Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా.. జూన్ 3 నుంచే ప్రత్యేక ప్రీమియర్లు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సినిమా విడుదలకు ముందే పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు ‘పెద్ది’ చిత్రబృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. చిత్ర కాపీరైట్ హక్కులను రక్షించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు వెకేషన్ బెంచ్.. చిత్రానికి అనుకూలంగా యాంటీ-పైరసీ ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.
కఠిన చర్యలు..
ఈ ఉత్తర్వుల ప్రకారం ‘పెద్ది’ సినిమాను అక్రమంగా కాపీ చేయడం, ఇంటర్నెట్‌లో లీక్ చేయడం, పైరసీ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం వంటి చర్యలను పూర్తిగా నిషేధించింది. సినిమాకు సంబంధించిన వీడియోలు, సన్నివేశాలు, పూర్తి ప్రింట్లు లేదా ఇతర డిజిటల్ కంటెంట్‌ను అనధికారికంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమకు పైరసీ పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత భారీ సినిమా అయినా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ సైట్లలో దర్శనమిస్తోంది. దీంతో నిర్మాతలకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది.
ఇంజక్షన్ ఆర్డర్స్ జారీ..
ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్త చర్యగా ‘పెద్ది’ నిర్మాతలు కోర్టును ఆశ్రయించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. న్యాయస్థానం కూడా సినిమా అక్రమ లీకులు నిర్మాతలకు తీవ్రమైన నష్టం కలిగిస్తాయని అభిప్రాయపడింది.
‘యాంటీ-పైరసీ ఇంజంక్షన్’ అనేది కాపీరైట్ హక్కుదారులకు కోర్టులు ఇచ్చే ప్రత్యేక రక్షణ ఉత్తర్వు. దీని ద్వారా సినిమా లేదా వెబ్ సిరీస్‌ను పైరసీ చేసిన వెబ్‌సైట్లను వెంటనే బ్లాక్ చేయవచ్చు. అంతేకాదు, ఒక వెబ్‌సైట్‌ను నిలిపివేసిన తర్వాత అదే కంటెంట్ కొత్త యూఆర్‌ఎల్‌తో మళ్లీ ప్రత్యక్షమైనా.. వాటిపై కూడా ఆటోమేటిక్‌గా చర్యలు తీసుకునేలా డైనమిక్ ఇంజంక్షన్ ఆర్డర్లు సహాయపడతాయి.
ఇటీవల కొన్ని భారీ చిత్రాలు విడుదలకు ముందే లేదా విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్‌లైన్‌లో లీక్ అయిన ఘటనలు నిర్మాతలను కలవరపెట్టాయి. ముఖ్యంగా పెద్ద బడ్జెట్ చిత్రాలపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతోంది. దీంతో ‘పెద్ది’ మేకర్స్ ఈసారి ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ముందుగానే న్యాయపరమైన రక్షణ పొందారు.
మల్లీ స్టారర్ రూరల్ యాక్షన్ డ్రామా…
ఇక ‘పెద్ది’ విషయానికి వస్తే.. ఇది మల్టీ స్పోర్ట్స్ రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. రామ్ చరణ్ ఇందులో క్రికెటర్‌గా, రెజ్లర్‌గా, అథ్లెట్‌గా విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చాయి.
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, రవి కిషన్, శ్రీకాంత్ అయ్యంగార్, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
