Kiara Advani | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మాతృత్వం తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2025లో జరిగిన మెట్ గాలా 2025లో బేబీ బంప్‌తో మెరిసినప్పటి నుంచి ఆమె మాతృత్వ ప్రయాణం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోంది. అదే సంవత్సరం జూలైలో తన కూతురు ‘సారాయా’కు జన్మనిచ్చిన కియారా, ఇప్పుడు తల్లిగా కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో కియారా మాట్లాడుతూ, మాతృత్వం నన్ను పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు నేను నన్ను ‘ఆడపులి’ (టైగ్రెస్)గా భావిస్తున్నాను. నా బిడ్డను రక్షించాలనే భావన నాకు కొత్త శక్తిని ఇచ్చింది అని తెలిపారు. తల్లితనంతో తనలో ఉన్న ఆత్మవిశ్వాసం, భావోద్వేగాలు మరింత బలంగా మారాయని చెప్పారు.
ఈ సందర్భంలో గతంలో ఆలియా భట్, ప్రియాంక చోప్రా వంటి నటీమణులు కూడా మాతృత్వం గురించి ఇలాంటి భావోద్వేగాలనే పంచుకున్న విషయాన్ని అభిమానులు గుర్తుచేస్తున్నారు. తల్లి అయిన తర్వాత జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయిందని కియారా వెల్లడించారు. ఇప్పుడు జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూస్తున్నాను. కొన్ని విషయాలు అసలు ముఖ్యం కాకపోయినా, మరికొన్ని చిన్న విషయాలు చాలా ముఖ్యంగా అనిపిస్తున్నాయి” అని పేర్కొన్నారు. బాధ్యతలు పెరిగినా, తనలో మరింత పరిపక్వత వచ్చిందని తెలిపారు.
భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో తన బంధం గురించి కూడా కియారా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పెళ్లి తర్వాత మాకంటూ ఒక చిన్న ప్రపంచం ఏర్పడింది. పెళ్లికి ముందు ఎలా సరదాగా ఉండేవాళ్లమో ఇప్పటికీ అలాగే ఉన్నాం. కలిసి సినిమాలు చూడటం, వాటిపై చర్చించడం ఇప్పటికీ కొనసాగుతోంది అని చెప్పారు. దంపతుల మధ్య మార్పులు సహజమే అయినా, తమ మధ్య ఉన్న ఆత్మీయత మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఆమె స్పష్టం చేశారు. మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ కూడా కియారా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె నటిస్తున్న టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే వార్ 2 వంటి భారీ ప్రాజెక్ట్‌లో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు.
కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే మాతృత్వాన్ని స్వీకరించి, కుటుంబం-వృత్తిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్న కియారా అద్వానీ నేటి తరం మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కుమార్తె సారాయాతో గడిపే ప్రతి క్షణాన్ని మధుర జ్ఞాపకంగా మార్చుకుంటూ ఆమె కొత్త జీవితాన్ని ఆనందంగా కొనసాగిస్తున్నారు.
