Ustaad Bhagat Singh | బాక్సాఫీస్ వద్ద నిరాశప‌రిచిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఓటీటీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధం

Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ సమాంతరంగా రాణిస్తూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజీ’తో మంచి విజయాన్ని అందుకున్న పవన్, అదే ఊపులో దర్శకుడు హరీష్ శంకర్‌తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి

  • By: Sandeep |    movies |    Published on : Mar 31, 2026 1:10 PM IST
Ustaad Bhagat Singh | బాక్సాఫీస్ వద్ద నిరాశప‌రిచిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఓటీటీలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధం పోలీస్ గెటప్‌లో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్ – ఉస్తాద్ భగత్ సింగ్ హైలైట్ సీన్.. గబ్బర్​సింగ్​లా కాకుండా.. సీరియస్​ టోన్​

Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాల్లోనూ సమాంతరంగా రాణిస్తూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజీ’తో మంచి విజయాన్ని అందుకున్న పవన్, అదే ఊపులో దర్శకుడు హరీష్ శంకర్‌తో చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ ఏర్పడింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మార్చి 19, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ట్రైలర్లు, టీజర్లతో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

హరీష్ శంకర్ స్టైల్ డైలాగులు, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ, పాత తరహా కథనం, ఊహించదగిన సన్నివేశాలు, స్లో స్క్రీన్‌ప్లే సినిమాకు మైనస్‌లుగా మారాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్, అర్బన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సినిమా విఫలమైందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

రూ.92 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు..

ఈ చిత్రానికి సుమారు రూ. 122.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ. 123 కోట్ల షేర్ అవసరముండగా, ఇప్పటివరకు కేవలం రూ. 92 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు.

అంతేకాకుండా అదే సమయంలో విడుదలైన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్లపై మరింత ప్రభావం పడింది. రోజురోజుకూ కలెక్షన్లు పడిపోవడంతో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఓటీటీలో సంద‌డికి సిద్ధ‌మా?

ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన ఐదు వారాల తర్వాత, అంటే ఏప్రిల్ 23 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. థియేటర్లలో నిరాశపరిచిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీలో అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.