Divyanka Siroh | భారతీయ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. వర్థమాన తారగా ఎదుగుతున్న దివ్యాంక సిరోహి 30 ఏళ్ల వయసులోనే కన్నుమూయడంతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇటీవలే మంచి గుర్తింపు సంపాదిస్తూ ముందుకు సాగుతున్న ఆమె అకస్మిక మరణం అందరినీ కలచివేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్‌కి చెందిన దివ్యాంక, తన కుటుంబంతో కలిసి ఘజియాబాద్లో నివసిస్తున్నారు. చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం సిక్కిం యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు. కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు అమ్మమ్మ, సోదరుడు హిమాంశు, సోదరీమణులు దీపాంశు, జస్మీత్ ఉన్నారు.
50కి పైగా మ్యూజిక్ వీడియోలలో..
దివ్యాంక తన నటనా ప్రస్థానాన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌తో ప్రారంభించారు. ముఖ్యంగా హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ భాషల్లో తెరకెక్కిన పాటల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మాసూమ్ శర్మ, కేడీ, అమిత్ సైనీ వంటి ప్రముఖులతో కలిసి పలు హిట్ పాటల్లో కనిపించారు. దాదాపు 50కు పైగా మ్యూజిక్ వీడియోల్లో నటించిన ఆమె, తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు.
హర్యానా ప్రాంతీయ సంగీత రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన దివ్యాంక, సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌లో పెద్ద స్థాయిలో నటిగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.
అంత్యక్రియలకి వేలాది మంది..
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 21 మంగళవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించే సరికి ఆమె ఇప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ వార్తతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
దివ్యాంక మృతితో స్థానిక కళాకారులు, అభిమానులు తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ఘజియాబాద్లో ఆమె అంతిమ యాత్ర నిర్వహించగా, వేలాది మంది అభిమానులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు.
యువ ప్రతిభావంతురాలు ఇలా అర్థాంతరంగా మృతి చెందడం సినీ రంగానికి తీరని లోటుగా మిగిలింది. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సినీ ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
