Peddi | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సర్వం సిద్ధమైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌కు విశేష స్పందన లభిస్తుండగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వం చిత్ర యూనిట్‌కు మరో శుభవార్త చెప్పింది. ‘పెద్ది’ సినిమా టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రత్యేక జీవో జారీ చేసింది. దీంతో చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే మరోవైపు సినిమా చూసేందుకు సిద్ధమవుతున్న అభిమానులు మాత్రం అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
ప్రత్యేక షోలకి అనుమతి..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, జూన్ 3 రాత్రి నిర్వహించనున్న ప్రత్యేక ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించారు. విడుదలకు ముందే అభిమానులకు సినిమా చూసే అవకాశం కల్పించేందుకు ప్రత్యేక షోలకు అనుమతులు ఇచ్చారు. ఇక సాధారణ ప్రదర్శనల విషయంలో కూడా ప్రభుత్వం సడలింపులు కల్పించింది. జూన్ 4 నుంచి జూన్ 13 వరకు పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరపై అదనంగా రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. ఈ కాలపరిమితి ముగిసిన తర్వాత తిరిగి సాధారణ టికెట్ ధరలే అమల్లోకి రానున్నాయి.
అయితే ఈ అనుమతులతో పాటు ప్రభుత్వం కొన్ని కీలక నిబంధనలను కూడా విధించింది. పెరిగిన టికెట్ ధరల ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ కార్మికుల సంక్షేమ నిధికి జమ చేయాలని స్పష్టం చేసింది. ఈ నిధులు పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించబడనున్నాయి. అదేవిధంగా థియేటర్లలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే ప్రత్యేక ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు పర్యవేక్షించనున్నారు.
నేటి రాత్రి నుండే పెద్ది సందడి..
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ‘పెద్ది’ సినిమాకు టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బుధవారం రాత్రి నుంచే ‘పెద్ది’ సందడి ప్రారంభం కానుంది.
రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించే సినిమాల్లో ఒకటిగా ‘పెద్ది’ నిలుస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై అభిమానుల అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
