Anudeep | సెలబ్రిటీలపై వ్యాఖ్యలతో వివాదంలో అనుదీప్ కటికాల.. క్షమాపణలతోనూ చల్లారని అభిమానుల ఆగ్రహం

Anudeep | వినోదం కోసం చేసే కామెడీకి కూడా హద్దులు అవసరమనే విషయాన్ని మరోసారి గుర్తు చేసిన ఘటనగా స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల వివాదం నిలిచింది. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

  • By: Sandeep |    movies |    Published on : Apr 13, 2026 7:53 AM IST
Anudeep | సెలబ్రిటీలపై వ్యాఖ్యలతో వివాదంలో అనుదీప్ కటికాల.. క్షమాపణలతోనూ చల్లారని అభిమానుల ఆగ్రహం

Anudeep | వినోదం కోసం చేసే కామెడీకి కూడా హద్దులు అవసరమనే విషయాన్ని మరోసారి గుర్తు చేసిన ఘటనగా స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల వివాదం నిలిచింది. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇటీవల జరిగిన ఒక స్టాండప్ కామెడీ షోలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నిహారిక కొణిదెల పేర్లను ఉపయోగిస్తూ అనుదీప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియో బయటకు రావడంతో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోపంలో ఫ్యాన్స్..

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌తో మాత్రమే ఆగకుండా, అభిమానులు అనుదీప్ ప్రదర్శనలు జరిగే ప్రదేశాలకు చేరుకుని నిరసనలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో అభిమానుల కోపాన్ని అర్థం చేసుకున్న అనుదీప్ రెండు రోజుల పాటు బయటకు రాకుండా ఉండిపోయినట్లు సమాచారం.

తాజాగా ఆయన ఒక వీడియో విడుదల చేసి తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, తన మాటల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరారు. అయితే ఈ క్షమాపణలతో వివాదం పూర్తిగా చల్లారలేదు.

అనుదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరంగా ఉన్నాయని భావిస్తున్న మెగా అభిమానులు, “ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ‘దురుద్దేశం లేదు’ అనడం సరైంది కాదు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలి” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

వ్య‌క్తిగ‌త జీవితాల‌ని కించ‌ప‌ర‌చొద్దు..

ఈ ఘటనతో మరోసారి స్టాండప్ కామెడీ పరిమితులపై చర్చ మొదలైంది. టీవీ స్కిట్లు కావొచ్చు, స్టేజ్ షోలు కావొచ్చు నవ్వించే ప్రయత్నంలో వ్యక్తిగత జీవితాలను కించపరచడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ కల్చర్ బలంగా ఉండటంతో, సినిమా హీరోలు మరియు రాజకీయ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో స్టాండప్ కామెడీకి ఉన్న స్వేచ్ఛ ఇక్కడ ఉండకపోవడం కూడా ఇలాంటి వివాదాలకు కారణమవుతోంది. గుర్తింపు కోసం హద్దులు దాటే ప్రయత్నాలు కేవలం విమర్శలకే కాకుండా భద్రతా సమస్యలకూ దారితీస్తాయని, ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైంది.