07 జులై నుంచి 13 వ‌ర‌కు.. ఈ రాశివారు జీవిత భాగ‌స్వామితో అన్యోన్యంగా ఉంటారు..!

చాలా మందికి జ్యోతిష్యం అంటే ఎంతో న‌మ్మ‌కం. తమ త‌మ రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. ప్ర‌తి వారం త‌మ రాశిఫ‌లాల‌ను చూసుకుని, వాటిని అనుస‌రించి త‌మ కార్య‌క‌లాపాల‌ను రూపొందించుకుంటారు. మ‌రి ఈ వారం రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

07 జులై నుంచి 13 వ‌ర‌కు.. ఈ రాశివారు జీవిత భాగ‌స్వామితో అన్యోన్యంగా ఉంటారు..!

మేషం

మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహచరుల సహకారంతో సకాలంలో అన్ని పనులు పూర్తవుతాయి. కుటుంబంలో శుభకార్యాల హడావిడి ఉంటుంది. ఊహించని ధనలాభం ఉండవచ్చు. వ్యాపారంలో పోటీ, సవాళ్లు ఉండవచ్చు సంయమనం అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. రోజువారీ పనులు ప్రణాళిక బద్ధంగా నిర్వహించుకుంటే సమస్యలు ఉండవు. విదేశాలలో కెరీర్ కోసం ప్రయత్నించే వారికి ఆటంకాలు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

వృషభం

వృషభరాశి వారికి గడ్డుకాలం నడుస్తోంది. ఎంత కష్టపడినా ఆశించిన ప్రయోజనాలు లేక నిరాశ నిస్పృహలకు లోనవుతారు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు రావచ్చు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు అందుకోడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఉద్యోగులు సహోద్యోగులతో, ఉన్నతాధికారులతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కష్టపడి పనిచేస్తేనే విజయం సాధిస్తారు. సన్నిహితుల మధ్య అపార్థాలు అనుమానాలతో మనశ్శాంతి లోపిస్తుంది.

మిథునం

మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గొప్ప వ్యక్తుల సహకారంతో విజయాన్ని సాధించగలుగుతారు. మీ విజయాలకు అసూయపడే సహోద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. భూమి, భవనాలకు సంబంధించిన వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారులు భాగస్వామ్య వ్యాపారాలలో ముందుచూపుతో వ్యవహరిస్తే మంచిది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అద్భుతమైన శుభ వార్తలను అందుకుంటారు. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మొదలు పెట్టిన అన్ని పనులు విజయాలను చేకూరుస్తాయి. ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు ఈ వారం శుభ ఫలితాలు ఉంటాయి. భూమి, భవనాల క్రయ విక్రయాలు లాభాన్ని అందిస్తాయి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. లాభాల కోసం ప్రమాదకరమైన పథకాలలో పెట్టుబడి పెట్టడం మానుకోండి. విదేశాలలో వృత్తిని వ్యాపారాలు ప్రారంభించాలని ఆశించే వారికి అడ్డంకులు తొలగిపోతాయి. బంధువుల ఇంట్లో శుభకార్యాలకు హాజరవుతారు.

సింహం

సింహరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పనిపై ప్రభావాన్ని చూపుతాయి. అన్ని రంగాల వారికి పనుల్లో ఆలస్యం, పొరపాట్లు వంటివి జరుగుతాయి. చేసిన పనే మళ్లీ చేయాల్సి వస్తుంది. వృత్తి వ్యాపార రంగాల వారు చేతికి అంది వచ్చిన అవకాశాన్ని కోల్పోతారు. ప్రత్యర్థుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తి, భూ సంబంధ వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగులు అన్ని విషయాల్లో ఆచి తూచి వ్యవహరిస్తే మంచిది. లేకుంటే సమస్యల్లో ఇరుక్కుంటారు. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

కన్య

కన్య రాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. అన్ని రంగాల వారికి ఈ వారం వృత్తి వ్యాపారాలలో కార్యసిద్ధి, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉద్యోగులు ముఖ్యమైన బాధ్యతలు చేపడతారు. మార్కెట్‌లో మీ విశ్వసనీయత కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి వారం చివరలో పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ రావచ్చు. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అధిక ధనవ్యయం ఉంటుంది.

తుల

తులారాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహసంచారం అనుకూలంగా లేనందున ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వివాదాలలో కోర్టుకు హాజరుకావలసి ఉంటుంది. సాధ్యమైనంత వరకు సమస్యను కోర్టు వెలుపల రాజీ మార్గంలో పరిష్కరించుకునే మంచిది. సోదర వర్గంతో గొడవలు మానసిక అశాంతికి కారణమవుతాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఉద్యోగంలో సమస్యలు ఉండవచ్చు. వ్యాపార వర్గం వారికి ఈ వారం చివరి భాగంలో అనవసర ప్రయాణాలుంటాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ జనకంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ వారం విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. దైవబలంతో కార్యసిద్ధి, లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తాయి. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి విపరీతమైన లాభాలను అందుకుంటారు. అవసరమైన ధనం సమకూరుతుంది. జీతం పెరుగుదల కూడా ఆశించిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రత్యర్ధులు పనిలో ఆటంకాలు సృష్టించే ప్రమాదం ఉంది. అందుకే వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తీవ్రమైన శ్రమతో మాత్రమే విజయాన్ని అందుకోగలరు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. జీవిత భాగస్వామితో కలిసి తీర్ధ యాత్రలకు వెళతారు.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ శక్తియుక్తులను పూర్తి స్థాయిలో వినియోగించున్నట్లైతే ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని, ఆర్థిక లాభాలను పొందవచ్చు. సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది. ఈ పరిచయం మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. వర్కింగ్ మహిళలు వృత్తి పరంగా గొప్ప విజయాలు సాధిస్తారు. కుటుంబంలో, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటవుతారు. మీ తల్లిగారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండవచ్చు.

మకరం

మకర రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ప్రతిపనిలోను తొందర, పరుగులు ఎక్కువగా ఉంటాయి. విశ్రాంతి లేకుండా సుదీర్ఘంగా పని చేయడం వలన ఆరోగ్యం దెబ్బ తింటుంది. బాధ్యతలు, కర్తవ్యాలను నెరవేర్చడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఇంటి మరమ్మత్తు పనులకు సంబంధించి అధిక ధనవ్యయం ఉంటుంది. కొన్ని ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి ఇంకొంత కాలం నిరీక్షణ తప్పదు. జీవిత భాగస్వామితో విభేదాలు పెరుగుతాయి. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించండి. ఇంట్లో పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. సోమరితనం, మితిమీరిన గర్వం కారణంగా పనిలో నిర్లక్ష్య వైఖరితో మొదటికే మోసం తెస్తుంది. బద్ధకం వీడితే మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయండి. లేకుంటే భారీ నష్టాలు ఉండవచ్చు. ఆస్తి వివాదాల విషయంలో కోర్టుకు వెళ్లడం కంటే, సామరస్యపూర్వక చర్చల ద్వారా పరిష్కరించడం ఉత్తమం. ఆర్థిక లావాదేవీలను నిర్వహించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో చోర భయం ఉండవచ్చు అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు.

మీనం

మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో శ్రమించి తమ లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగులు తమ పనిని ఇతరులకు అప్పగించకుండా పూర్తి చేస్తేనే మంచిది. లేదంటే ఉన్నతాధికారుల నుంచి సమస్యలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారులకు వారం ద్వితీయార్ధం శుభప్రదంగా ఉంటుంది. లాభాల పంట పండుతుంది. వ్యాపారాన్ని బ్రహ్మాండంగా విస్తరిస్తారు. సంపద గణనీయంగా పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు దొరుకుతాయి.