Ram Charan | మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ తండ్రీకొడుకులుగా వీరిద్దరూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. తాజాగా ఒక ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రామ్ చరణ్ మాట్లాడుతూ, తన జీవితంలో నిజమైన హీరో తన తండ్రే అని గర్వంగా తెలిపారు. “నాన్న వారసత్వాన్ని మేము చాలా సులభంగా అందిపుచ్చుకున్నాం. ఎంత స్టార్‌డమ్ ఉన్నా ఇంట్లో మాత్రం ఆయన చాలా సాధారణంగా ఉంటారు. అదే ఆయనలో నాకు ఎంతో నచ్చే విషయం” అని చెప్పారు.
ఆయనే నాకు స్పూర్తి..
చిరంజీవి పనిపట్ల చూపే అంకితభావాన్ని కూడా చరణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. షూటింగ్స్ సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. సినిమాల కోసం ఆయన పడే కష్టం తనకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కుటుంబాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని చరణ్ వెల్లడించారు. వరుస షూటింగ్స్ మధ్యలో మూడు రోజుల విరామం దొరికినా, ఆ సమయాన్ని పూర్తిగా కుటుంబ సభ్యులతో గడిపేవారని చెప్పారు. పనిని, కుటుంబాన్ని సమతుల్యంగా ఎలా నిర్వహించాలో తండ్రిని చూసే నేర్చుకున్నానని తెలిపారు.
నాన్న తరచు చెప్పే మాటలు ఇవే..
ప్రపంచం ఎప్పుడూ విమర్శలు, నెగెటివిటీకి సిద్ధంగా ఉంటుంది. కానీ మనపై మనకు నమ్మకం ఉంటే ఎవరూ మనల్ని దెబ్బతీయలేరు” అని చిరంజీవి తరచూ చెప్పే మాటలను చరణ్ గుర్తు చేసుకున్నారు. ఆత్మగౌరవం, నమ్మకం, దృఢత్వం జీవితంలో ఎంత ముఖ్యమో ఆయన ద్వారా నేర్చుకున్నానని అన్నారు.
ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’లో నటిస్తున్నారు. మొదటగా ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. జూన్‌లో మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
