Sreeleela | ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్ పట్టా అందుకున్న నటి శ్రీలీల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సక్సెస్ పార్టీలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఆ కార్యక్రమంలో శ్రీలీల మాట్లాడుతూ, తన పాటల షూటింగ్ సమయంలో పీరియడ్స్‌లో ఉన్నప్పటికీ పని చేసానని, కాబట్టి అది ఎక్కడా ఒక సాకుగా తీసుకోకూడదని అన్నారు. సమానత్వం గురించి మాట్లాడేటప్పుడు మహిళలు శారీరక పరిమితులను దాటి ఆలోచించాలని, మానసికంగా గానీ శారీరకంగా గానీ ఏదీ ఒక అడ్డంకిగా మారకూడదని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా, ఒక వైద్యురాలిగా ఉండి కూడా ఇలాంటి సున్నితమైన అంశంపై ఇలాంటి కామెంట్స్ చేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. పీరియడ్స్ అనుభవం ప్రతి మహిళలో వేర్వేరుగా ఉంటుందని, కొందరికి తీవ్రమైన నొప్పి, అలసట వంటి సమస్యలు ఉంటాయని గుర్తు చేశారు.
బాధ్యతగా వ్యవహరించాలి..
కొంతమంది యూజర్లు తీవ్ర విమర్శలు చేస్తూ, “డాక్టర్ అయి ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరం” అని కామెంట్ చేశారు. మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తూ, “ఒక్కరికొచ్చే శక్తి అందరికీ ఉండదు” అని పేర్కొన్నారు. మరోవైపు, మహిళల ఆరోగ్య సమస్యలను తేలికగా తీసుకోవద్దని, ముఖ్యంగా పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్‌లలో మాట్లాడేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
వరుస సినిమాలతో సందడి..
ప్రస్తుతం ఈ వివాదంపై శ్రీలీల వైపు నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయితే ఈ అంశం సోషల్ మీడియాలో ఇంకా హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. సినిమాల విషయానికొస్తే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత శ్రీలీల మరిన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న హిందీ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ సరసన నటించనున్నారు. అలాగే, ధనుష్ హీరోగా రూపొందుతున్న ఓ తమిళ సినిమాలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాల వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.
ఈ వివాదం మధ్యలోనూ, శ్రీలీల తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తూ వరుస అవకాశాలను అందుకుంటుండటం గమనార్హం. అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
