Rajinikanth | సినిమాల్లో హీరోలకు ఇంట్రో సీన్లు ఉంటాయి. కానీ సూపర్‌స్టార్ రజినీకాంత్ జీవితమే ఒక స్ఫూర్తిదాయకమైన సినిమా కథ. సాధారణ బస్సు కండక్టర్‌గా జీవితం ప్రారంభించిన శివాజీ రావ్ గైక్వాడ్.. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ‘తలైవా’గా ఎదిగారు. ఇప్పుడు ఆయన పాత బీఎంటీసీ ఐడీ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది.
ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ పాత ఐడీ కార్డులో రజినీకాంత్ అసలు పేరు ‘శివాజీ రావ్ గైక్వాడ్’ అని స్పష్టంగా కనిపిస్తోంది. బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో కండక్టర్‌గా పనిచేసిన సమయంలో తీసుకున్న ఈ గుర్తింపు కార్డు అప్పటి రోజుల్ని గుర్తు చేస్తోంది. ముఖ్యంగా శ్రీనగర్ డిపోలోని రూట్ నంబర్ 10A బస్సులో ఆయన విధులు నిర్వహించారనే వివరాలు అందులో ఉన్నాయి.
జీతం రూ. 275
ఈ ఐడీ కార్డులో మరో ఆసక్తికర విషయం కూడా అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. 1971లో రజినీకాంత్ నెల జీతం కేవలం రూ.275 మాత్రమే అని అందులో పేర్కొనబడింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న రజినీ.. ఒకప్పుడు వందల రూపాయల కోసం బస్సులో టిక్కెట్లు కొట్టేవారని తెలుసుకుని అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రజినీకాంత్ ప్రత్యేకత అప్పుడే మొదలైందని ఆయనతో పనిచేసిన వారు చెబుతుంటారు. బస్సులో ప్రయాణికులకు టిక్కెట్లు ఇవ్వడంలో కూడా ఆయనకు ఓ ప్రత్యేక స్టైల్ ఉండేదట. విజిల్ వేయడం, చిల్లర ఇవ్వడం, ప్రయాణికులతో మాట్లాడే తీరు అన్నీ ఎంతో స్టైలిష్‌గా ఉండేవని ఆయన పాత సహచరులు గుర్తుచేసుకుంటున్నారు. తర్వాత అదే స్టైల్ వెండితెరపై ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.
మూలాలు మరిచిపోలేదు..
రజినీకాంత్ జీవితంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఆయన స్నేహితుడు, బస్ డ్రైవర్ రాజ్ బహదూర్ ఒకరు. శివాజీ రావ్‌లో ఉన్న ప్రత్యేకతను తొలుత గుర్తించింది ఆయనేనని చెబుతారు. నటుడిగా ప్రయత్నించాలని ప్రోత్సహించి, చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి కూడా సహకరించారట.
ఇప్పటికీ రజినీకాంత్ తన మూలాలను మర్చిపోలేదు. కొన్ని రోజుల క్రితం బెంగళూరులోని జయనగర్ బీఎంటీసీ డిపోను ఆకస్మికంగా సందర్శించిన ఆయన.. అక్కడి డ్రైవర్లు, కండక్టర్లతో ఆప్యాయంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో ఆయనలో సూపర్‌స్టార్ కన్నా పాత కండక్టర్ శివాజీ ఎక్కువగా కనిపించాడని అక్కడి సిబ్బంది భావోద్వేగానికి గురయ్యారు.
ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమాతో రజినీకాంత్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పోస్టర్‌లో కనిపించిన కండక్టర్ బ్యాడ్జ్ నంబర్ కూడా కొద్ది రోజుల పాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అది రజినీ పాత బ్యాడ్జ్ నంబరేనని అభిమానులు భావించినా, తర్వాత అది దర్శకుడు లోకేష్ తండ్రికి సంబంధించినదని వెల్లడైంది.
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.. కష్టపడి ప్రపంచ స్థాయి స్టార్‌గా ఎదగడం నిజంగా అరుదైన విషయం. అందుకే రజినీకాంత్ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ వైరల్ ఐడీ కార్డు మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేసింది.. “ఎంత ఎత్తుకు ఎదిగినా.. వచ్చిన దారిని మర్చిపోకూడదు.”
