OG Movies | ఆధునిక వైద్య రంగంలో సాంకేతికత రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో వైద్యులు అనుసరిస్తున్న వినూత్న పద్ధతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో వైద్యులు ఓ మహిళకు స్పృహలో ఉంచి బ్రెయిన్ సర్జరీ నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్రచికిత్సలో ప్రత్యేకత ఏమిటంటే.. ఆపరేషన్ జరుగుతున్న సమయంలో రోగికి ఆమె అభిమాన నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ సినిమా చూపిస్తూ సర్జరీ నిర్వహించడం.
ప్రకాశం జిల్లా దర్శికి చెందిన గనిపిశెట్టి కోటేశ్వరమ్మ తన భర్తతో కలిసి గుంటూరు జిల్లా పొన్నూరులో కిచిడీ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇటీవల ఒక్కసారిగా మూర్ఛపోయి కిందపడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రికి తరలించారు.
అవేక్ బ్రెయిన్ సర్జరీ విధానం…
అక్కడ న్యూరో సర్జన్ డాక్టర్ పద్మనాభుని అరుణ్‌కుమార్ పర్యవేక్షణలో ఎంఆర్‌ఐ స్కాన్‌తో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం కోటేశ్వరమ్మ మెదడులో కీలకమైన నాడీ వ్యవస్థకు సమీపంలో ట్యూమర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ గడ్డ శరీర కదలికలు, నాడీ స్పందనలను నియంత్రించే సున్నితమైన ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో సాధారణ శస్త్రచికిత్స కంటే ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని వైద్యులు నిర్ణయించారు.
సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లలో మత్తుమందు ఇచ్చి శస్త్రచికిత్స నిర్వహిస్తారు. అయితే ఈ కేసులో పూర్తిగా మత్తుమందు ఇవ్వడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో వైద్యులు ‘అవేక్ బ్రెయిన్ సర్జరీ’ విధానాన్ని ఎంచుకున్నారు. అంటే రోగి పూర్తిగా స్పృహలో ఉండగానే శస్త్రచికిత్స నిర్వహించడం.
ఓజీ సినిమా చూస్తూ..
ఆపరేషన్ సమయంలో రోగి ఆందోళన చెందకుండా ఉండేందుకు ఆమెకు ఇష్టమైన సినిమా చూపించాలని వైద్యులు నిర్ణయించారు. కోటేశ్వరమ్మ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ అని తెలుసుకున్న వైద్యులు, ఆయన నటిస్తున్న ‘ఓజీ’ చిత్రానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించారు.
సినిమా చూస్తూనే కోటేశ్వరమ్మ వైద్యులతో మాట్లాడారు. డాక్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, చేతులు, కాళ్లు కదిలిస్తూ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందో లేదో వైద్యులకు సహకరించారు. ఇదే సమయంలో డాక్టర్ల బృందం అత్యంత జాగ్రత్తగా ట్యూమర్‌ను తొలగించింది.
డాక్టర్ పద్మనాభుని అరుణ్‌కుమార్ నేతృత్వంలోని న్యూరో సర్జరీ బృందం, అనస్థీషియా నిపుణుల సహకారంతో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం కోటేశ్వరమ్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు.
సినిమా చూస్తూ స్పృహలోనే జరిగిన ఈ బ్రెయిన్ సర్జరీ ఇప్పుడు వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆధునిక వైద్య సాంకేతికత, మరోవైపు రోగి మానసిక ప్రశాంతతను కాపాడే వినూత్న విధానం కలిసి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేశాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
