Tollywood | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికు చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఘనంగా స్వాగతించగా, ప్రభుత్వం కూడా దీనిని చారిత్రక విజయంగా అభివర్ణిస్తూ వేడుకలు నిర్వహించేందుకు పిలుపునిచ్చింది.
దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు అమరావతి విజయాన్ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేంద్ర స్థాయిలో కూడా ఈ నిర్ణయానికి విస్తృత మద్దతు లభించగా, వివిధ పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయడం గమనార్హం.
టాలీవుడ్ మౌనం..
అయితే, ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ మౌనం ఇప్పుడు చర్చకు దారితీసింది. అమరావతి వంటి ప్రతిష్టాత్మక అంశంపై టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, దర్శకులు స్పందించకపోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రముఖులెవరూ ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటివరకు దర్శకుడు బోయపాటి శ్రీను మాత్రమే అమరావతి విజయంపై స్పందించగా, మిగతా ప్రముఖులు మౌనం పాటించడం విమర్శలకు దారితీస్తోంది. “సినిమా షూటింగులకు అనుమతులు, టికెట్ ధరల పెంపు, స్టూడియోలకు భూములు వంటి అంశాల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించే సినీ ప్రముఖులు, రాజధాని అంశంలో ఎందుకు స్పందించడం లేదు?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
అలాగే, సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖులు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో నంది అవార్డుల వంటి అంశాలపై గళమెత్తిన వారు, ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ఆ భయంతోనే..
సాధారణంగా సామాజిక అంశాలపై స్పందించే సినీ ప్రముఖులు ఇలాంటి కీలక సమయంలో మౌనం పాటించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, వంటి స్టార్ హీరోలు ఇప్పటివరకు ఈ అంశంపై బహిరంగంగా స్పందించలేదు.
కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై మాట్లాడితే అభిమాన వర్గాలు విడిపోతారనే భయంతో , హీరోలు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిన హీరోలు తమ ఇమేజ్‌ను దెబ్బతీయకుండా ఉండేందుకు ఇలాంటి విషయాల్లో తటస్థంగా ఉంటున్నారేమో అని కొందరు ముచ్చటించుకుంటున్నారు.
మౌనంపై విమర్శలు..
ఇక అమరావతి అంశం భావోద్వేగాలతో ముడిపడి ఉండటంతో, ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఈ విజయాన్ని రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా చూస్తుంటే, మరోవైపు సినీ ప్రముఖుల మౌనం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తంగా, అమరావతి విజయంపై టాలీవుడ్ స్పందించకపోవడం , సినీ ప్రముఖుల సామాజిక బాధ్యతపై మళ్లీ చర్చకు తావిచ్చింది. ఈ మౌనం వెనుక కారణాలు ఏమిటన్నది ఆసక్తికరంగా మారగా, భవిష్యత్తులో అయినా ప్రముఖులు స్పందిస్తారా లేదా అన్నది చూడాలి.
