Srisailam | శ్రీశైల క్షేత్రంలో మొదలైన కార్తీక మాసోత్సవాలు.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలను నిలిపివేత..!
Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు శనివారం మొదలయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు కొనసాగనున్నాయి. పరమపవిత్రమైన మాసంలో భ్రామరి సమేత మల్లికార్జున స్వామిదర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు.

Srisailam | ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు శనివారం మొదలయ్యాయి. నేటి నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు కొనసాగనున్నాయి. పరమపవిత్రమైన మాసంలో భ్రామరి సమేత మల్లికార్జున స్వామిదర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ క్రమంలో అధికారులు గర్భాలయ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆది, సోమవారాల్లో స్వామివారి స్పర్శ దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మంగళవారం నుంచి శుక్రవారం వరకు సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలు కొనసాగనున్నాయి. ఆలయ ఉత్తర మాఢ వీధుల్లో భక్తులు మట్టి దీపాలను వెలిగించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్తీకమాసం పర్వదినాలు, సెలవు రోజుల్లో భక్తుల సంఖ్య రద్దీగా ఉండే అవకాశం ఉన్నది. క్షేత్రానికి వచ్చే భక్తులకు దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక మాసంలో గర్భాలయంలో ఆర్జిత అభిషేకాలను పూర్తిగా నిలిపివేసింది. కార్తీకమాసంలో రద్దీ రోజులైన శని, ఆది, సోమ వారాలతో పాటు శుద్ధ ఏకాదశి, కార్తీక పూర్ణిమ మొదలైన 15 రోజులు మల్లన్న స్పర్శదర్శనాలను నిలిపివేశారు. కార్తీకమాసంలో ఉచిత స్పర్శదర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు.
సాధారణ రోజుల్లో రోజుకు మూడు విడతలుగా స్పర్శదర్శనం, మూడు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పించనున్నారు. స్పర్శదర్శనం టికెట్లను, ఆర్జిత అభిషేకాల టికెట్లను భక్తులు ఆన్‌లైన్‌లో తీసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు. నవంబర్ కోటా టికెట్లను దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సేవల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న భక్తులు టికెట్లను srisailadevasthanam.org వెబ్‌సైట్, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చని అధికారులు వివరించారు.