Chandrababu : తెలుగు జాతి ఐక్యత సాధనం తెలుగు భాష

తెలుగు జాతి ఐక్యతకు తెలుగు భాషే ప్రధాన సాధనమని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Chandrababu : తెలుగు జాతి ఐక్యత సాధనం తెలుగు భాష

అమరావతి : తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలున్నా… తెలుగే మాతృభాష అని తెలుగు జాతి ఐక్యతకు సాధనమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలంటే… మనం ఐకమత్యంగా ఉండాలన్నారు.
గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో చంద్రబాబు హాజరై మాట్లాడారు. తెలుగు భాషకు ఘనమైన చరిత్ర ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

మన దేశంలో వందలాది భాషాలు ఉన్నప్పటికి కేవలం 6 భాషలకే ప్రాచీన హోదా లభించిందని..అందులో తెలుగు ఒకటని గుర్తు చేశారు. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు అని.. ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారని తెలిపారు. మాతృభాషలో రాణిస్తే.. ఏ రంగంలోనైనా రాణిస్తామన్నారు. మాతృభాష మన మూలాలకు సంకేతమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంగ్లం అవసరమే కానీ.. మాతృభాషను మరిచిపోతే మనల్ని మనమే కోల్పోయినట్లు అవుతుందని చెప్పారు.

ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాష పరిరక్షణకు ఉపయోగపడతాయని..సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండుగ ఇది అని మహాసభల నిర్వహణను చంద్రబాబు అభినందించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌ పేరును ఈ వేదికకు పెట్టడం సంతోషదాయకం అన్నారు. ఈ మహాసభలకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు అని. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గిడుగు వెంకట రామ్మూర్తిని తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదు అని, అలాగ నేను తెలుగువాణ్ణి.. నాది తెలుగుదేశం అని చాటిచెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు.

పొట్టి శ్రీరాములు పేరుతో 1985లోనే తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్‌ తీసుకొచ్చారు అని..రాష్ట్ర విభజన తర్వాత రాజమహేంద్రవరంలో తెలుగు వర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీతో భాషను సులువుగా కాపాడుకోవచ్చు అని, కొత్త యాప్‌లు వచ్చాయి అని, తెలుగులో మాట్లాడితే అదే భాషలో సమాధానమిస్తాయని చంద్రబాబు తెలిపారు. తెలుగు టైప్‌ చేయడానికి తెలియనివాళ్లు కూడా టెక్నాలజీ ఉపయోగించుకునే తెలుగు భాషను వినియోగించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

OTT Movies | కొత్త ఏడాది తొలి వారమే బ్లాక్‌బస్టర్ హడావిడి… థియేటర్లు, ఓటీటీల్లో కంటెంట్ వరద
Pandugappa Fish : గోదావరిలో చిక్కిన పండుగప్ప చేప..భారీ ధరకు విక్రయం