Varanasi | టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌గా నిలిచిన వారణాసి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి యూనిట్ దాదాపు నిరంతరంగా పని చేస్తూ వస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం నిర్మాతలు భారీ ఖర్చుతో అద్భుతమైన సెట్స్‌ను నిర్మించినట్లు సమాచారం. రాజమౌళి స్టైల్‌కు తగ్గట్టుగా ఈ సాంగ్ గ్రాండ్‌గా, విజువల్‌గా అద్భుతంగా ఉండబోతుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
మేలో కొంత విరామం..
ఈ ప్రత్యేక గీతానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ నేతృత్వం వహిస్తున్నారు. బాలీవుడ్, సౌత్ చిత్రాల్లో తనదైన స్టైల్‌తో గుర్తింపు పొందిన బాస్కో ఈ పాటను వినూత్నంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నటీనటుల ఎనర్జీ, బాస్కో కొరియోగ్రఫీ కలిసి ఈ సాంగ్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇక హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర యూనిట్ మే నెలలో కొంతకాలం విరామం తీసుకోవాలని నిర్ణయించింది. తీవ్ర ఎండల కారణంగా షూటింగ్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు, సాంకేతిక బృందానికి విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బ్రేక్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ విరామ సమయంలో రాజమౌళి తదుపరి షెడ్యూల్ ప్లానింగ్‌తో పాటు గ్రాఫిక్స్ పనులపై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.
విదేశీ షెడ్యూల్స్..
సమ్మర్ బ్రేక్ అనంతరం జూన్ నెలలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఆ సమయంలో వాతావరణం అనుకూలంగా ఉండటంతో ముఖ్యమైన అవుట్‌డోర్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌తో సినిమాలో కీలక భాగం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక విదేశీ షెడ్యూల్స్ కూడా ఈ చిత్రానికి కీలకంగా మారనున్నాయి. పశ్చిమాసియాలో ప్రస్తుతం పరిస్థితులు కొంత స్థిరపడుతున్న నేపథ్యంలో, విదేశాల్లో చిత్రీకరణకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా అమెరికా, మధ్యప్రాచ్య దేశాల్లో చిత్రీకరించాల్సిన సన్నివేశాలకు సంబంధించి ప్రత్యేక ప్లానింగ్ జరుగుతోంది.
భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో రికార్డులు సృష్టించిన రాజమౌళి, ‘వారణాసి’తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
