Hrithik Roshan | సబా ఆజాద్‌కు ప్రమాదకర ఇన్ఫెక్షన్ … నడవలేని స్థితిలో హృతిక్ గర్ల్‌ఫ్రెండ్

Hrithik Roshan |  బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రియురాలు, నటి-గాయని సబా ఆజాద్ తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్న విషయం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సబా, తన పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ అభిమానులను ఆందోళనకు గురిచేశారు.

  • By: Sandeep |    movies |    Published on : Mar 29, 2026 8:45 AM IST
Hrithik Roshan | సబా ఆజాద్‌కు ప్రమాదకర ఇన్ఫెక్షన్ … నడవలేని స్థితిలో హృతిక్ గర్ల్‌ఫ్రెండ్

Hrithik Roshan |  బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రియురాలు, నటి-గాయని సబా ఆజాద్ తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పోరాడుతున్న విషయం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గత రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సబా, తన పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ అభిమానులను ఆందోళనకు గురిచేశారు.

సాధారణ ఇన్ఫెక్షన్‌గా కనిపించిన సమస్య, క్రమంగా తీవ్రరూపం దాల్చి ఆమెను నడవలేని స్థితికి తీసుకెళ్లింది. వైద్యులు ఆమెకు ‘సైక్లోస్పోరా కయెటానెన్సిస్’ అనే ప్రమాదకర పరాన్నజీవి ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే వ్యాధిని ‘సైక్లోస్పోరియాసిస్’ అని పిలుస్తారు. ఇది శరీరంలోని జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించి, శక్తిని పూర్తిగా తగ్గిస్తుంది.

అవి అత్యం క‌ఠిన‌మైన రోజులు..

గత 14 రోజులు తన జీవితంలోనే అత్యంత కఠినమైన రోజులని సబా భావోద్వేగంగా పేర్కొన్నారు. రోజుకు రెండు సార్లు జిమ్‌లో కఠినమైన వ్యాయామాలు చేసే తాను, ఇప్పుడు కనీసం ఒక టూత్‌పిక్ ఎత్తేంత బలం కూడా లేని స్థితికి చేరుకున్నానని తెలిపారు. ఈ కాలంలోనే సుమారు నాలుగు కిలోల బరువు తగ్గిపోయానని చెప్పడం ద్వారా ఆమె పరిస్థితి తీవ్రత స్పష్టమవుతోంది.

ఇంత జాగ్రత్తగా జీవించే తనకు ఈ ఇన్ఫెక్షన్ రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని సబా వెల్లడించారు. తాను ఎప్పుడూ ఇంటి ఆహారమే తీసుకుంటానని, బయటకు వెళ్లినప్పుడు కూడా సొంత వాటర్ బాటిల్ ఉపయోగిస్తానని చెప్పారు. అయినప్పటికీ ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల‌కు హెచ్చ‌రిక‌లు..

ఈ సందర్భంగా ప్రజలకు ముఖ్యమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆకుకూరలు, కూరగాయలు, ముఖ్యంగా పచ్చిగా తినే ఆహార పదార్థాలను బాగా శుభ్రం చేయకపోతే ఇలాంటి ప్రమాదకర ఇన్ఫెక్షన్లు సోకే అవకాశముందని తెలిపారు. కేవలం నీటితో కడగడం సరిపోదని, బేకింగ్ సోడా లేదా ప్రత్యేక వెజిటబుల్ వాష్ ఉపయోగించాలని సూచించారు.

ఈ కష్ట సమయంలో హృతిక్ రోషన్ తనకు అండగా నిలుస్తున్నారని సబా ఎమోషనల్‌గా వెల్లడించారు. ఆసుపత్రిలో ఉన్న తన ఫోటోను కూడా హృతిక్ తీసినదేనని, తనను నవ్విస్తూ మానసికంగా బలంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

ప్రస్తుతం సబా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సంఘటన మరోసారి ఆహార పరిశుభ్రత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు.