Serial Actor | మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వీకెండ్ ట్రిప్ కోసం వెళ్లిన ఎనిమిది మంది స్నేహితులు ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ముంబైకి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌గఢ్ జిల్లాలోని అంబెనాలి ఘాట్ సెక్షన్‌లో ఈ విషాదకర ఘటన జరిగింది. ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన ఎస్‌యూవీ వాహనం దాదాపు వెయ్యి అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరాఠీ టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితమైన ‘అప్పీ ఆమ్చీ కలెక్టర్’ సీరియల్ నటుడు మహేష్ పవార్ (25) కూడా మరణించడం సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. యువ నటుడి ఆకస్మిక మృతితో సహనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఘోర ప్రమాదం..
పోలీసుల వివరాల ప్రకారం.. మృతులంతా 19 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన యువకులు. వీరంతా సతారా, రత్నగిరి జిల్లాలకు చెందిన స్నేహితులు. ఆదివారం తెల్లవారుజామున దాపోలిలోని హర్నే ప్రాంతం నుంచి ఎస్‌యూవీ వాహనంలో బయలుదేరిన వారు, సతారా వైపు ప్రయాణిస్తున్నారు. అయితే వారు గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చివరిసారిగా బాధితుల ఫోన్లు పొలాడ్‌పూర్ సమీపంలోని మొబైల్ టవర్ పరిధిలో యాక్టివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అంబెనాలి ఘాట్ ప్రాంతంలో పోలీసులు, స్థానిక రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
సోమవారం ఉదయం ఘాట్ రోడ్డుకు సమీపంలోని లోతైన లోయలో ఛిద్రమైన ఎస్‌యూవీ వాహనం కనిపించింది. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. దాదాపు వెయ్యి అడుగుల లోతులో పడిపోవడంతో అందులో ఉన్న వారెవరూ ప్రాణాలతో బయటపడలేదు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని రితేష్ లోఖండే (22), సుహాస్ లోఖండే (20), ఉత్కర్ష్ షింగ్తే (21), నిఖిల్ షింగ్తే (25), మహేష్ పవార్ (25), ఆదిత్య సలుంఖే (21), రాజేష్ కాట్కర్ (35), అలాగే రత్నగిరికి చెందిన అన్ష్ చాహ్వాన్ (19)గా పోలీసులు గుర్తించారు. సరదాగా విహారయాత్రకు వెళ్లిన యువకులు ఒక్కసారిగా మృత్యువాత పడటంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గాఢ సానుభూతి తెలియజేస్తూ, సహాయక చర్యలను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నామని వెల్లడించారు. లోయ చాలా లోతుగా ఉండటంతో మృతదేహాల వెలికితీత కష్టసాధ్యంగా మారిందన్నారు. ఇప్పటివరకు మూడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
