Rashmika | ఇటీవల రష్మిక తన బర్త్ డేని గ్రాండ్‌గా జరుపుకున్న విషయం తెలిసిందే. రష్మిక స్వస్థలమైన కూర్గ్ (కొడగు)లో జరిగిన ఈ వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు. పుట్టినరోజు సందర్భంగా రష్మిక తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి పాడి శ్రీ ఇగ్గుతప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. కొడవ సంప్రదాయ దుస్తుల్లో ఈ జంట మెరిసిపోవడంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వేడుకల్లో భాగంగా ఈ జంట సామాజిక సేవ కార్యక్రమాలు కూడా చేపట్టింది. తమ గ్రామ ప్రజలకు అన్నదానం నిర్వహించడం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రకటించడం ద్వారా వారి ఉదారతను చాటుకున్నారు. అభిమానుల చర్యలకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
విల్లాకు ప్రత్యేక పేరు…
అయితే ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది రష్మిక తండ్రి ఇచ్చిన ప్రత్యేక కానుక. రష్మిక తండ్రి మదన్ ఆమెకు విరాజ్‌పేట సమీపంలో ఉన్న ఖరీదైన విల్లాను బహుమతిగా ఇచ్చారు. ఈ విల్లాకు ‘సెరెనిటీ’ అనే పేరు పెట్టడం విశేషం. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనై, పెళ్లి తర్వాత కూతురికి చిరస్మరణీయమైన కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
గత ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం జరిగింది. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఇప్పుడు ఈ పుట్టినరోజు వేడుకలతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది.
హిందీ చిత్ర సీమలోను హవా…
ఇక రష్మిక కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. గతంలో విజయ్ దేవరకొండతో కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ జంట, త్వరలో మళ్లీ రాహుల్ సంకృత్యయన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రణబాలి’ చిత్రంలో కలిసి నటించనుంది.
హిందీ చిత్రసీమలో కూడా రష్మిక తన హవాను కొనసాగిస్తోంది. షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాక్‌టెయిల్-2’ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. హొమి అదజనియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 19, 2026న విడుదల కానుంది. ఆధునిక సంబంధాలు, ప్రేమ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
