Sanjeev Sanyal on UPSC | ఉద్యోగ భద్రత కోసమే యూపీఎస్సీ.. లక్షల మంది టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటున్నారా?

విద్యాధికులైన యువతలో చాలా మంది యూపీఎస్సీ పరీక్ష పాస్‌ కావడానికి నిరవధిక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే.. ప్రస్తుత కృత్రిమ మేధ తరుణంలో యూపీఎస్సీ, పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సమయాన్ని వృఘా చేయడమేనని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్‌ సన్యాల్‌ చెబుతున్నారు.

  • By: TAAZ |    edu-career |    Published on : Dec 29, 2025 8:47 PM IST
Sanjeev Sanyal on UPSC | ఉద్యోగ భద్రత కోసమే యూపీఎస్సీ.. లక్షల మంది టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటున్నారా?
  • ఏఐ యుగంలోనూ ఇవేమీ లక్ష్యాలు
  • ఇంకా మూస పద్ధతిలో విశ్వ విద్యాలయాలు
  • పీఎం ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్

Sanjeev Sanyal on UPSC | ఉద్యోగ భద్రత కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్ష రాయాలనే లక్ష్యంతో ప్రయత్నించడం.. సమయాన్ని వృథా చేయడమేనని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దేశంలో విద్య, కెరీర్ ఆకాంక్షలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) ఆధారిత భవిష్యత్తు వాస్తవికతలకు ప్రమాదకరంగా, భిన్నంగా ఉన్నాయన్నారు. దేశంలో ఉన్నత స్థాయి పోటీ పరీక్షలు, సంప్రదాయ విశ్వవిద్యాలయాలు జారీ చేసే డిగ్రీల పట్ల చాలాకాలంగా ఉన్న వ్యామోహాన్ని ఈ వ్యాఖ్యలు సవాలు చేస్తున్నాయి. అనుసరిస్తున్న విధానాలు, మార్గాలు కాలం చెల్లిన మనస్తత్వాన్ని ప్రతిబింభిస్తాయని, సాంకేతిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేగంగా పునర్నిర్మిస్తున్న తరుణంలో నైపుణ్యాలు, అనులకూలత, ఆవిష్కరణల కన్నా హోదా, స్థిరత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నారని సంజీవ్‌ అంటున్నారు. ఏఐ, ఆటోమేషన్, నిరంతర పరిశోధన ద్వారా నిర్వచించబడిన యుగంలో 20వ శతాబ్దపు కెరీర్ మోడళ్లను అంటిపెట్టుకుని ఉండడం వల్ల 21వ శతాబ్ధపు సవాళ్లకు సరిగ్గా సిద్ధం కాని శ్రామిక శక్తిని తయారు చేసే ప్రమాదం ఉందని ఆయన వాదించారు.

ప్రతి ఏడాది లక్షల మంది అభ్యర్థులు సివిల్ సర్వీసు పదవులకు పోటీ పడుతున్నందున, యూపీఎస్సీ ప్రిపరేషన్ పై సంజీవ్ సన్యాల్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక దృష్టిని ఆకర్షించాయి. సంవత్సరాల తరబడి ఒకే పరీక్షకు సిద్ధమయ్యే ప్రయత్నల్లో విజయాలు స్వల్పంగా ఉండటం, వైఫల్యాలు (ఫెయిల్) 99 శాతానికి మించి ఉండడాన్ని ఆయన ఎత్తి చూపారు. సివిల్ సర్వెంట్లు, ప్రేరణ, ఆసక్తి ఉన్న అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదన్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో పోటీపడే ఆశావాదులు పదే పదే పరీక్షలకు ప్రయత్నించి విజయం సాధించకుండా, సంవత్సరాల పాటు తమ సమయాన్ని వృథా చేస్తున్నారన్నారు. మీరు అంత పెద్ద రిస్క్ తీసుకోబోతున్నట్లయితే, మీరు ఎందుకు బ్యూరోక్రాట్ అవుతారని ఆయన ప్రశ్నించారు. ఇంత సుదీర్ఘమైన అవకాశాలు ఉన్న ప్రక్రియ ద్వారా స్థిరత్వాన్ని అనుసరించే తర్కాన్ని ఆయన లేవనెత్తారు.

భారతదేశ సంప్రదాయ విశ్వ విద్యాలయాల నమూనాలను కూడా సంజీవ్ సన్యాల్ లక్ష్యంగా చేసుకున్నారు. ఉపన్యాస ఆధారిత తరగతి గదులు, కఠినమైన విద్యా విధానాలు.. ఆధునిక పని విధానం, వాస్తవికతలను దూరంగా ఉన్నాయని వాదించారు. విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాల కన్నా నైపుణ్యాలు ఇప్పుడు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, అయితే ఏఐ వ్యవస్థలు ఇప్పటికే తాజా జ్ఞానాన్ని అందించడంలో మరింత ప్రభావవంతంగా ఉన్నాయన్నారు. అత్యాధునిక జ్ఞానాన్ని అందించడంలో ఏఐ చాలా ఉన్నతంగా ఉంటుందని సన్యాల్ పేర్కొన్నారు. సమస్య ఒక్క విద్యా విధానంలో లేదని నొక్కి చెబుతూ, నేర్చుకోవడం, నైపుణ్యాలు ఎలా నిర్వహిస్తున్నారో చూస్తే అర్థమవుతుందన్నారు. విశ్వ విద్యాలయాలు మూస పద్ధతిలో, పురాతన విధానాల్లో పనిచేస్తూ, మారుతున్న విధానాలకు అనుగుణంగా పనిచేయడంలో అనేక ఇబ్బందులు పడుతున్నాయన్నారు.

నిర్మాణాత్మక మార్పును సమర్థిస్తూ, అప్రెంటిషిప్ లను, ప్రారంభంలోనే పని అనుభవంపై ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సన్యాల్‌ పిలుపునిచ్చారు. విద్యార్థులు దీర్ఘకాలికంగా చదువుల్లో చిక్కుకోకుండా, త్వరగా ఉద్యోగంలోకి ప్రవేశించి, ఆన్ లైన్ అభ్యాసంతో పని చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. చారిత్రకంగా పరిశీలిస్తే ఉన్నత విద్య కొన్ని వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉందని, నేటికీ సమాజంలో చాలా మంది విశ్వ విద్యాలయాలకు వెళ్లకుండానే మెరుగైన జీవితాలను గడుపుతున్నారని గుర్తు చేశారు. తన కళాశాల విద్యార్థి అనుభవం ప్రకారం చదువులో ఉత్పాదకత లేనే లేదని, సమయం చాలా వృధా అయ్యిందని, ముందుగానే పనిచేయడానికి అనుమతిస్తే బాగుండేదన్నారు. ఆధునిక విధానంలో చదువుకోవడానికి అనుమతిస్తే వాస్తవికంగా, నమ్మకంగా ఉంటుందన్నారు. యూపీఎస్సీ పరీక్షలు, విశ్వ విద్యాలయాల బోధనా విధానంపై తన వైఖరిని స్పష్టం చేస్తున్నాను తప్పితే, తన విమర్శలు విశ్య విద్యాలయాలకు వ్యతిరేకంగా చేసేవి కాదని ఆయన స్పష్టం చేశారు. అంటే విశ్వ విద్యాలయాలు ఏమి చేయడం లేదని కాదని, వాళ్ల దారిలో వారు పని చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు.

2024 లో ఆయన మొదటి సారిగా తను లేవనెత్తిన హెచ్చరికలు, ఆగస్టు 2025 లో పాడ్ కాస్ట్ లో కూడా పునరుద్ఘాటించారు. మళ్లీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో యూపీఎస్సీ పరీక్షలు అనేది జీవిత లక్ష్యాన్ని నిర్వహించే పౌరాణిక స్థితిగా సవాల్ చేశారు. గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు, తాజాగా చేసిన విమర్శలు యువతను మరింతగా కలవరపెడుతున్నాయి. దేశంలోని విద్యా వ్యవస్థ యువతను వేగంగా వృద్ధి చెందుతున్న పని ప్రపంచానికి సన్నద్ధం చేస్తుందా లేదా మరింత స్థిరంగా, సరళంగా, ఊహా లోకంలో వారిని బంధిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Read Also |

2026 Bank Holidays | 2026లో బ్యాంకుల సెల‌వుల జాబితా.. తెలంగాణ‌లో బంద్ ఎప్పుడంటే..?
China Gold Discovery : గోల్డ్ మైన్ అడ్డా చైనా..కొత్త గనులతో పసిడి రారాజు
OTT Movies | న్యూ ఇయర్‌కు ముందు సినిమాల సందడి.. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్న కొత్త సినిమాలివే!