Piracy | ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుతో ఇండస్ట్రీకి ఊరట .. కానీ పైరసీ ముంగిట మళ్లీ కొత్త సవాళ్లు

Piracy | చావుకు భయపడని వాడైన చ‌ట్టం నుండి తప్పించుకోలేడని మరోసారి నిరూపితమైంది. మూడు నెలల క్రితం పోలీసులకు బహిరంగంగా సవాల్ విసిరిన ‘ఐబొమ్మ’ అడ్మిన్ ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్, చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకి చిక్కి జైలు పాలయ్యాడు.

  • By: sn |    movies |    Published on : Nov 20, 2025 9:35 AM IST
Piracy | ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్టుతో ఇండస్ట్రీకి ఊరట .. కానీ పైరసీ ముంగిట మళ్లీ కొత్త సవాళ్లు

Piracy | చావుకు భయపడని వాడైన చ‌ట్టం నుండి తప్పించుకోలేడని మరోసారి నిరూపితమైంది. మూడు నెలల క్రితం పోలీసులకు బహిరంగంగా సవాల్ విసిరిన ‘ఐబొమ్మ’ అడ్మిన్ ఇమ్మడి రవి అలియాస్ ప్రహ్లాద్ కుమార్, చివరకు సైబర్ క్రైమ్ పోలీసులకి చిక్కి జైలు పాలయ్యాడు. సంవత్సరాలుగా తన అసలు గుర్తింపును దాచిపెట్టి పైరసీ ప్రపంచంలో హంగామా చేసిన రవిని హైద‌రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, ఐబొమ్మతో పాటు బప్పం టీవీ మరియు దాని అనుబంధంగా ఉన్న 65 వరకు పైరసీ వెబ్‌సైట్లు బ్లాక్ చేసినట్లు సమాచారం.

ఐబొమ్మ శాశ్వతంగా మూసివేత – వెబ్‌సైట్ క్షమాపణలు

రవిని అరెస్టు చేసిన వెంటనే ఐబొమ్మ ఇండియాలో తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. “భారత చట్టాలను గౌరవిస్తూ మా కార్యకలాపాలను నిలిపివేస్తున్నాం. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం” అంటూ సైట్‌లో సందేశం ఇచ్చారు. దీనితో దర్శక–నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకున్నారు.

కానీ… పైరసీకి అంతం ఎక్కడ?

ఐబొమ్మ లాంటి పెద్ద వెబ్‌సైట్లు బ్లాక్ చేసినా, పైరసీ పూర్తిగా ఆగిపోయింది అనటం తప్పే. ఇంటర్నెట్‌లో మూవీ రూల్స్, మూవీస్‌డా, హెచ్‌డీ మూవీస్, మూవీస్‌వుడ్ వంటి అనేక పైరసీ సైట్లు కొత్త సినిమాలన్నీ త్వరితగతిన అప్లోడ్ చేస్తున్నాయి. థియేటర్లలో రికార్డ్ చేసిన కెమెరా ప్రింట్లు కాకుండా, నేరుగా హెచ్‌డీ క్వాలిటీ ఫుటేజీని అప్లోడ్ చేస్తుండటం సినీ పరిశ్రమకు భారీ దెబ్బ అవుతోంది.

వందల కోట్ల నష్టం

ఓటీటీ సంస్కృతి పెరిగిన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమవుతుంటే, పైరసీ సైట్లు ఉచితంగా సినిమాలను అందిస్తుండటంతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. కొత్త సినిమా విడుద‌లైన కొద్ది గంటలకే నెట్‌లో అందుబాటులో ఉండటం వల్ల బాక్సాఫీస్ కలెక్షన్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

ఐపీ అడ్రెసులు మార్చి కొత్త రూపంలోకి పైరసీ సైట్లు

ప్రస్తుతం ఐబొమ్మ, బప్పం టీవీ వంటి ప్రధాన సైట్లను బ్యాన్ చేసినా, పైరసీ నెట్‌వర్క్ ఐపీ అడ్రెసులు మార్చి, పేర్లు మార్చుకుని వెంటనే కొత్త సైట్లుగా మారిపోతోంది. ఈ పరిస్థితుల్లో మొత్తం నెట్‌వర్క్‌ను పూర్తిగా అరికట్టడం సవాలుగా మారింది. సినీ ఇండస్ట్రీ మాత్రం సైబర్ క్రైమ్ విభాగం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది.

టికెట్ రేట్లే కారణం?

మరోవైపు, థియేటర్లలో అధిక టికెట్ రేట్లే పైరసీకి కారణమవుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అందుబాటులో ధరలుంటే ప్రేక్షకులు పైరసీ సైట్లకు వెళ్లరనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ సమస్యపై ఫిలిం మేకర్స్ ఆలోచించాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.