస్వామిని దర్శించుకుంటే శివసాయుజ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

కొమురవెల్లి మల్లన్న

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొండపై కొలువయ్యాడు కొమురవెల్లి మల్లికార్జునుడు. ఈ క్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుంది. శివరాత్రి, కార్తీకమాసంలో పంచాక్షరి మంత్రంతో మారుమోగిపోతుంది.

వేయి స్తంభాల గుడి

వరంగల్ లో ఉన్న వేయిస్తంభాల గుడి తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి. దీన్ని 12 వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించగా.. అనంతర రాజులు ఈ ఆలాయన్ని సంరక్షించారని చెబుతారు. వేయిస్తంభాల్లో కొన్ని విడివిడిగా మరికొన్ని కలసిపోయినట్టు కనిపిస్తాయి. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ స్థంభాలను నాణెంతో కానీ లోహంతో కానీ తాకితే సప్త స్వరాలు వినిపిస్తాయి.

కీసరగుట్ట

హైదరాబాద్ సమీపంలో మేడ్చర్ జిల్లాలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట. కార్తీకమాసంలో ఈ క్షేత్రం భక్తులతో కళకళలాడుతుంది. ఏటా శివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కార్తీకమాసం నెలరోజులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఆధ్యాత్మిక శోభను తిలకించేందుకు భారీ భక్తులు తరలివస్తారు.

పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం

నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్న పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో స్వామిని దర్శించుకునేందుకు కార్తీకమాసంలో భక్తులు పోటెత్తుతారు. 800 ఏళ్ల క్రితం కుందూరు చోళులు పరిపాలించిన ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయం గర్బగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా కనిపించే నీడ, మరొకటి అక్కడ చెరువులో నీరుంటే గర్బగుడిలో కూడా నీరు ఉబికి రావడం. చెరువు ఎండితే గర్బగుడిలో నీరు కనిపించకపోవడం. అయితే ఈ మధ్యకాలంలో చెరువులో నీరున్నా గర్భగుడి నిండిపోకుండా ఉండేందుకు మార్పులు చేర్పులు చేశారు.

చెరువుగట్టు

సూర్యాపేట సమీపంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి. పరుశారాముడు కార్తవీర్యర్జునుడిని వధించిన తర్వాత 108 క్షేత్రాల్లో శివలింగాలు ప్రతిష్టించాడు..అందులో చివరిది ఈ క్షేత్రం అని చెబుతారు. ఇక్కడ పార్వతి దేవి ఆలయం గట్టు క్రింద ఉంటుంది.

చిలుకూరు లోటస్ టెంపుల్

చిలుకూరులో ఉన్న కమల్ ధామ్ లోటస్ టెంపుల్ కార్తీకమాసంలో కళకళలాడుతుంది. రుద్రాక్ష, త్రినేత్రం, నాభి ఉన్నట్లుగా సహజసిద్ధంగా కనిపిస్తుంది ఇక్కడ శివలింగం. ఈ శివలింగం పురుషోత్తం భాయ్ అనే భక్తుడికి నర్మదానందీ తీరంలో దొరికిందని..దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు.