Ramana Gogula | తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన సంగీతంతో గుర్తింపు పొందిన ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నో సూపర్ హిట్ పాటలు అందించి ఒక దశాబ్దం పాటు టాలీవుడ్‌ను తన సంగీతంతో ఊపేసిన ఆయన… ఇటీవల సినిమాలకు కొంత విరామం ఇచ్చినా, అప్పుడప్పుడూ ప్రత్యేకంగా ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నారు.
ఇటీవల వెంకటేష్ – అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో “గోదారి గట్టుమీద రామచిలకవే” అనే పాట పాడి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ పాట సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో రమణ గోగుల పేరు మళ్లీ ట్రెండ్‌లోకి వచ్చింది.
గుండుతో కనిపించే కారణం ఇదే!
రమణ గోగుల ఎప్పుడూ గుండుతోనే కనిపించడం చాలా మందికి ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇది కేవలం స్టైల్ కోసం కాదు… దాని వెనుక ఒక గాఢమైన భావోద్వేగం, భక్తి కలగలిపిన కథ ఉంది.
జీవితాన్ని మార్చిన సంఘటన
రమణ గోగుల జాని సినిమాకు పని చేస్తున్న సమయంలో, ఆయన భార్య గర్భవతిగా ఉన్నారు. అయితే ఆ సమయంలో డాక్టర్లు ఆమె ఆరోగ్యం బాగాలేదని, డెలివరీ చాలా క్లిష్టంగా ఉండొచ్చని చెప్పారు. ఈ వార్తతో తీవ్ర ఆందోళనకు గురైన రమణ గోగుల… ఆ పరిస్థితిలో ఏమి చేయాలో అర్థంకాకపోయారు.
తిరుపతిలో మొక్కు
ఆ సమయంలో ఆయన టీమ్‌లోని ఒక సభ్యుడు తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లి మొక్కు తీర్చుకోవాలని సూచించాడట. ఆ సలహా మేరకు రమణ గోగుల తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించారు. అనూహ్యంగా ఆ తర్వాత పరిస్థితి మారి, ఆయన భార్యకు సాధారణ డెలివరీ జరిగిందని తెలుస్తోంది.
ఆ ఆనంద క్షణంలో రమణ గోగుల ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జీవితాంతం గుండుతోనే ఉండాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
అభిమానులను కదిలిస్తున్న కథ
సినీ ప్రముఖులు తెరపై ఎలా కనిపించినా, వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి భావోద్వేగ సంఘటనలు ఉంటాయని ఈ కథ మరోసారి గుర్తు చేస్తోంది.
రమణ గోగుల గుండుతో కనిపించడం వెనుక ఉన్న ఈ భక్తి, ప్రేమ, భావోద్వేగం కలగలిపిన కథ తెలుసుకున్న నెటిజన్లు… ఆయనపై మరింత గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారు.
