NCTE TET Mandatory For All Teachers : ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి : ఎన్‌సీటీఈ
ఎన్‌సీటీఈ (NCTE) కొత్తగా చేరేవారికే కాదు, ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులందరికీ టెట్ (TET) ఉత్తీర్ణత తప్పనిసరి అని స్పష్టం చేసింది. 5 ఏళ్ల సర్వీసు మిగిలి ఉన్నవారు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

విధాత, హైదరాబాద్ : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్(NCTE) ఉపాధ్యాయులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై ఉపాధ్యాయులందరికీ టెట్(TET) పరీక్ష ఉత్తీర్ణత కంపల్సరీ అంటూ ఆదేశాలిచ్చింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే సర్వీసుల్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల వినతిని త్రోసిపుచ్చింది. ఇకమీదట కొత్త టీచర్లకే కాదు..పాత టీచర్లు కూడా టెట్ తప్పనిసరి అంటూ తేల్చి చెప్పింది.
5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారందరూ రానున్న రెండేళ్లలో టెట్ పాస్ అవ్వాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని పాఠశాలల్లో విద్యార్హతలు గల టీచర్ల ఆవశ్యకతను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రస్తావించింది. పదవీ విరమణకు ముందు ఐదేళ్లకు పైగా సర్వీసు మిగిలి ఉన్న టీచర్లు సర్వీసులో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ పాస్ కావలసి ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశించింది. టెట్ రాయడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు లేక అర్హత సాధించలేకపోయిన ఉపాధ్యాయులు రిటైర్‌మెంట్ ప్రయోజనాలతో రాజీనామా చేయాలని లేదా కంపల్సరీ రిటైర్‌మెంట్ తీసుకోవాలని తెలిపింది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం మానవతా దృక్పథంతో పదవీ విరమణకు ముందు ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న వారు మాత్రం టెట్ లేకుండానే సర్వీసులో కొనసాగడానికి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వర్తింపజేయకూడదని ఉపాధ్యాయ సంఘాలు ఎన్సీటీఈకి కోరారు. అయితే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ కూడా సుప్రీంకోర్టు తీర్పునే అమలు చేస్తూ..ఉపాధ్యాయులందరికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఓ జాతీయ స్థాయి అర్హత పరీక్ష. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ తరగతులకు టీచర్‌గా నియామకం కావాలంటే టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. 2010లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సీటీఈ) ఈ పరీక్షను తప్పనిసరి చేసింది.