Tallest Ram Statue Canada | ధర్మం ప్రతిష్ఠించిన 51 అడుగుల శ్రీరామ‘మూర్తి’ – కెనడాలో వెలసినఅయోధ్య

ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని కెనడా దేశంలోని మిస్సిస్సాగా నగరంలో హిందూ హెరిటేజ్ సెంటర్‌ ప్రాంగణంలో ఆవిష్కరించడం హిందూ ధర్మానికి, భారతీయ సంస్కృతికి, సనాతన ఆధ్యాత్మికతకు చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

  • By: TAAZ |    devotional |    Published on : Aug 06, 2025 1:57 AM IST
Tallest Ram Statue Canada | ధర్మం ప్రతిష్ఠించిన 51 అడుగుల శ్రీరామ‘మూర్తి’ – కెనడాలో వెలసినఅయోధ్య

Tallest Ram Statue Canada | ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని కెనడా దేశంలోని మిస్సిస్సాగా నగరంలో హిందూ హెరిటేజ్ సెంటర్‌ ప్రాంగణంలో ఆవిష్కరించడం హిందూ ధర్మానికి, భారతీయ సంస్కృతికి, సనాతన ఆధ్యాత్మికతకు చరిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. 51 అడుగుల ఎత్తుతో అమలైన ఈ విగ్రహం సాధారణ విగ్రహం కాదు – అది విశ్వమానవ హృదయాల్లో ధర్మాన్ని నెలకొల్పుతూ నిలిచే శాశ్వతమైన సౌధం. ఈ విగ్రహ నిర్మాణం ఢిల్లీలో ప్రారంభమై, శిల్పకళలో నిష్ణాతులైన కళాకారుల చేతుల్లో ఆకారాన్ని సంతరించుకొని, అనంతరం కెనడాలోని టొరంటో నగరానికి సమీపంలో ఉన్న మిస్సిస్సాగా ప్రాంతానికి చేరి, అక్కడే హిందూ హెరిటేజ్ సెంటర్‌లో ప్రతిష్ఠించబడింది. ఫైబర్‌గ్లాస్‌తో నిర్మితమైన ఈ విగ్రహం స్థూలంగా చూస్తే 200 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులనూ తట్టుకునే విధంగా ఇంజినీర్లచే రూపొందించబడింది. దీని నిర్మాణం కనీసం వంద సంవత్సరాల పాటు నిలిచేలా రూపొందించబడినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ విగ్రహాన్ని ప్రజల మధ్య ఆవిష్కరించే కార్యక్రమం మే నెలలో జరగగా, దాదాపు పది వేల మందికి పైగా భక్తులు ఇందులో పాల్గొన్నారు. కేవలం భక్తులు మాత్రమే కాకుండా, కెనడియన్ ప్రభుత్వంలోని పలు శాఖల మంత్రులు – మహిళా మరియు లింగ సమానత్వ శాఖ మంత్రి రిచీ వాల్డెజ్, ట్రెజరీ బోర్డు అధ్యక్షుడు షాఫ్కట్ అలీ, అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మనీందర్ సిద్ధు, ప్రతిపక్ష నేత సహా పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఈపుణ్య ఘట్టానికి ప్రత్యేక గౌరవాన్ని చేకూర్చింది. కార్యక్రమాన్ని నిర్వహించిన హిందూ హెరిటేజ్ సెంటర్ వ్యవస్థాపకులు ఆచార్య సురిందర్ శర్మ శాస్త్రి మాట్లాడుతూ – “ఇది కేవలం ఒక ప్రతిష్ఠా కార్యమేగాక, సమాజానికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపే దీపస్తంభం. శ్రీరాముడు ధర్మాన్ని నిలిపినవాడని మనం పునఃస్మరించుకోవాల్సిన సమయం ఇది” అని వ్యాఖ్యానించారు.

ఈ విగ్రహ స్థాపన వెనుక నలుగురు ఇండో–కెనడియన్ పారిశ్రామికవేత్తలు తమ వంతు సాయాన్ని అందించగా, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన యువకుడు కుశాగ్ర్ శర్మ మాట్లాడుతూ – “భారతీయులంతా ఏకతాటిపై రావాలన్న సంకల్పంతో, భక్తి మరియు సాంస్కృతిక విలువలకు నిలయంగా ఉండేలా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాము. ఇది మతానికి మాత్రమే కాదు –సామాజిక ఐక్యతకు, శాంతికి ప్రతీక” అన్నారు. ఈ విగ్రహం ప్రతిష్టించబడిన స్థలం, టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండడంతో, అక్కడ దిగే ప్రతి విమాన ప్రయాణికుడికీ ఇది భూలోక వైకుంఠంలా కనిపిస్తోంది. కొత్తగా కెనడాలో అడుగుపెట్టే భారతీయులకూ, స్థానిక హిందూ సమాజానికీ ఇది మరో అయోధ్యలా నిలుస్తోంది.

ఈ విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం సోషల్ మీడియా వేదికగా అనేకమంది భక్తితో స్పందించారు. “ఆయోధ్య నుండి ఓంటారియో వరకు శ్రీరామనామధ్వని ప్రతిధ్వనిస్తోంది. ఇది కేవలం విగ్రహం కాదు – ఇది ధర్మానికి, సమూహ శక్తికి, భక్తికి నిలువెత్తు సంకేతం” అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, మరోకరు “సనాతనధర్మ సమాజానికి ఇది గర్వకారణం” అని పేర్కొన్నారు. “Let’s make Canada great again”, “Sanatan stands tall”, “Faith beyond borders” వంటి వ్యాఖ్యలు ఈమూర్తికి ప్రపంచ హిందూ సమాజం తరఫున వచ్చిన కృతజ్ఞతల సంకేతాలుగా నిలిచాయి.

ఈ విగ్రహం స్థాపన ద్వారా కేవలం ఒక మూర్తిని ప్రతిష్ఠించినట్లు కాక, శాశ్వత ధర్మాన్ని, ఆధ్యాత్మికతను, భారతీయతను,విశ్వవ్యాప్తమైన శ్రీరామతత్వాన్ని ప్రతిష్ఠించినట్లైంది. ఇది కెనడా నేలపైపురుషోత్తముడు శ్రీరాముడి ధ్వజం ఎగురవేయడం మాత్రమే కాదు – హింసకు బదులుగా శాంతిని, విచ్ఛిన్నానికి బదులుగా ఐక్యతను, మత విద్వేషానికి బదులుగా విశ్వసౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పే ఆధ్యాత్మిక శిల్పంగా మిగిలిపోతుంది.

ఈ ఘనమైన ఆవిష్కరణ, కెనడాలో స్థిరపడిన హిందువులకే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకూ ఒక గొప్ప గౌరవ ఘట్టంగా నిలిచింది. శ్రీరాముని రూపంలో ప్రతిష్ఠించబడిన ఈ విగ్రహం, కేవలం విగ్రహంగా కాక – ఒక సంస్కృతిక శక్తిగా, ధర్మ ప్రేరణగా, విశ్వ ఐక్యతకు పునాది రాయిగా నిలవబోతోంది.