Lagnajita Chakraborty | లైవ్ షోలో బెంగాలీ గాయనిపై దాడి ప్రయత్నం.. ‘భక్తి పాటలు ఆపి సెక్యులర్ సాంగ్స్ పాడు’ అంటూ హుకుం

Lagnajita Chakraborty | పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ప్రముఖ బెంగాలీ గాయని లగ్నజిత చక్రవర్తికి ఊహించని అనుభవం ఎదురైంది. లైవ్ కన్సర్ట్‌లో పాట పాడుతుండగా ఓ వ్యక్తి ఆమెపై దాడికి ప్రయత్నించడమే కాకుండా, భక్తి పాటలు ఆపి సెక్యులర్ (మతాతీత) పాటలు పాడాలని డిమాండ్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.

  • By: sn |    movies |    Published on : Dec 23, 2025 11:22 AM IST
Lagnajita Chakraborty | లైవ్ షోలో బెంగాలీ గాయనిపై దాడి ప్రయత్నం.. ‘భక్తి పాటలు ఆపి సెక్యులర్ సాంగ్స్ పాడు’ అంటూ హుకుం

Lagnajita Chakraborty | పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ప్రముఖ బెంగాలీ గాయని లగ్నజిత చక్రవర్తికి ఊహించని అనుభవం ఎదురైంది. లైవ్ కన్సర్ట్‌లో పాట పాడుతుండగా ఓ వ్యక్తి ఆమెపై దాడికి ప్రయత్నించడమే కాకుండా, భక్తి పాటలు ఆపి సెక్యులర్ (మతాతీత) పాటలు పాడాలని డిమాండ్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. భగవాన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం లగ్నజిత మ్యూజికల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. షో ప్రారంభమైన 45 నిమిషాల వరకు కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. ఈ క్రమంలో ఆమె త్వరలో విడుదల కానున్న ‘దేవీ చౌధురాని’ సినిమాలోని ‘జాగో మా’ పాటను ఆలపించారు.

పాట ముగిసిన వెంటనే ఓ వ్యక్తి ఒక్కసారిగా స్టేజ్‌పైకి దూసుకొచ్చాడు. అక్కడున్నవారు అతడిని అడ్డుకోగా, అతడు గట్టిగా అరుస్తూ “నీ ‘జాగో మా’ పాటలు చాలు.. ఏదైనా సెక్యులర్ సాంగ్ పాడు” అంటూ హుకుం జారీ చేసినట్లు లగ్నజిత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వేదిక వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

‘జాగో మా’ దేవుడి గురించి కాదు!

ఈ వివాదంపై పాట రచయిత రితమ్ సేన్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ‘జాగో మా’ పాట ఏ దేవతను ఉద్దేశించినది కాదని, అది కేవలం మాతృత్వం, మహిళా శక్తిని ప్రతిబింబించే గీతం అని స్పష్టం చేశారు. బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ రచించిన ప్రసిద్ధ నవల ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రానికి ఈ పాటను రాశామని తెలిపారు. ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాల్లోనూ వేడి రాజుకుంది. నిందితుడు టీఎంసీ కార్యకర్త అని బీజేపీ ఆరోపించగా, ప్రభుత్వం మాత్రం అలాంటి ఆరోపణలను ఖండించింది.

ఘటన అనంతరం లగ్నజిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, మొదట ఫిర్యాదు స్వీకరించేందుకు స్థానిక అధికారి నిరాకరించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల జోక్యంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు భగవాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి షాహెన్షా హక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై స్పందించిన లగ్నజిత, “నేను కళాకారిణిని. తదుపరి షోలో కూడా ‘జాగో మా’ పాటే పాడుతాను. పోలీసులు నాకు పూర్తి రక్షణ కల్పిస్తారనే నమ్మకం ఉంది” అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ సంఘటన కళాకారుల స్వేచ్ఛ, భద్రతపై కొత్త చర్చను తెరపైకి తెచ్చింది.