‘రావణుడు’ నిర్మిస్తున్న రామాయణం
నితీశ్ తివారీ, నమిత్, యశ్‌ల కలయికలో వస్తున్న ఈ మహాచిత్రం ప్రేక్షకుల మనసుల్లో ముద్రించుకుపోయిన రామావతారాన్ని మరింత కన్నులపండువగా చూపిస్తుందని ఆశిద్దాం.
రామాయణం అజరామరమైన పుణ్యకావ్యం. ఎన్నిసార్లు విన్నా, చూసిన తనివితీరని తన్మయగాథ. ప్రపంచంలోని భాషలన్నింటిలోకి అనువాదమైన మహాపురాణం. ఎన్నో వందల రకాలుగా, ఎంతోమంది కవుల ఆలోచనాస్రవంతిలోనుండి వెలువడ్డ రామాయణం, సినిమాలుగా, టీవీ సీరియళ్లుగా చాలాసార్లు ప్రేక్షకులను త్రేతాయుగపు ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ మధ్యనే ఓ బృందం ‘ఆదిపురుష్’గా తీసి అపప్రథను మూటగట్టుకున్నారు. ఇప్పడు మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ (Nitesh Tiwari) ఈసారి రామాయణాన్ని తన దర్శకత్వంలో తీయడానికి పూనుకున్నాడు. ఈ దిగ్దర్శకుడు దంగల్ లాంటి అంతర్జాతీయ హిట్ సినిమాకు దర్శకత్వం వహించాడు. చిచోరే లాంటి కమర్షియల్ హిట్ సాధించాడు. ఇప్పుడు రామాయణం లాంటి ఎపిక్ సాగాను చేపట్టే కోరికను వెలిబుచ్చాడు. దీనికి నిర్మాతలుగా తెలుగు నిర్మాత అల్లు అరవింద్, తెలుగువాడైన హిందీ నిర్మాత మధు మంతెన ముందుకువచ్చారు. మూడు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు. భారీ బడ్డెట్‌తో కనీవినీ ఎరుగని రీతిలో, నభూతో నభవిష్యతి అన్న చందంగా ఉండాలని తీర్మానించుకున్నారు.

తదుపరి ముఖ్య కార్యాచరణ, నటీనటుల ఎంపిక. రణబీర్ కపూర్(Ranbir Kapoor) రాముడిగా బాగుంటాడని అనుకున్నారు. అందరూ ముక్తకంఠంతో ఓకే అన్నారు. ఇక సీత. సీతగా చాలామంది హీరోయిన్లను పరిశీలించారు. ఆలియాభట్, కీర్తిసురేశ్, దీపికా పడుకునే, జాన్వీకపూర్ లాంటి అమ్మాయిలు ఇందులో ఉన్నారు. ఊహించని విధంగా దక్షణాది హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) పేరును ఎవరో సూచించారు. దాంతో సాయిపల్లవిని టెస్ట్ చేసిన చిత్రబృందం తననే జానకిగా కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రావణాసురుడిగా కేజీఎఫ్ స్టార్ యశ్(Yash)ను ఎంపిక చేసారని బలంగా వినిపించింది.
ఇంతలో ఓ పిడుగు పడింది. నిర్మాతలుగా అల్లు అరవింద్, మధు మంతెన తప్పుకున్నారు. దాంతో ప్రాజెక్ట్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో నిర్మాతగా వ్యవహరించేందుకు నమిత్ మల్‌హోత్రా (Namit Malhotra)ముందుకువచ్చాడు. దాంతో ఆగిందనుకున్న రామాయణం మళ్లీ పట్టాలెక్కింది. నటీనటులను దాదాపుగా ఫైనల్ చేసారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మిగతా పాత్రలకు నటీనటుల ఎంపిక ఈ విధంగా ఉంది.
దశరథుడుగా అరుణ్ గోవిల్( టీవీ రామాయణంలో రాముడు), లక్ష్మణుడిగా తెలుగు హీరో నవీన్ పొలిశెట్టి లేదా రవిదూబే, హనుమంతుడిగా సన్నీ దేవల్, కుంభకర్ణుడిగా బాబీదేవల్, విభీషణుడిగా తమిళ హీరో విజయ్ సేతుపతి, కైకేయిగా లారాదత్తా, శూర్పణఖగా రకుల్‌ప్రీత్‌సింగ్, కౌసల్యగా ఇందిరాకృష్ణన్ నటించనున్నట్లు తెలిసింది. నిజానికి చిత్రబృందం నటీనటుల గురించి ఇంకా ప్రకటించలేదు. (Arun Govil, Ravi Dube, Sunny Deol, Bobby Deol, Vijay Setupathi, Lara Dutta, Rakulpreet Singh, Indira Krishnan)

ఇంతలో ఇంకో పెను సంచలనం నమోదయింది. ఇంకో నిర్మాతగా వ్యవహరించేందుకు కేజీఎఫ్ సూపర్‌స్టార్ యశ్(Yash coproducing Ramayana) తన సమ్మతి తెలిపాడు. దీంతో ఒక్కసారిగా సినిమాకు ఊపు వచ్చింది. ఈ విషయం అధికారికంగా ధృవీకరించిన యశ్, వెరైటీ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ, తన నిర్మాణసంస్థ మాన్‌స్టర్ మైండ్స్ రామాయణానికి సహనిర్మాతగా వ్యవహరించనున్నదని తెలిపాడు. భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలనేది నా కల. ఈ పనిమీదే తాను లాస్ఏంజిలస్‌లో ఒక ప్రముఖ విఎఫ్ఎక్స్ స్టూడియోతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాను. ఆశ్యర్యకరంగా ఆ స్టుడియో అధినేత కూడా భారతీయుడే. నమిత్‌తో కలిసి చాలా ఆలోచనలు పంచుకున్నాను. ఆయన అప్పటికే రామాయణం చిత్ర నిర్మాణంలో భాగమయ్యాడు. అప్పుడే మా ఆలోచనల్లోకి రామాయణం వచ్చింది. నా దృష్టిలో రామాయణానికి ఒక పవిత్రత ఉంది. నా మనసులో దానికి ఓ ప్రత్యేక స్థానముంది. రామాయణ నిర్మాణంలో భాగం కావడం ద్వారా ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రేక్షకుల ఉత్సాహాన్ని, అభిరుచిని మరింత రేకెత్తించేందుకు ఈ భారతీయ సినిమా ఉపకరిస్తుందని మేమిరువురం భావించాం అని యశ్ అన్నాడు.
రామాయణం మన జీవితాలతో అల్లుకుపోయిన ఇతిహాసం. ఎన్ని రకాలుగా చెప్పినా, చూసినా, ప్రతీసారి అది గొప్ప విజ్ఞానాన్ని అందిస్తూనేఉంటుంది. కొత్త ఆలోచనలను రేకెత్తిస్తూనేఉంటుంది. దాన్ని ఓ గొప్ప స్థాయిలో ఆవిష్కరించాలని అనుకుంటున్నాము. రామాయణం గొప్పతనాన్ని గౌరవిస్తూనే , దాంట్లోని భావోద్వేగాలు, నిజాయితీ, నమ్మకాలు, విలువలను కాపాడుకుంటూ ఈ చిత్రాన్ని తీయాలని సంకల్పించాం. ప్రపంచంతో మరోసారి రామాయణాన్ని పంచుకోవాడానికి మేము ప్రయాణమవుతున్నాం. సృజనాత్మకత, నిబద్ధత, నిజాయితీ, దార్శనికతతో ఈ ప్రస్థానం సాగుతుందని యశ్ స్పష్టం చేసాడు.
నితీశ్ తివారీ, నమిత్, యశ్‌ల కలయికలో వస్తున్న ఈ మహాచిత్రం ప్రేక్షకుల మనసుల్లో ముద్రించుకుపోయిన రామావతారాన్ని మరింత కన్నులపండువగా చూపిస్తుందని ఆశిద్దాం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram