Upasana | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘పెద్ది’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటన, బుచ్చిబాబు మేకింగ్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. విడుదలైన తొలి షో నుంచే ‘పెద్ది’ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తూ భారీ చర్చకు దారితీసింది.

తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మెగా అభిమానుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. భారీ కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ, బాణసంచా కాలుస్తూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని మాస్ యాక్షన్ సన్నివేశాలు, రామ్ చరణ్ ఊరమాస్ ఎంట్రీ, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఉపాస‌న సంద‌డి..

ఇదిలా ఉంటే, ‘పెద్ది’ ప్రీమియర్ షో సందర్భంగా రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా థియేటర్‌లో సందడి చేశారు. హైదరాబాద్ బాలానగర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన ఆమె, అభిమానుల మధ్య కూర్చొని సినిమాను ఆస్వాదించారు. సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తూ ప్రతి కీలక సన్నివేశానికి స్పందించడం అక్కడి అభిమానులను ఆకట్టుకుంది.

ముఖ్యంగా రామ్ చరణ్ మాస్ ఎంట్రీ, యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చే సమయంలో ఉపాసన కూడా అభిమానులతో కలిసి కేకలు వేస్తూ, విజిల్స్ వేస్తూ, పేపర్లు విసురుతూ పూర్తి ఉత్సాహంతో కనిపించారు. ఆమె స్పందనను అభిమానులు మొబైల్ కెమెరాల్లో బంధించగా, ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మెగా ఆనందం…

ఉపాసన థియేటర్‌లో అభిమానులతో కలిసి ఇలా ఎంజాయ్ చేయడంపై మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ విజయాన్ని తన విజయంగా భావిస్తూ ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచే ఉపాసన నిజమైన సపోర్ట్ సిస్టమ్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. “రామ్ చరణ్‌కు దొరికిన అతిపెద్ద బలం ఉపాసనే” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తుండగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.