MSG | మన శంకరవరప్రసాద్ గారు హంగామా మధ్య విషాదం.. సినిమా చూస్తూ మెగా అభిమాని మృతి

MSG | సంక్రాంతి 2026 కానుకగా విడుదలైన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు అన్ని చోట్ల భారీ స్పందన వస్తున్న వేళ ఓ విషాద ఘటన చోటుచేసుకుంది.

  • By: sn |    movies |    Published on : Jan 12, 2026 5:14 PM IST
MSG | మన శంకరవరప్రసాద్ గారు హంగామా మధ్య విషాదం.. సినిమా చూస్తూ మెగా అభిమాని మృతి

MSG | సంక్రాంతి 2026 కానుకగా విడుదలైన మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు అన్ని చోట్ల భారీ స్పందన వస్తున్న వేళ ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా బాగుందని పబ్లిక్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద సందడి నెలకొంది. ఈ హడావుడి మధ్య హైదరాబాద్‌లో ఒక మెగా అభిమాని సినిమా చూస్తూ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది.

హైదరాబాద్ కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో సోమవారం ఉదయం 11.30 గంటల షో చూస్తున్న సమయంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన సీటులోనే కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన ప్రేక్షకులు అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని 12వ బెటాలియన్‌కు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆనంద్ కుమార్‌గా గుర్తించారు. ప్రాథమికంగా గుండెపోటే మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు థియేటర్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, వైద్య నివేదిక అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణం వెల్లడవుతుందని తెలిపారు. ఈ ఘటనతో థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.ఇదిలా ఉండగా, అదే సినిమాకు సంబంధించి హైదరాబాద్ లంగర్ హౌస్ ప్రాంతంలోని అలంకార్ థియేటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సోమవారం ఉదయం 7.30 గంటల షోను యాజమాన్యం అకస్మాత్తుగా రద్దు చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్‌మైషో యాప్ ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నామని, థియేటర్‌కు వచ్చాకే షో రద్దు విషయం తెలిసిందని ప్రేక్షకులు ఆరోపించారు.

ముందస్తుగా క్యాన్సిలేషన్ మెసేజ్ లేదా అలర్ట్ ఇవ్వకపోవడంపై యాజమాన్యంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఉదయం 11 గంటల షోకు టికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇస్తామని థియేటర్ యాజమాన్యం హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఒకవైపు సినిమా సక్సెస్ సెలబ్రేషన్లు కొనసాగుతున్నా, మరోవైపు చోటుచేసుకున్న ఈ ఘటనలు అభిమానుల్లో కలవరం రేపుతున్నాయి.