PM Vidyalaxmi Scheme | ఉన్నత విద్యకు రూ. 10 లక్షల రుణాలు: ఈ స్కీమ్ గురించి తెలుసా?

ఉన్నత విద్య కోసం రూ.16 లక్షల వరకు రుణం.. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ తో 3% వడ్డీతో సులభ రుణం పొందే అవకాశం.

PM Vidyalaxmi Scheme | ఉన్నత విద్యకు రూ. 10 లక్షల రుణాలు: ఈ స్కీమ్ గురించి తెలుసా?

ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం విద్యాలక్ష్మి అనే స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఎలాంటి పూచీకత్తు (గ్యారంటీ) లేకుండానే బ్యాంకుల ద్వారా ఈ స్కీమ్ కింద అప్పులు తీసుకోవచ్చు. విద్యార్థులు తమ విద్యకు అవసరమైన రుణాలు పొందవచ్చు. విద్యార్థుల కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండానే ఈ రుణం తీసుకొనే ఛాన్స్ ఉంది.

పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ఉద్దేశం ఏంటి?

ఆర్ధిక సమస్యలతో ఉన్నత విద్యకు విద్యార్థులు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2024లో ఈ పథకాన్ని తెచ్చింది. 2024 నవంబర్ 6న కేంద్ర కేబినెట్ ఈ స్కీమ్ కు ఆమోదం తెలిపింది. ఉన్నత విద్య చదువుకోవాలనే వారికి రూ. 16 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. రూ. 10 లక్షల వరకు కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తారు. ఈ లోన్ తీర్చడానికి 15 ఏళ్లు సమయం ఇస్తారు. విద్యార్థులు తమ కోర్సు పూర్తి చేసిన ఏడాది వరకు వడ్డీ మినహాయింపు ఉంటుంది.

ఎవరు అర్హులు?

భారతీయుడైన ప్రతి విద్యార్థి ఈ స్కీమ్ కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఉన్నత విద్య కోర్సులో చేరే అభ్యర్థులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద మూడు శాతం వడ్డీ మాత్రమే వర్తించాలంటే ధరఖాస్తు దారుడి కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 8 లక్షల వరకు మాత్రమే ఉండాలి. అంతేకాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ వంటివి పొందకూడదు. కేంద్ర విద్యాశాఖ ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలోని టాప్ 100 విద్యా సంస్తల్లో చేరిన విద్యార్థులు ఈ స్కీమ్ కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న విద్యా సంస్థలు ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలో టాప్ 200 విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులు అర్హులు. ఈ స్కీమ్ ఇండియాలోని విద్యా సంస్థల్లో చేరినవారికి మాత్రమే వర్తిస్తోంది. మెరిట్ స్టూడెంట్ దీనికి అర్హులు. గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ లేదా ఇంటిగ్రేటేడ్ కోర్సు ఏదైనా ఒక్క కోర్సుకు మాత్రమే ఈ స్కీమ్ కింద అప్లయ్ చేసుకోవాలి. విద్యార్థి కోర్సును మధ్యలో ఆపకూడదు, ఆ విద్యా సంస్థ నుంచి క్రమశిక్షణ పేరుతో బహిష్కరణకు గురికావద్దు. సెకండ్ ఇయర్ కూడా విద్యార్ధి వడ్డీ రాయితీని పొందాలంటే మంచి మార్కులు సాధించాలి.

పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ ప్రయోజనాలు

ఈ పథకంలో విద్యార్ధినులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి విద్యా సంవత్సరం లక్ష మంది విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. విద్యార్ధి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4.5 లక్షలుంటే వంద శాతం వడ్డీ మినహాయింపు ఉంటుంది. రూ. 7.5 లక్షల రుణం తీసుకుంటే 75 శాతం క్రెడిట్ గ్యారెంటీని ప్రభుత్వం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విద్యా సంస్థల్లో చేరిన విద్యార్థులకు ఎలాంటి హామీ లేకుండానే రుణం తీసుకోవచ్చు.

ఎలా ధరఖాస్తు చేయాలి?

పీఎం విద్యాలక్ష్మి అధికారిక వెబ్ సైట్ PM-Vidyalaxmi పోర్టల్ లో వెళ్లి స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ బటన్ క్లిక్ చేయాలి. స్టూడెంట్ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి. ఇందులో విద్యార్ధి వివరాలు నమోదు చేయాలి. విద్యార్ధి నమోదు చేసిన మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేయాలి. పాస్ వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యూజర్ ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి. అప్పుడు లోన్ కోసం ధరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన సమాచారం నింపాల్సి ఉంటుంది. మీకు నచ్చిన బ్యాంకు లేదా మీకు దగ్గరలోని బ్యాంకు నుంచి ఈ లోన్ తీసుకోవచ్చు. ఈ వివరాలను ఫిల్ చేయాలి. ఈ వివరాలను సరిచేసిన తర్వాత సబ్ మిట్ క్లిక్ చేయాలి. మీ అప్లికేషన్ ఏ స్టేటస్ లో ఉందో తెలుసుకొనే వెసులుబాటు కూడా ఉంది. ట్రాక్ యువర్ అప్లికేషన్ పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేస్తే మీ అప్లికేషన్ ఏ స్టేటస్ లో ఉందో తెలుసుకోవచ్చు. లోన్ మంజూరైన తర్వాత పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ లో వడ్డీ మాఫీ కోసం ధరఖాస్తు చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఆఫ్షన్ పై క్లిక్ చేసి మీ వివరాలు నింపాలి. మీ ఆదాయ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.

కావాల్సిన డాక్యుమెంట్లు

ఆధార్ కార్డు, పాన్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికెట్, టెన్త్, ఇంటర్ మార్కుల జాబితా, ఏ విద్యా సంస్థల్లో ఆడ్మిషన్ పొందారో ఆ వివరాలు తెలిపే ఆడ్మిషన్ కార్డు, ఫీజు వివరాలు, ఆదాయ సర్టిఫికెట్ ఉండాలి. ఈ స్కీమ్ కింద లోన్ కోసం ధరఖాస్తు చేసే సమయంలో అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.