అర్జునుడు – కర్ణుడు.. ఇద్దరిలో ఎవరు గొప్ప..?
కల్కి 2898 ఏడి సినిమా విడుదలైన దగ్గర్నుండీ అర్జునుడు, కర్ణుడు.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ బాగా ఊపందుకుంది.అసలు అర్జునుడు – కర్ణుడు.. ఇద్దరిలో ఎవరు గొప్ప..? ఈ చర్చకు సమాధానమే వ్యాస భగవానుడు ప్రత్యక్షంగా చూసి, రాసిన మహాభారతం. పంచమ వేదం.

కల్కి 2898 ఏడి సినిమా విడుదలైన దగ్గర్నుండీ అర్జునుడు, కర్ణుడు.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే చర్చ బాగా ఊపందుకుంది. ఎందుకంటే, అభిమానులు. కల్కి 2898 ఏడీలో కర్ణుడిగా నటించిన ప్రభాస్ అభిమానులు, అర్జునుడిగా నటించిన విజయ్ దేవరకొండ అభిమానులు ఇందుకు కారణం. మరో కారణమేమిటంటే వీళ్లందరూ పిల్లలు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నవారు. మహాభారతం అసలు తెలియకపోవడం వారి దురదృష్టం. ప్రభాస్ కర్ణుడి పాత్ర ధరించాడు కాబట్టి అయన గొప్ప అని ఈ వర్గం, విజయ్ అర్జునుడి పాత్ర పోషించాడు కాబట్టి, ఆయనే గొప్ప అని ఆ వర్గం అసలు విషయం తెలియక కొట్లాడుకుంటున్నారు. ఈ పంచాయితీ ఇప్పటిది కూడా కాదు, ఇదివరలో కూడా ఒకసారి జరిగింది. అసలు ఈ చర్చకు సమాధానమే వ్యాస భగవానుడు ప్రత్యక్షంగా చూసి, రాసిన మహాభారతం. పంచమ వేదం.
సినిమాలు, సీరియళ్ళలో ఎలా చూపించినా, ఎవరు ఏమిటనేది వ్యాసభారతం(Maha Bharatha) ఆసాంతం చదివితేనే తెలుస్తుంది. మహాభారత కాలంలో ఉన్న కొద్దిమంది ఉత్తమ విలువిద్య నిపుణుల్లో (Archery Toppers) కర్ణుడు కూడా ఒకడు. ఒక వ్యక్తిగా అతనిలో సుగుణాలు ఉన్నాయి, దోషాలు కూడా ఉన్నాయి. కర్ణుడు అస్త్ర విద్యలో నిపుణుడే ఐనా, అతని అస్త్రములన్నీ శాపగ్రస్తములు. నేర్చుకున్న విద్యలు కపటంతో నేర్చుకున్నాడు. అటువంటి విద్య ఎన్నటికీ అక్కరకు రాదు. కర్ణుడు స్వతహాగా గర్వి, అభద్రతాపరుడు. అర్జునుడి పట్ల అసూయతో విద్యలనభ్యసించాడు.
వయసులో కర్ణుడు పాండవులందరికన్నా కనీసం పదేళ్ళు పెద్దవాడు. వయసులో అంత చిన్నవాడైన అర్జునుడి(Arjuna)తో అతని పోటీ, ఏదో చిన్నపిల్లాడితో కాలేజీ కుర్రాడు వైరం పూనినట్టు ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ కాలపు సాటిలేని విలుకాడు అనిపించుకోవాలన్నది కర్ణుడి ధ్యేయం, కానీ అందుకోసం అంత చిన్నవాడైన అర్జునుడిని దాటాలి. ఈ అసూయే కాలక్రమేణా వైరంగా మారింది. తనను తాను సాటిలేని విలుకాడుగా నిరూపించుకోవడం కోసం దుర్యోధనుడి(Dhuryodhana)తో స్నేహం అతనికి ఆసరా అయ్యింది. (Karna’s entire education was full of envy and hatred towards Arjuna)
కర్ణుడు, అర్జునుడు ఇద్దరు ద్రోణ-కృపాచార్యుల వద్ద చదువుకున్నవారే. అక్కడ అర్జునుడు విద్యలో పైకెదగడానికి ప్రయత్నిస్తే, ఆ అర్జునుడిని చూసి అసూయ పెంచుకున్నవాడు కర్ణుడు. కానీ అర్జునుడు మాత్రం ఏనాడు కర్ణుడు గురించి అంతగా ఆలోచించినట్టు కనపడదు. విద్యంటే అమితమైన ప్రేమ, ఆ విద్యలో రాణించాలి. “పక్షి కన్ను మాత్రమే కనబడుతోంది గురుదేవా..” అన్న అర్జునుడి మాట ఏకాగ్రతకు నిదర్శనం(Arjuna is the example of Concentration). లక్ష్యసాధనకు ఈనాటికీ పెద్ద పెద్ద బిజినెస్ స్కూళ్ల(Business Schools)లో ఉదహరించే మాట. ఆ విద్యలకై గురువుల వద్ద వినయము, ఆ విద్య నేర్చుకునేటప్పుడు ఎనలేని దీక్ష, పట్టుదల, కృషి (Determination, Dedication, Hard work) అతణ్ణి మరో స్థాయిలో నిలబెట్టాయి. పరశురాముడి తర్వాత జ్ఞానార్జన, అస్త్రసముపార్జన కర్ణుడు నిలిపివేసాడు, కానీ అర్జునుడు ఆగలేదు. దేవతలు, ఇంద్రుడు, వసువులు, అగ్నివేశుడు, కృష్ణుడు, శివుడు ఇలా ఎందరివద్దనో కృషితో, తపస్సుతో ధనుర్వేదమును, సకలాస్త్రములను సంపాదించాడు. ‘అర్జునుడు దగ్గరున్నన్ని అస్త్రములు ఎవ్వరి దగ్గర లేవు. అతణ్ణి నిర్జించడం మీకెవరికి సాధ్యం కాదు. ముల్లోకాల్లో అతణ్ణి జయించగలిగేవారు లేరు.’ అని పరశురాముడు సభామధ్యమున తన శిష్యులైన భీష్మద్రోణకర్ణులు వింటుండగా బాహాటంగా ఉద్యోగపర్వంలో ప్రకటించాడు.
మనకొక విద్య వచ్చినా దానిని నిరూపించుకోవటానికి సరైన అవకాశాలు రావాలి. చదివిన చదువుకు ప్రశ్నాపత్రంలాంటివి అవన్నీ. అక్కడే మన ప్రతిభ బయటపడుతుంది. అర్జునుడుకి, కర్ణుడుకి సమంగా వచ్చిన అవకాశాలు నాలుగు. అవి – ద్రుపదుడి పరాభవం, ద్రౌపది స్వయంవరం, ఘోషయాత్ర, ఉత్తరగోగ్రహణం. ఈ అన్ని సందర్భాల్లో కర్ణుడు విఫలమయ్యాడు, అర్జునుడే రాణించాడు.
వ్యక్తిత్వంలో, ధర్మాచరణలో కూడా అర్జునుడే కర్ణునికన్నా అధికుడు. ద్రౌపది వస్త్రాపహరణం, ఉత్తరగోగ్రహణం వంటివి అందుకు తార్కాణాలు. యతో ధర్మస్తతో కృష్ణః అంటారు, భగవానుడు అర్జునుడు వైపు ఉన్నప్పుడే తెలిసింది కదా ఎవరు ధర్మాత్ముడో. ఇక శక్తి పరంగా గాని, యుక్తి పరంగా కానీ, జ్ఞానం పరంగా కానీ, ధర్మం పరంగా కానీ అర్జునుడు కర్ణుడి కన్నా 1000 రెట్లు గొప్పవాడు. పరమశివుడిని సంవత్సర కాలం తపస్సుతో మెప్పించి పాశుపతాస్త్రం వరంగా పొందిన మహానుభావుడు. ఇంద్రుడి అర్థసింహాసనం అధిష్టించిన దిట్ట. ఊర్వశి వంటి అప్సరస తనంత తాను కోరి వస్తే మాతృ భావంతో తిరస్కరించిన స్థితప్రజ్ఞుడు. కర్ణుడి లాగా దక్కని స్త్రీని వివస్త్రు రాలను చేసి అవమానిస్తుంటే చూస్తూ నిలబడేవాడు కాదు.
అర్జునుడు చేసినన్ని యుద్ధాలు, అనుభవం కర్ణుడికి లేదు. యుద్ధవిద్యలో అర్జునుడికి తెలియని విషయం లేదు. యుద్ధవిద్యలో కర్ణుడికి తెలియని మరొక అంశం వ్యూహ రచన, ఛేదన (War stratigies). అర్జునుడికి తెలియని వ్యూహ రచన-ఛేదన లేదు. అందుకే పద్మవ్యూహం(Padma Vyuha) నాడు కౌరవులు అర్జునుడు లేకుండా చూసుకోవలసి వచ్చింది. అర్జునుడి పట్ల కర్ణుడి వైరం ఎంతటివరకు వెళ్ళిందంటే, పాండవులు తన తమ్ముళ్ళని శ్రీకృష్ణుడి ద్వారా తెలిసాక కూడా, నలుగురు పాండవుల్ని చిక్కినా విడిచిపెడతాను కానీ అర్జునుడి మాత్రం వదలను అని కుంతీదేవికి మాట ఇస్తాడు. కురుక్షేత్రం ముందటి వరకు ఎన్ని అవకాశాలు వచ్చినా కర్ణుడు ఒక్కసారి కూడా అర్జునుడి కన్నా మెరుగని నిరూపించుకోలేకపోయాడు.
అర్జునుడు స్వతహాగా సంయమనశీలుడు, ఉగ్రంగా యుద్ధం చేయడం అతని లక్షణం కాదు. కానీ అభిమన్యుడు(Abhimanyu) చనిపోయిన మర్నాడు, యుద్దపు 14వరోజున చూడాలి అర్జునుడి మహోగ్ర రూపం. ఒకటి కాదు మూడు వ్యూహాలు – శకట, పద్మ, శుచి వ్యూహాలు ప్రవేశించి ఛేదించుకుని వెళ్తాడు జయద్రథుడి(సైంధవుడు) కోసం. ఆ రోజు పాండవులకెంత ముఖ్యమో కౌరవులకు అంతకన్న ఎక్కువ ముఖ్యమైనది. కానీ ఆరోజు అర్జునుడు కాలాగ్ని సముడు. అతన్ని ఆపడం దేవతలతో సహా ఎవ్వరి తరమయ్యేది కాదు. He was JUST unstoppable. బీభత్స అనే పేరు అర్జునుడికి ఇందువల్లే వచ్చింది. ఒంటిచేత్తో ఆనాడు 7 అక్షౌహిణుల సైన్యాన్ని మట్టుపెట్టాడు. కౌరవుల మొత్తం సైన్యం 11 అక్షౌహిణులైతే, 7 ఒక్కనాడే కుప్పకూలాయి.
ఇక్కడ అక్షౌహిణి అంటే వివరించాల్సిఉంది. అక్షౌహిణి అంటే సైన్యం కొలత. సాధారణంగా సైన్యంలో రథాలు, గుర్రాలు, ఏనుగులు, సైనికులు భాగంగా ఉంటారు. ఈ నాలుగు విభాగాలను ఒక నిష్పత్తిలో (1:1:3:5 – ఒక రథం, ఒక గజం, మూడు గుర్రాలు, ఐదుగురు సైనికులు). ఇది తక్కువలో తక్కువ యూనిట్ అన్నమాట. దీన్ని పత్తి అంటారు. ఇటువంటి పత్తులు 21,870 అయితే ఒక అక్షౌహిణి(Akshouhini). ఇవే ఈ యుగంలో యూనిట్లు, కంపెనీలు, బెటాలియన్లుగా మారాయి. ఇంకా వివరంగా అంటే, 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది సైనికులు కలిపి ఒక అక్షౌహిణి) పంచుతారు.
అంటే ఆనాడు ఆర్జునుడి విలువిద్యాకౌశలానికి బలైంది… 1,53,090 రథాలు, 1,53,090 ఏనుగులు, 4,59,270 గుర్రాలు, 7,65,450 మంది సైనికులు. ఒకే ఒక్కడు, ఒకే ఒక్క రోజున. అదీ అర్జునుడంటే. అర్జునుడి శరపరంపరకు ఎదురుగా రెండున్నర మైళ్ళ వరకు ఒక్క ప్రాణీ మిగిలేది కాదు.
ఆనాడు భూరిశ్రవసుడు, కర్ణుడు, అశ్వత్ధాముడు, శల్యుడు, వృషసేనుడు, కృపుడు, ఇందరు మహారథులందరూ జయద్రథుడికి కాపలా ఉన్నా, ఒక్కరు కూడా అర్జునుడిని ఆపలేకపోయారు. ఒకసారి కాదు, రెండు సార్లు అర్జునుడి చేతిలో కర్ణుడు చావకుండా అశ్వత్ధామ కాపాడాడు. నిజానికి అశ్వత్ధామ కర్ణుడిని అర్జునుడి సమఉజ్జీగా ఏనాడూ చూడలేదు, ఎందుకంటే అర్జునుడి పరాక్రమం ముందు కర్ణుడు నిలువడని అశ్వత్ధామకు బాగా తెలుసు. ‘పరాక్రమంలో నీకంటే అధికుడు, ధనుర్విద్యలో శంకర సమానుడు, యుద్దమునందు వాసుదేవుని సాటి’ అని అర్జునుడితో పోటీ వద్దని ఉత్తరగోగ్రహణ సమయంలోనే అశ్వత్థామ కర్ణుడిని వారించి, కాపాడాడు (కల్కి సినిమాలో అశ్వత్థామ, కర్ణుడే గొప్పవాడని చెప్పింది తప్పు). చివరకు జయద్రథుని అర్జునుడికి వదిలేసి, అందరితో కలిపి కర్ణుడు కూడా యుద్ధభూమి నుండి పారిపోతాడు. అది అర్జునుడి అసలు పరాక్రమం.
ఇలా ఎంతైనా చెప్పొచ్చు. ఇక ఆఖరుగా కర్ణుడికి అర్జునుడుకి 17వరోజున ముఖాముఖి జరిగిన యుద్ధం చాలా ముఖ్యమైనది. ఆనాడు యుద్ధానికి వెళ్ళే ముందు, తన సారథి శల్యుడుతో కర్ణుడు నేరుగా అన్న మాటలివి. Right from the horse’s mouth అంటారే, అటువంటి వాక్యాలివి –
“ఓ శల్యా ! నేను విన్నంతలో, ఏ యోధుడు(Warrior) ఈ ప్రపంచం మొత్తం మీద అటువంటి మహారథుడు లేడని కీర్తి గడించాడో, అటువంటి అర్జునుడితో నేను ఈ రోజు యుద్ధానికి దిగుతాను. శ్వేతాశ్వరథారూఢుడై రణభూమియందు చరించే ఈ అర్జునుడి చేతిలో నాకీనాడు మృత్యువు తథ్యము. నా మరణంతో కౌరవుల మిగతా వీరులంతా నిశ్శేషముగా సమసిపోతారు. ఆ అర్జునుడి చేతులకు ఏనాడు చెమట పట్టదు, అవి ఏనాడూ వణకవు. అతని అస్త్రశస్త్రములు సుదృఢమైనవి. ఆతని చేతులు అమిత వేగముతో కదులుతాయి. అటువంటి పాండుపుత్రుడు అర్జునునకు సమయోధుడు ఎక్కడ లేడు.”
కర్ణుడు-అర్జునుడు ఇద్దరు మహాయోధులు, ఎవరి వ్యక్తిత్వాలు వారివి. దానగుణంలో కర్ణుడుని మించినవారు లేరు. కానీ కర్ణుడా? అర్జునుడా? అంటే మాత్రం అర్జునుడే అన్నిటా గొప్పవాడు. ఆ విషయాన్ని కర్ణుడు కూడా ఒప్పుకున్నాడు.
ఈ చర్చ 1977లో కూడా జరిగింది. అప్పటి కారణం కూడా ఒక సినిమానే. అది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన దాన వీర శూర కర్ణ. 1977 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలో నిజమైన విలన్లయిన కర్ణ ధుర్యోధనులే హీరోలు. సహజంగానే ఆభిజాత్యం ఎక్కువుండే ఎన్టీఆర్, తను ఏ పాత్ర పోషిస్తే, అదే హీరో అనే రీతిన కథ రాసుకుంటాడు. వాడు రావణాసురుడైనా, ధుర్యోధనుడైనా. ఆ సినిమాలో అర్జునుడిని చాలా నీచంగా చూపించాడు ఎన్టీఆర్. దానిపై తీవ్ర విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి ఆ సినిమా పూర్తిగా తప్పుల తడక. ఎన్టీఆర్ కాబట్టి, ఆ సినిమా బాగా ఆడింది. అందువలన అది నిజం కాదు కదా.
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధృవా నీతిర్మతిర్మమ.
(ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీ కృష్ణుడు మరియు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో, అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల-సమృద్ధి, మరియు ధర్మమూ ఉంటాయి. ఇది నా నిశ్చిత అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అన్న మాట ఇది)
కాబట్టి ఎప్పటికీ కర్ణుడికీ, అర్జునుడికీ పోలీకే లేదు. అర్జునుడే అన్నింటిలో కర్ణుడి కంటే గొప్పవాడు. So, Arjuna was always greater than Karna in all aspects. Arjuna was The Unrivalled Archer and Enlightened Warrior