Pongal | సంక్రాంతి 2026 ..టాలీవుడ్ బాక్సాఫీస్ రేస్‌లో చిరంజీవి ముందంజ?

Pongal |ప్రతి ఏడాది సంక్రాంతి అంటే టాలీవుడ్‌కు పండగే. స్టార్ హీరోల సినిమాలు పోటీగా రిలీజ్ అవుతూ థియేటర్లలో సందడి చేయడం సర్వసాధారణం. సాధారణంగా ఈ పండగకు రెండు లేదా మూడు క్రేజీ సినిమాలే బరిలో ఉండేవి.

  • By: sn |    movies |    Published on : Dec 20, 2025 7:14 PM IST
Pongal | సంక్రాంతి 2026 ..టాలీవుడ్ బాక్సాఫీస్ రేస్‌లో చిరంజీవి ముందంజ?

Pongal |ప్రతి ఏడాది సంక్రాంతి అంటే టాలీవుడ్‌కు పండగే. స్టార్ హీరోల సినిమాలు పోటీగా రిలీజ్ అవుతూ థియేటర్లలో సందడి చేయడం సర్వసాధారణం. సాధారణంగా ఈ పండగకు రెండు లేదా మూడు క్రేజీ సినిమాలే బరిలో ఉండేవి. కానీ ఈ ఏడాది మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఏకంగా ఐదు భారీ సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ రేస్ హీట్ పెరిగిపోయింది.

ఈ సంక్రాంతి పోటీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ ‘ది రాజాసాబ్’ కూడా ఉండటం విశేషం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీనికి రెండు రోజుల ముందే, జనవరి 10న ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ థియేటర్లలోకి రానుంది. ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి కామెడీ హారర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాను మారుతి దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచినా, ప్రభాస్ క్రేజ్‌కు తగినంత హైప్ మాత్రం ఇంకా రాలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఇక మాస్ మహారాజా రవితేజ కూడా ఈ సంక్రాంతికి తనదైన శైలికి భిన్నంగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 13న రిలీజ్ కానుంది. అషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

యంగ్ హీరోలు కూడా ఈ సంక్రాంతి రేస్‌లో వెనకడుగు వేయలేదు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత నవీన్ పొలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న విడుదల కానుంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. అదే రోజు శర్వానంద్ నటించిన ఫ్యామిలీ డ్రామా ‘నారీ నారీ నడుమ మురారీ’ కూడా థియేటర్లలోకి రానుంది. వీటితో పాటు దళపతి విజయ్ నటించిన తమిళ డబ్బింగ్ మూవీ ‘జననాయకుడు’ జనవరి 9న విడుదల కానుంది.

ఇన్ని సినిమాలు బరిలో ఉండటంతో సంక్రాంతి బాక్సాఫీస్ రేస్‌లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ ‘ది రాజాసాబ్’ పాన్ ఇండియా స్థాయిలో వస్తున్నా, ప్రచారంలో కొంత నెమ్మదిగా సాగుతుండటం గమనార్హం. దీనికి భిన్నంగా, అనిల్ రావిపూడి తనదైన మార్క్ ప్రమోషన్‌తో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను ప్రేక్షకుల దృష్టిలో నిలబెట్టడంలో సక్సెస్ అయ్యాడు.

ఈ పరిస్థితులన్నింటిని పరిశీలిస్తే, సంక్రాంతి రేస్‌లో స్పీడు తగ్గిన ‘ది రాజాసాబ్’ ను వెనక్కి నెట్టి, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సిక్స్ కొట్టే అవకాశాలు మెగాస్టార్ చిరంజీవి సినిమాకే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.